Nellore News: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. అడుగడుగునా ఆయన ప్రజల సమస్యలు వింటూ, అక్కడికక్కడే వారికి హామీలిస్తూ ముందుకు సాగుతున్నారు. జిల్లాలో అడుగుపెట్టిన తర్వాత ఆత్మకూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర మొదలు కాగా ప్రస్తుతం వెంకటగిరి నియోజకవర్గంలో ఆయన యాత్ర కొనసాగుతోంది. వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరులో కనపడ్డారు కానీ, వెంకటగిరిలో మాత్రం ఆయన సైలెంట్ అయ్యారు. వెంకటగిరి నుంచి గత ఎన్నికల్లో రామనారాయణ రెడ్డి చేతిలో పోటీ చేసి ఓడిపోయిన కురుగొండ్ల రామకృష్ణ అక్కడ యాత్రలో లోకేష్ తో కలసి నడుస్తున్నారు.
లోకేష్ పాదయాత్ర ఆదివారం 130 రోజుల సందర్భంగా పెనుబర్తి గ్రామంలో పూలతో ముగ్గు వేసి ఘన స్వాగతం పలికారు నాయకులు. వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలం తెగచర్ల శివారు నుంచి గరిమెనపెంట, రామకోడూరు, గోనుపల్లి, పెనుబర్తి వరకు 130వరోజు యాత్ర సాగింది. ఈరోజు సాయంత్రం నుంచి 131రోజు యాత్ర మొదలవుతుంది.
గరిమెనపెంట ఎస్టీకాలనీ వాసులు లోకేష్ ని కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామానికి చెందిన గంగినేని పద్మమ్మతోపాటు మరో ముగ్గురికి చెందిన భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేశారని వారు ఆరోపించారు. భూమి సొంతదారులను వ్యవసాయం చేసుకోకుండా అడ్డుపడి బెదిరిస్తున్నారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోకుండా వదిలేశారని ఆరోపించారు. కబ్జాదారుల నుంచి తమ పొలాలకు రక్షణ కల్పించాలన్నారు. లోకేష్ కూడా వారి ఫిర్యాదులు తీసుకుని సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే వారి సమస్య పరిష్కరిస్తామన్నారు.
రామకూరు గ్రామానికి చెందిన ఎస్సీ, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన కొంతమంది లోకేష్ ని కలిశారు. కండలేరు ప్రాజెక్టు ముంపుకి గురైన తర్వాత దాదాపు 30 కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని వారు ఆరోపించారు. ముస్లింలకు నమాజు చేసుకునే స్థలం కూడా లేదని, ఖబరస్థాన్ లేదని చెప్పారు. 1983లో తెలుగుగంగ ప్రాజెక్టులో భాగంగా కండలేరు నిర్మించారని, తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించినా పరిహారం ఇచ్చి, పునరావాసం మరిచారన్నారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదన్నారు. దాదాపు 100 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని లోకేష్ కి ఫిర్యాదు చేశారు.
లోకేష్ హామీలు..
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోమశిల హైలెవల్ కెనాల్ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు లోకేష్. తోపుగుంట, కొండాపురం, చౌటుపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనులపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. సాగులో పెట్టుబడి వ్యయం తగ్గించేలా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు లోకేష్. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, వెంకటగిరి నియోజకవర్గం రైతులకు సాగునీరు అందించే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
జగన్ పాలనలో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు లోకేష్. నెల్లూరు జిల్లాలో వరి కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందన్నారు. ధాన్యం తీసుకున్నా డబ్బులు వేయడంలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామానికి తాగు, సాగునీరు అందిస్తామన్నారు. తెగచర్ల క్యాంప్ సైట్ వద్ద రైతులతో మాట్లాడారు లోకేష్. ఇప్పటివరకు లోకేష్ యువగళం యాత్రలో నడిచిన మొత్తం దూరం 1670.4 కిలోమీటర్లు కాగా, నేడు 131వ రోజు పాదయాత్ర మొదలు పెడతారు. సాయంత్రం 4 గంటలకు పెనుబర్తి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. 5 గంటలకు ఓబులాయపల్లిలో స్థానికులతో సమావేశమవుతారు లోకేష్. రచ్చబండ అనంతరం గుండువోలు, ఏపూరు గ్రామస్తులతో సమావేశాలున్నాయి. రాత్రికి ఆయన రాపూరు శివారులో విడిది చేస్తారు.