Premalu Telugu OTT Release: మలయాళంలో విడుదలై చక్కటి విజయాన్ని అందుకున్న మూవీ ‘ప్రేమలు’. లవ్, కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినీ అభిమానుల నుంచే కాదు, విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. కేవలం రూ. 5 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ. 100 కోట్లు సాధించి సరికొత్త రికార్డు సాధించింది. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా మార్చి 8న తెలుగులో విడుదల అయ్యింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘ప్రేమలు’ సినిమాలో నెల్సన్ కే గఫూర్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించారు. ఏడీ గిరీశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో నెల్సన్, మమితా యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా అంతా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతుంది.
ఏప్రిల్ 12న ఓటీటీలో ‘ప్రేమలు’ విడుదల
ఇక ‘ప్రేమలు’ ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన వచ్చింది. ఏప్రిల్ 12 నుంచి ‘ప్రేమలు’ మలయాళీ వెర్షన్ స్ట్రీమింగ్ కు రానున్నట్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా తెలుగు వెర్షన్ విడుదలపైనా క్లారిటీ వచ్చింది. ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 12 నుంచే ఈ సినిమా తెలుగులోనూ విడుదల కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఏప్రిల్ 12 నుంచి డిజిటల్ ప్రీమియర్ కానుందని ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను షేర్ చేసింది. ‘ప్రేమలు‘ సినిమాలో సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిలా భార్గవన్, మీనాక్షి రవీంద్రన్ కీలక పాత్రలు పోషించారు. భావన స్టూడియోస్ బ్యానర్‌పై దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లతో కలిసి ఫహాద్ ఫాసిల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విష్ణు విజయ్ సంగీతం అందించారు.
‘ప్రేమలు’ తర్వాత తెలుగులోకి వచ్చిన మరో హిట్ సినిమా మంజుమ్మల్ బాయ్స్’
‘ప్రేమలు’ తెలుగు సినిమా చక్కటి విజయం సాధించిన తర్వాత మరో మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న ‘మంజుమ్మల్ బాయ్స్’ను ఏప్రిల్ 6న ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది. ఈ సినిమా కూడా తెలుగులో హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులను బాగా అలరిస్తూ డీసెంట్ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రజెంట్ మలయాళీ సినిమాల జోరు చూస్తుంటే... మరిన్ని సినిమాలు తెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Read Also: హనుమాన్ తర్వాత మరో పాన్ ఇండియా మూవీతో వరలక్ష్మీ శరత్ కుమార్ - రిలీజ్ ఎప్పుడంటే?