35 ~ Chinna Katha Kaadu Movie Announcement: టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి సమర్పణలో కొత్త సినిమా అనౌన్స్ అయ్యింది. మలయాళీ బ్యూటీ నివేదా థామన్ ప్రధాన పాత్రలో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వివరాలను చిత్రబృందం ప్రకటించింది. టైటిల్ తో పాటు నటీనటులు, విడుదల తేదీని వెల్లడిస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ’35- చిన్న క‌థ కాదు’ అనే పేరు పెట్టారు. ఈ సినిమాలో నివేదాతో పాటు యంగ్ యాక్టర్లు ప్రియ‌ద‌ర్శి, విశ్వ‌దేవ్ ఇతర కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. నంద కిషోర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ ఆగ‌స్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.


ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ’35- చిన్న క‌థ కాదు’ 


ఈ సినిమా ఓ తల్లి, ఆమె ఇద్దరు పిల్లల మధ్య సంఘర్షణ, ప్రేమ, అనురాగంతో కూడిన కథతో రూపొందబోతోంది. ఇద్దరు పిల్లల్లో ఒకడు చాలా తెలివైన వాడు. కుటుంబాన్ని ఎంతో గౌరవిస్తాడు. అదే సమయంలో తన ఫ్యామిలీ ఎదుర్కొంటున్న సమస్యల నడుమ నలిగిపోతాడు. మరో కుర్రాడు కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఇష్టపడడు. మ్యాథ్స్ ను లాజిక్ లెస్ సబ్జెక్టుగా భావిస్తాడు. మ్యాథ్స్ ఫండమెంట్స్ తప్పంటూ స్కూల్ కు వెళ్లడు. తల్లి చెప్పే మాటలను విని జీవిత పాఠాలను ఎలా నేర్చుకుంటాడనే కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఈ ఫ్యామిలీ ఎమోషనల్ కథ అందరినీ ఆకట్టుకుంటుందని మేకర్స్ వెల్లడించారు.


చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా చేస్తున్న నివేదా


మలయాళీ బ్యూటీ నివేదా థామస్ గత కొంతకాలంగా తెలుగులో సినిమాలు చేయడం తగ్గించింది. చివరగా ఆమె ‘శాకిని డాకిని’ అనే సినిమాలోకనిపించింది. చాలా గ్యాప్ తర్వాత ‘35- చిన్న క‌థ కాదు’ సినిమా చేస్తోంది. ఈ మూవీపై ఆమె భారీగా అంచనాలు పెట్టుకుంది. నిజానికి నాని హీరోగా నటించిన ‘జెంటిల్ మెన్’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన నివేదా. తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. అందం, అభినయంతో అలరించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. తక్కువ సినిమాలే చేసినా, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.






ఆకట్టుకుంటున్న ‘35- చిన్న క‌థ కాదు’ సినిమా పోస్టర్


టాలీవుడ్ స్టార్ హీరో రానా నటుడిగానే కాకుండా నిర్మాతగానూ రాణిస్తున్నారు. చక్కటి కథలతో చిన్న సినిమాలను నిర్మిస్తున్నారు. మీడియం రేంజ్ యాక్టర్లతో సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్నారు. అందులో భాగంగానే ’35- చిన్న క‌థ కాదు’ సినిమాను సమర్పిస్తున్నారు.  తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో తిరుపతి ఆలయ ముఖ ద్వారాన్ని చూపించారు. గుడి మెట్ల మీద ఓ చిన్న కుటుంబం కూర్చొని ఉంది.  సినిమా పోస్టర్ చూడ్డానికి చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. సినిమా పేరు కూడా ముగ్గుతో అలంకరించి కనిపిస్తోంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ సినిమాపై ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం సమకూర్చగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. వాల్తేరు ప్రొడక్షన్స్‌ పై విశ్వదేవ్ రాచకొండ, ఎస్ ఒరిజినల్‌పై సృజన్ యరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సౌత్‌బే మార్కెటింగ్ పార్ట్ నర్ గా ఉండబోతోంది.


Read Also: అనుష్క హీరోయిన్ కావడానికి కారణం నేను, అసలు విషయం చెప్పిన పశుపతి!