బాలీవుడ్ లో వివాదాస్పద వార్తలకు కొదవేమీ ఉండదు. నటీనటులు ఒకరిపై ఒకరు నిత్యం ఏదొక ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంటారు. తాజాగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, నటి రాఖీ సావంత్ పెళ్లి వ్యవహారం చర్చనీయాంశమైంది. ఆమె పెళ్లి గొడవ రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం రాఖీ సావంత్ మేటర్ బాలీవుడ్ లో ఉత్కంఠ రేపుతోంది. గత కొన్ని రోజులుగా రాఖీ సావంత్ తన భర్త ఆదిల్ మధ్య వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తన బాయ్‌ ఫ్రెండ్ ఆదిల్ ను వివాహం చేసుకున్నట్లు రాఖీ సావంత్ జనవరిలో ప్రకటించింది. అయితే ఇటీవలే రాఖీ సావంత్ తల్లి మరణించడం, ఆదిల్ ఖాన్‌పై షాకింగ్ కామెంట్లు చేయడంతో ఈ వ్యవహారం చర్చనీయాశంమైంది. తాజాగా ఆమె తన భర్త ఆదిల్ పై గృహహింస కింద పోలీసు కేసు పెట్టడంతో ముంబై ఓషివారా పోలీసులు ఆదిల్‌ను అరెస్టు చేశారు. 


తన భర్తపై పోలీసు కేసు పెట్టినట్టు రాఖీ స్పష్టం చేసింది. అతడు తనను మోసం చేశాడని, తను అనే అమ్మాయితో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా తన నిధులు దుర్వినియోగం చేశాడని పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. తనను మానసికంగా, శారీరకంగా హింసించారని ఆరోపించింది. దీంతో పోలీసులు ఆదిల్ ను అరెస్ట్ చేశారు. అతడిపై ఐపీసీ 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తన ఇంటి నుంచే అదిల్‌ ను అదుపులోకి తీసుకున్నారని తెలిపింది. తానేమి డ్రామా ఆడట్లేదని, ఇదంతా నిజం అని కన్నీటిపర్యంతమైంది రాఖీ. ఆదిల్ తనను కొట్టేవాడని, తన వద్ద ఉన్న డబ్బు, నగలు లాక్కున్నాడని ఆరోపించింది. తనను ఎందుకు కొడుతున్నావని అడిగితే.. ఇంకా ఎక్కువగా హింసించేవాడని వాపోయింది. సోమవారం రాత్రి ఈ ఇద్దరూ హోటల్ లో డిన్నర్ చేస్తూ కనిపించారు. అయితే తర్వాత రోజే మంగళవారం నాడు తన భర్తపై దొంగతనం కేసు పెట్టడంతో వీరి వ్యవహారం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి.


Also Read : స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?


అంతేకాదు, తన తల్లి జయను సావంత్ చూసుకోవాలని కోరితే.. తన వద్ద డబ్బు తీసుకొని తన తల్లిని పట్టించుకోలేదని చెప్పింది. తనకు బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బును అదిల్‌కు ఇచ్చానని తెలిపింది. ఆ డబ్బును తన తల్లి వైద్యానికి ఖర్చు చేయకుండా అతడే వాడుకున్నాడని ఆరోపించింది. సమయానికి వైద్యం చేయించకపోవడం వల్లే తన తల్లి మరణించిందని చెప్పింది. తన తల్లి మృతికి అదిలే కారణమని మండిపడింది. ఆదిల్ తనను పూర్తిగా మోసం చేశాడని అందుకు సంబంధించిన ఆధారాలు అన్నీ తన వద్ద ఉన్నాయని చెప్పింది. అతడు తనను ప్రేమించలేదని, కేవలం ఇండస్ట్రీలో పరిచయాల కోసమే తనను నమ్మించాడని అంది. ఆ తర్వాత తను అనే అమ్మాయితోనే ఆదిల్ జీవించాలని అనుకుంటున్నాడని. తనని నిలువునా మోసం చేశాడు కాబట్టే పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొంది. రాఖీ సావంత్-ఆదిల్ గత నెలలో కోర్టులో మ్యారేజ్ చేసుకున్నట్లు ప్రకటించారు. ఆదిల్ కర్ణాటకకు చెందిన కార్ల వ్యాపారి. వీరిద్దరూ 2022 మే నెల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. రాఖీతో పాటు అదిల్‌ కూడా ముంబైలో డ్యాన్స్ అకాడమీని ప్రారంభించాడు. అయితే అదిల్ వేరే మహిళతో అఫైర్ పెట్టుకున్నాడని ఆరోపణలు చేసిన కొన్ని రోజులకే తన భర్తపై కేసు పెట్టడంతో రాఖీ వ్యవహారం బి-టౌన్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.