నాటు నాటు... నాటు నాటు... నాటు నాటు (Naatu Naatu Song)... ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ మేనియా కనబడుతోంది. ఆ పాటే వినబడుతోంది. 'ఆర్ఆర్ఆర్' సినిమా నచ్చిన, రాజమౌళి ప్రతిభ మెచ్చిన ప్రేక్షకులు అమితమైన ఆనందంలో ఉన్నారు. 'నాటు నాటు...' పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో పండగ వాతావరణం నెలకొంది. హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు... తెలుగు సినిమా ప్రేక్షకులు గర్వంతో తెలెత్తుకుని తిరుగుతున్నారు.
 
ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' ఇండియన్ సినిమా కాదు... ఇంటర్నేషనల్ ఆడియన్స్ మెచ్చిన సినిమా! ముఖ్యంగా హాలీవుడ్ దర్శకులు, రచయితలు చాలా మందికి నచ్చిన సినిమా కూడా! వాళ్ళతో పని చేయాలని ఉందని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) చెప్పుకొచ్చారు. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
హాలీవుడ్ మీడియాతో మాట్లాడిన రామ్ చరణ్ ''హాలీవుడ్ దర్శకులు, టెక్నీషియన్లు మా యాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్‌ చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళతో వర్క్ చేయడానికి నేను ఎదురు చూస్తున్నాను'' అని పేర్కొన్నారు. హాలీవుడ్ సినిమాలు చేయాలని ఉందని తన మనసులో కోరికను ఈ విధంగా బయట పెట్టారు. ఇప్పుడు ప్రేక్షకులు అందరూ ప్రపంచ సినిమాకు అలవాటు పడటంతో డిఫరెంట్ ఫిల్మ్స్ చూస్తున్నారని, నటీనటులను గుర్తు పడుతున్నారని, వాళ్ళ పొటెన్షియల్ గుర్తిస్తున్నారని ఆయన తెలిపారు. 'నాటు నాటు...' పాటకు గోల్డెన్ గ్లోబ్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 


రాజమౌళి విజన్‌కు దక్కిన అవార్డు
'నాటు నాటు...' పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును  సగర్వంగా అందుకున్న సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి... తన తమ్ముడు ఎస్.ఎస్. రాజమౌళి విజన్‌కు దక్కిన అవార్డుగా పేర్కొన్నారు.


చంద్రబోస్ ఆనందభాష్పాలు
అంతర్జాతీయ వేదికపై తాను రాసిన పాటకు గుర్తింపు, గౌరవం దక్కడంతో గేయ రచయిత చంద్రబోస్ సంతోషం వ్యక్తం చేశారు. ఆనందంతో ఆయన కళ్ళు చెమర్చాయి. ఆనంద భాష్పాలు వచ్చాయి. 'నాటు నాటు...' పాడిన కీరవాణి తనయుడు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. 


Also Read : 'తెగింపు' రివ్యూ : అజిత్ విలనా? హీరోనా? - తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందా?



గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకకు కథానాయకులు ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి, కీరవాణి సతీసమేతంగా హాజరు అయ్యారు. వీరితో పాటు 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ, రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ కూడా ఉన్నారు. రెడ్ కార్పెట్ మీద 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం అందరి దృష్టిని ఆకర్షించింది. 


Also Read : ఆస్కార్‌ను 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌ ఇంటికి తెచ్చినప్పుడు - షారుఖ్‌ ట్వీట్ చూశారా?


దర్శకుడు ధీరుడు రాజమౌళి డ్రస్సింగ్ స్టైల్ ఇండియన్ ట్రెడిషన్ అంటే ఏమిటో వెస్ట్రన్ జనాలకు చూపించింది. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల, రాజమౌళి సతీమణి రామ, కీరవాణి సతీమణి శ్రీవల్లి చీరకట్టులో హాజరయ్యారు. భారతీయ సంప్రదాయంలో చీరకు ఉన్న ప్రాముఖ్యం ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. సినిమాల పరంగానే కాదు... అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం ద్వారా మన భారతీయతను అక్కడి ప్రేక్షకులకు చూపించిన ఘనత రాజమౌళి అండ్ 'ఆర్ఆర్ఆర్' యూనిట్ సభ్యులకు దక్కుతుందని చెప్పాలి. ఇది జక్కన్న మార్క్ అని చెప్పాలి.