Ram Charan Review On Tillu Square: టాలీవుడ్ క్రేజీ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్క్వేర్’. రెండు సంవత్సరాల క్రితం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘డీజే టిల్లు’కు సీక్వెల్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్చి 29న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. తొలి షో నుంచే మంచి హిట్ టాక్ తెచ్చుకున్నది. సిద్ధు నేచురల్ యాక్టింగ్, అదిరిపోయే పంచులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. వసూళ్ల పరంగానూ ఈ చిత్రం సత్తా చాటుతోంది. 10 రోజుల్లో సుమారు రూ. 100 కోట్ల మార్కును దాటింది. వరుస సెలవులు వస్తున్న నేపథ్యంలో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
‘టిల్లు స్క్వేర్’ టీమ్ ను ఇంటికి పిలిచి అభినందించిన మెగాస్టార్
ఈ సినిమాపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. సినిమా అద్భుతంగా ఉందని అభినందించారు. రీసెంట్ గా 'టిల్లు స్క్వేర్' సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి.. చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. సినిమా అద్భుతంగా ఉందని చెప్పడంతో పాటు వారిని ఇంటికి పిలిపించి మరీ అభినందించారు. ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత సీక్వెల్ మూవీ మీద భారీగా అంచనాలు ఉంటాయని, వాటిని అందుకోవాలంటే చాలా కష్టపడాలని చెప్పారు. ఆ అరుదైన ఫీట్ ను ‘టిల్లు స్క్వేర్’ టీమ్ సాధించిందని ఆయన వెల్లడించారు. ఈ సినిమా అందరినీ బాగా ఆకట్టుకుంటుందని చెప్పారు.
టిల్లుపై చెర్రీ ప్రశంసల జల్లు
ఇక తాజాగా ఈ సినిమా చక్కటి విజయాన్ని సాధించడం పట్ల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. హీరో, హీరోయిన్లతో పాటు చిత్ర బృందం పైన ప్రశంసలు కురిపించారు. “డియర్ సిద్ధు... మీ సినిమా అద్భుత విజయం సాధించడం పట్ల సంతోషంగా ఉంది. గర్వంగా ఉంది. ఈ విజయంలో భాగమైన అనుపమ, మల్లిక్ రామ్, సంగీత దర్శకుడు, సితార ఎంటర్ టైన్మెంట్స్ తో పాటు టిల్లు టీమ్ అంతటికీ నా హృదయపూర్వక అభినందనలు” అని ట్విట్టర్ వేదికగా అభినందించారు.
ఇక టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, రింగుల జుట్టు ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ 'టిల్లు స్క్వేర్'లో హీరో, హీరోయిన్లుగా నటించారు. దర్శకుడు మల్లిక్ రామ్ ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ మ్యూజిక్ ఇచ్చారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళీధర్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు.
Read Also: ఓటీటీలోకి మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీ - తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?