Rakesh Master Organ Donation : ప్రముఖ టాలీవుడ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్య సమస్యలతో పోరాడుతూ జూన్ 18న చనిపోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన చాలా విషయాలు బయటకొస్తున్నాయి. ఇన్నాళ్లూ ఓ కొరియోగ్రాఫర్ గా మాత్రమే తెలిసిన రాకేష్ మాస్టర్.. ఆయన చనిపోయాక అతని మంచి మనసు బయట పడింది. చనిపోయాక తన అవయవాలని దానం చేయాలని ముందే చెప్పారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.


కొరియోగ్రాఫర్ గా పలు సినిమాలకు పని చేసిన రాకేష్ మాస్టర్... ఇటీవలి కాలంలో యూట్యూబ్ లోనూ అలరిస్తూ వచ్చారు. ఫన్నీ ఇంటర్వ్యూలతో కడుపుబ్బా నవ్వించారు. ఓ రకంగా చెప్పాలంటే మళ్లీ ఈ ఫన్నీ ఇంటర్వ్యూలతోనే ఆయన పాపులర్ అయ్యారు. ఈ వీడియోస్ తో సోషల్ మీడియోలో బాగానే ట్రోలింగ్ జరిగింది. ఈ క్రమంలోనే ఆయన చనిపోయారంటూ ఓ సడెన్ న్యూస్ వచ్చింది. ఆయన అకస్మాత్తుగా మరణించడం రాకేష్ మాస్టర్ కుటుంబానికే కాకుండా.. ఆయనను అభిమానించే ప్రేక్షకులకూ తీరని విషాదాన్ని మిగిల్చాయి. ఇంతటి శోక సమయంలోనూ ఆయన కుటుంబం తీసుకున్న ఓ అద్భుతమైన నిర్ణయాన్ని ఇప్పుడు అందరూ కొనియాడుతున్నారు. వారి గొప్ప మనసును పొగడుతున్నారు.


తిరుపతికి చెందిన రాకేష్ మాస్టర్.. గత కొంతకాలం నుంచి హైదరాబాద్ లోనే నివాసముంటున్నారు. కొన్ని రోజుల నుంచి ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవలే ఆయన్ను కుటుంబసభ్యులు, స్నేహితులు.. ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన పరిస్థితి దిగజారడంతో సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో రాకేష్ మాస్టర్ జూన్ 18న సాయంత్రం 5 గంటలకు చనిపోయారు. అయితే తనకున్న అనారోగ్య సమస్యల రిత్యా.. తాను చనిపోతానని రాకేష్ మాస్టర్ ముంచే ఊహించారట. అది ఊహించి ఓ అనూహ్య నిర్ణయం వెల్లడించారట. తన అవయవాల్లో పనికొచ్చే వాటిని దానం చేయాలని సూచించారని రాకేష్ మాస్టర్ అసిస్టెంట్ సాజిద్ తెలిపారు. 


ఇదే విషయాన్ని సాజిద్ డాక్టర్లకు చెప్పారట. రాకేష్ మాస్టర్ మృతదేహానికి పోస్టుమార్టం చేసి, బాడీ పార్ట్స్ తీసుకున్న అనంతరం.. తమకు బాడీని అప్పజెప్పాలని, ఆ తర్వాత తాము అంత్యక్రియలు నిర్వహిస్తామని కోరారట. ఇక రాకేష్ మాస్టర్ కళ్లను దానం చేసేందుకు ఆయన కుటుంబసభ్యులు కూడా అంగీకరించారని సాజిద్ స్పష్టం చేశారు. ఒకప్పుడు మంచి కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకుని.. ప్రస్తుతం ఏదో ఒకటి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వైరల్ అయిన రాకేష్ మాస్టర్ మనసు ఇంత మంచిదా అని చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఆయన చనిపోయినా అవతలి వారికి ఏదో ఒక విధంగా ఉపయోగపడాలనే ఆయన గొప్ప మనసును అంతా ప్రశంసిస్తున్నారు.


Read Also : పుట్టబోయే బిడ్డ కోసం కీలక నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్ - ఫ్యాన్స్‌కు ఎదురు చూపులు తప్పవా?


టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్‌ కొరియోగ్రాఫర్‌లు అయిన శేఖర్‌ మాస్టర్‌, జానీ మాస్టర్లు రాకేశ్‌ మాస్టర్‌కు శిష్యులే. రాకేశ్‌ మాస్టర్‌ పేరును శేఖర్ మాస్టర్ టాటూ కూడా వేయించుకున్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌కు కూడా రాకేష్ మాస్టర్ శిక్షణ ఇచ్చారు. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్లు వంటి సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. రాకేష్ మాస్టర్‌కు నెటిజన్లు నివాళులు అర్పిస్తున్నారు.