Miryalaguda MLA Bhasker: తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు సీఎం కేసీఆర్ ప్రభుత్వ పథకాలు తీసుకోవడానికి వీళ్లేదని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు అన్నారు. మంగళవారం రోజు ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన.. దామరచర్ల మండలంలోని నర్సాపూర్ గ్రామస్థులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం పెట్టే వారికి సున్నం పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. తన సంగతి ప్రజలకు తెలియదని... వేషాలు వేసే ప్రతి ఒక్కరితో డ్యాన్స్ చేయిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందో నర్సాపూర్ ప్రజలు ఓ సారి ఆలోచించాలని అన్నారు. మీరు ఆలోచన చేయకపోతే మీ అంతట మీరే ఇబ్బందులు ఎదర్కున్న వాళ్లు అవుతారని.. తమకేం ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు. 


"మరి ఆలోచన ఏం వస్తుందో, ఎందుకు వస్తుందో నాకు తెలియదు. తిని సున్నం బొట్లు పెడితే ఆ దేవుడనేటోడు ఉన్నడు. మైసమ్మనే ఉంది. అంతా మైసమ్మ తల్లే చూసుకుంటది. ఎందుకంటే చేసినోడిన కనక..నేను చేసినయన్నీ కూడా ఆ రోడ్డు బంజేయండి. వేరే పార్టోడెవడు మా రోడ్డు మీద నడవకూడదు. కేసీఆర్ వేసిన రోడ్డు మీద నడవద్దు. కేసీఆర్ రైతుబంధు తీసుకోవద్దు. కేసీఆర్ ఇచ్చే పింఛన్ తీసుకోకండి. కేసీఆర్ యొక్క కల్యాణ లక్ష్మీ తీసుకోకండి. తీసుకోకుండా ఉండండి. తీసుకుంటం.. మా నర్సాపూర్ మట్టుకు మేం డ్యాన్స్ చేస్తం అన్న ఆలోచన మీకుంటే... నేను గూడ డ్యాన్స్ చేపిస్త. నా సంగతి మీకు తెల్వదు. మర్యాదగ ఉండేవాడి వరకు మర్యాదగా ఉంట. మర్యాదతప్పితే మాత్రం ఎట్ల డ్యాన్స్ చేయాల్నో మిమ్మల్ని అట్ల డ్యాన్స్ చేపిస్త. మీరనుకుంటుండొచ్చు. మా నర్సాపూర్ తో అదైతది, ఇదైతదని. ఏమీ కాదు. ఇవన్నీ కేసీఆర్ ఇచ్చినవా.. వేరే వాళ్లు ఇచ్చినవా." - ఎమ్మెల్యే భాస్కర్ రావు 


తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు సీఎం కేసీఆర్ వేసిన రోడ్లపై నడవద్దని... కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు, పింఛన్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను కూడా తీసుకోవద్దంటూ వ్యాఖ్యానించారు. ఒకవేళ పథకాలన్నీ తీసుకుంటాం.. మాకు నచ్చినట్లు చేస్తామన్న ఆలోచన ఉంటే... ఏ విధంగా డ్యాన్స్ చేయించాలో తనకు బాగా తెలుసని ఎమ్మెల్యే భాస్కర్ రావు అన్నారు. తాను ఎవరికీ భయపడబోనని.. తన దారిని తాను చూసుకుంటానంటూ ఎమ్మెల్యే భాస్కర్ రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీ నాయకులతో పాటు నర్సాపూర్ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


ఎమ్మెల్యే భాస్కర్ రావు చేసిన వ్యాఖ్యలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉండి ప్రజల బాగోగులు చూడాల్సింది పోయి, మీ సంగతి చూస్తాను, మీతో డ్యాన్సులు చేయిస్తానంటూ మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఏ ప్రభుత్వం వచ్చినా రోడ్లు వేయక తప్పదని, కానీ కేవలం కేసీఆర్ మాత్రమే రోడ్లు వేయించారనే తీరుగా ఎమ్మెల్యే మాట్లాడటం ఏంటని మండిపడుతున్నారు. తమ అభిప్రాయాన్ని ఎన్నికల సమయంలో ఓట్ల రూపంలో చూపిస్తామని గ్రామస్తులు అంటున్నారు.