Ram Gopal Varma: హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ‘ఓపెన్ హైమర్’ సినిమాపై ఇండియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీ సక్సెస్ తో దూసుకుపోతుంటే ఒక్క ఇండియాలో మాత్రం మూవీలోని ఒక సన్నివేశం సినిమాపై విమర్శలకు దారితీసింది. సినిమాలో ఒక బోల్డ్ సన్నివేశం సమయంలో హీరో భగవద్గీతను చదువుతున్నట్టు చూపించారు. ఇదే ఇప్పుడు విమర్శలకు దారితీసింది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది. మూవీను బ్యాన్ చేయాలంటూ కామెంట్లు చేస్తున్నారు. పలువురు ప్రముఖులు కూడా దీనిపై స్పందించారు. తాజాగా ఈ వివాదం పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 


ఎంతమంది భగవద్గీతను చదివారు: రామ్ గోపాల్ వర్మ


గత కొన్ని రోజులుగా ‘ఓపెన్ హైమర్’ సినిమాపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. మూవీలో శృంగార సన్నివేశం సమయంలో భగవద్గీతను చదవడాన్ని చాలా మంది భారతీయులు వ్యతిరేకిస్తున్నారు. ఇలా చేయడం భగవద్గీతను అవమానించినట్టేనని, హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతను ఇలా చూపించడం సరికాదని అంటున్నారు. వెంటనే మూవీలో ఆ సన్నివేశాలను తొలగించాలని లేదా మూవీను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై నెట్టింట చర్చ జరుగుతోంది. అయితే రీసెంట్ గా దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. ‘‘అమెరికన్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ భగవద్గీతను చదివారు. మరి మన భారతీయుల్లో 0.0000001% మంది అయినా భగవద్గీతను చదివారో లేదో’’ అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశాడు. 


వర్మకు కౌంటర్ ఇస్తోన్న నెటిజన్స్..


దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ కు మిశ్రమ స్పందన వస్తోంది. ఆయన చేసిన ట్వీట్ కు కొంతమంది భగవద్గీతను చదవలేదు అని ఒప్పుకుంటుంటే ఎక్కువ శాతం మంది ఆర్జీవికు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ‘‘ఆర్జీవి చెప్పినట్టు మన దేశ జనాభా 150 కోట్లు అనుకుంటే అందులో 0.0000001% మంది అంటే 1.5 కచ్చితంగా ఇద్దరు చదివారు’’ అంటూ కౌంటర్ వేస్తున్నారు. మరికొందరు ‘‘ఆర్జీవికు ఆధ్యాత్మిక జ్ఞానం శూన్యం’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఆర్జీవి చేసిన ట్వీట్ కు స్పందిస్తున్నారు నెటిజన్స్. 


సెన్సార్ బోర్డ్ ను ప్రశ్నించిన కేంద్ర మంత్రి..


‘ఓపెన్ హైమర్’ వివాదం పై ఇటీవలే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఆ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శృంగార సన్నివేశంలో భగవద్గీత చదివించేలా చూపించడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఇందులో అభ్యంతరకరమైన సన్నివేశాలను సెన్సార్‌ బోర్డు తొలగించకపోవడంపై మండిప‌డ్డారు. అసలు సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఎలా స‌ర్టిఫికెట్ ఇచ్చింద‌ని ప్ర‌శ్నించారు. వెంట‌నే స‌న్నివేశాల‌ను తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు అనురాగ్. మరోవైపు భారత ప్రభుత్వ సమాచార కమిషనర్ ఉదయ్ మహుర్కర్ కూడా ఈ సన్నివేశంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దానిని చిత్రం నుండి తొలగించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు దర్శకుడు నోలన్ కు ఓ లేఖ రాశారాయన. 






Also Read: ఈ వారం థియేటర్లు - ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే - ఓ లుక్ వేసేయండి!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial