కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు మెట్రోస్టేషన్‌పై నుంచి ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జులై -23 అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. సుమారు 45 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి రెడ్ టీషర్టు వేసుకొని ఉన్నాడు. మెట్రో స్టేషన్ కంట్రోలర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
మెట్రో స్టేషన్ పై నుంచి దూకే వారి సంఖ్య పెరుగుతోంది. 2019 సెంప్టెంబర్ 19న ఓ వ్యక్తి చైతన్యపురి మెట్రో స్టేషన్‌పై నుంచి ఓ వ్యక్తి దూకి గాయపడ్డాడు. అతన్ని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.
2021 అక్టోబర్‌లో మరో వ్యక్తి దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్పాట్‌లోనే చనిపోయాడు. అదే ఏడాది నవంబర్ 12న ఓ విద్యార్థి అమీర్‌పేట మెట్రో స్టేషన్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
2022 ఫిబ్రవరి 12న నిజాబాద్‌కు చెందిన రాజు అనే వ్యక్తి ప్రకాష్‌నగర్ మెట్రోల స్టేషన్ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. అదే ఏడాది ఏప్రిల్‌లో ఇంకో ఘటన జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఈఎస్‌ఐ మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది.
2023 జనవరిలో మక్తల్‌కు చెందిన ఓ మహిళ ఆర్థిక ఇబ్బందులతో మెట్రో స్టేషన్‌పై సూసైడ్ చేసుకుంది. భరత్‌నగర్ మెట్రోస్టేషన్ రైలింగ్‌పై నుంచి దూకింది. ఆ తర్వాత రోజే అంటే జనవరి 5న రాత్రి9 గంటలకు ఓ వ్యక్తి కదులుతున్న మెట్రో ట్రైన్ ముందు పడి చనిపోయాడు. మూసాపేట మెట్రో స్టేషన్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఇప్పుడు జులైలో మరో వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు.
ఇలా మెట్రో స్టేషన్‌పై నుంచి దూకడం, ట్రైన్స్ ముందు పడి సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనికి మెట్రో నిర్వహకులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రతి ప్లాట్‌ఫామ్‌పై సెక్యూరిటీ గార్డు ఉండేవాళ్లని ఇప్పుడు కొన్ని సమయాల్లో మినహా గార్డు ఉండటం లేదని అంటున్నారు. అలాంటి సమయంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్టు చెబుతున్నారు.
నిర్వహణపై విమర్శలు
మెట్రో స్టేషన్లు, బోగీల నిర్వహణపై ఆరోపణలు ఉన్నాయి. గతంతో పోలిస్తే మెట్రో స్టేషన్‌ల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని విమర్శలు బలంగానే ఉన్నాయి. చిన్న చినుకులు పడినా ప్లాట్‌ఫామ్‌పై ఉండలేని పరిస్థితి ఉందని, ట్రైన్‌లో కూడా లీకులు వస్తున్నాయని అంటున్నారు. ఉదయం మొదటి ట్రైన్ డోర్స్ ఓపెన్ చేస్తే ఘోరమైన కంపు కొడుతున్నాయి. క్లీనింగ్ చేయడం లేదని చాలా మంది ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
స్టేషన్‌లలో కూడా చెత్త పేరుకుపోతుంది. ఎస్కలేటర్ నిర్వహణలో కూడా చాలా లోపాలు ఉన్నట్టు ప్రయాణికులు చెబుతున్నారు. ఇలా ప్రతి విషయంలో మెట్రో నిర్వహణ లోపాలు ఉన్నాయని చెబుతున్నారు.