ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ కెరీర్ లో సరైన హిట్టు పడలేదు. గత దశాబ్ద కాలంలో ఆయన నుంచి చెప్పుకోదగ్గ సినిమా ఏదైనా వచ్చిందంటే అది 'ఇస్మార్ట్ శంకర్' అనే చెప్పాలి. ఈ సినిమా చూసే విజయ్ దేవరకొండ.. పూరికి ఛాన్స్ ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్ లో విడుదలైన 'లైగర్' సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమా దెబ్బకి పూరి జగన్నాధ్ సైలెంట్ అయిపోయారు. ఎంతగానో నమ్మి చేసిన ఈ సినిమా నిరాశ పరిచింది. కనీసం సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చినా.. విజయ్ తన పెర్ఫార్మన్స్ నెట్టుకొచ్చేవాడు. 


కానీ సినిమాలో కథ, కథనాలు పేలవంగా ఉండడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ఈ సినిమా ఎఫెక్ట్ తో పూరి పరిస్థి దారుణంగా తయారైంది. స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే.. మిడ్ రేంజ్ హీరోలు కూడా పూరికి డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో పూరి తన కొడుకు ఆకాష్ పూరితో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు పూరి దృష్టి రామ్ పై పడిందని తెలుస్తోంది. 


పూరి వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న సమయంలో అతడిని నమ్మి 'ఇస్మార్ట్ శంకర్' అనే సినిమా చేశారు రామ్. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాతో వీరిద్దరి కెరీర్లకు మంచి ఊపొచ్చింది. ఈ సినిమాకి సీక్వెల్ వస్తుందని చెప్పారు. కానీ తరువాత వేర్వేరు ప్రాజెక్ట్స్ తో బిజీ అవ్వడంతో కుదరలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పూరికి మరో హీరో దొరికే పరిస్థితి లేదు. 


దీంతో రామ్ ను కలిసి తనతో సినిమా చేయడానికి కమిట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు పూరి. ఇటీవల రామ్ నటించిన 'ది వారియర్' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు రామ్. ఈ సినిమా పూర్తయిన తరువాత రామ్ డేట్స్ ఇస్తారేమోనని పూరి ఎదురుచూస్తున్నారు. రామ్ కి కుదిరినప్పుడు వీరిద్దరూ కలిసి 'ఇస్మార్ట్ శంకర్ 2' సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. 


ఇక బోయపాటితో రామ్ సినిమా విషయానికొస్తే.. శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కథ ప్రకారం.. ఇద్దరు హీరోయిన్లు కనిపించబోతున్నారు. ఒక హీరోయిన్ ను బాలీవుడ్ నుంచి దిగుమతి చేయబోతున్నారు. టాలీవుడ్ నుంచి మరో హీరోయిన్ ను తీసుకోబోతున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు. రామ్ సినిమాలు హిందీలో డబ్ లో యూట్యూబ్ లో మిలియన్స్ లో వ్యూస్ ను సాధించాయి. ఆ విధంగా బాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. తొలిసారి ఆయన ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఎంటర్ అవ్వబోతున్నారు. మరి ఈ సినిమాతో రామ్ మాస్ హిట్ అందుకుంటారేమో చూడాలి!


Also Read : బాబాయ్‌ వెంకీ తలకి గన్ గురి పెట్టిన రానా- క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'రానా నాయుడు' టీజర్ రిలీజ్


Also Read : లక్ష్మీ మంచు ఈజ్ బ్యాక్ - త్వరలో 'షెఫ్ మంత్ర 2' షురూ!