ప్రముఖ తమిళ హాస్య నటుడు మయిల్ స్వామి మరణం యావత్ తమిళ సినీ పరిశ్రమను విషాదంలో నింపేసింది. మయిల్ సామి ఈనెల 19న గుండె పోటుతో కన్ను మూశారు. మయిల్ సామి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆయన నేరుగా తెలుగు సినిమాల్లో నటించకపోయినా.. పలు డబ్బింగ్ సినిమాల ద్వారా మన ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన మరణానికి తమిళ సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, ప్రముఖ నటుడు కమల్ హాసన్ సహా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా మయిల్ సామి మరణానికి సంతాపం తెలిపారు.


మయిల్ సామి మరణ వార్తతో సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర ఆవేదనకు గురైయ్యారు. ఆయన మరణం తీరని లోటని వెల్లడించారు. సామాజిక బాధ్యత కలిగిన మయిల్ మన మధ్య లేరన్న విషయం తట్టుకోవడం కష్టంగా ఉందన్నారు. స్వయంగా మయిల్ సామి ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. మయిల్ చివరి కోరికను తప్పకుండా నెరవేరుస్తానని వెల్లడించారు. రజినీకాంత్ ఆయన చివరి కోరికను నెరవెరుస్తానని హామీ ఇచ్చారు.


మయిల్ సామి తనకు మంచి స్నేహితుడని రజినీకాంత్ తెలిపారు. మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి నటుడిగా ఎదిగిన మయిల్ సామి.. ఆ తర్వాత హాస్య నటుడిగా మంచి పేరు సాధించారని అన్నారు. అతను ఎంజీర్ కు వీరాభిమాని అని, పరమ శివభక్తుడని తెలిపారు. ‘‘మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కానీ, ఎందుకో ఎక్కువ సినిమాల్లో నటించలేదు. అదెందుకో తెలీదు. ఆయన ప్రతి సంవత్సరం కార్తీక దీపం కోసం తిరువణ్ణామలై వెళ్లేవాడు. అక్కడ భక్తులను చూసినప్పుడు.. వారంతా తన సినిమా మొదటి షోకు వచ్చిన ప్రేక్షకులే అన్నట్లు సంతోషించేవాడు. అది అతని భక్తి’’ అని వెల్లడించారు. చాలాసార్లు ఆయన తనని ఆ ఆలయానికి ఆహ్వానించేవాడని, కానీ వెళ్లలేకపోయానని అన్నారు. 


ఆయన కాల్ అటెండ్ చేయలేకపోయా


చివరి సారి మయిల్ సామి పిలిచినప్పుడు స్పందించలేకపోయానని రజనీ కాంత్ బాధపడ్డారు. పనిలో ఉండటంతో ఆయన కాల్‌ను అటెండ్ చేయలేకపోయినట్లు వెల్లడించారు. ఈ సారి ఆయనతో మాట్లాడినప్పుడు క్షమాపణ చెప్పాలి అనుకున్ననని, కానీ ఇప్పుడు ఆయన అందనంత దూరలకు వెళ్లిపోయారంటూ రజనీకాంత్ భావోద్వేగానికి గురయ్యారు. 


మయిల్ సామి మరణం యాదృచ్ఛికం కాదన్నారు రజినీకాంత్. శివరాత్రి రోజున తన భక్తుడిని ఆ స్వామి తీసుకెళ్లాడన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ఏం చెప్పాలో తెలియడం లేదన్నారు రజనీకాంత్. ఈ సందర్బంగా తిరువణ్ణామలై ఆలయాన్ని సందర్శించిన మయిల్ సామి కోరికను నెరవేరుస్తానన్నారు. ఇటీవల ఆయన.. నా స్నేహితుడు రజినీకాంత్‌లో కలిసి ఆ ఆలయాన్ని దర్శించాలని అనుకుంటున్నానని డ్రమ్స్ శివమణితో మయిల్ సామి అన్నారని తెలిసిందన్నారు. తప్పకుండా ఆ కోరిక నెరవేరుస్తానన్నారు. 


ఇటీవల సినీ పరిశ్రమను వరుస మరణాలు కలచి వేస్తున్నాయి. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ పేరున్న నటులు ఎందరో పలు కారణాలతో కన్నుమూశారు. ఈ క్రమంలోనే తాజాగా కళాతపస్వి విశ్వనాథ్, ప్రముఖ గాయని వాణీ విశ్వనాథ్, తారకరత్న ఇలా పలువురు మృత్యువాత పడటం సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతుంది. తాజాగా మయిల్ స్వామి మరణం కూడా సినీ అభిమానులను ఆందోళనకు గురిచేసింది. 



Read Also: దట్టమైన అడవిలో కుక్కలతో పోరాటం, ఒళ్లు గగుర్పొడిచేలా ఆండ్రియా `నో ఎంట్రీ` ట్రైలర్