Visakha News : విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మత్స్యకారులు ఆందోళనకు దిగారు. విశాఖ కంటైనర్ టెర్మినల్ కోసం 20 ఏళ్ల భూములిచ్చినప్పుడు తమకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకూ నెరవేర్చలేదని నిరసన చేపట్టారు. భూములిచ్చినప్పుడు మరోచోట 60 గజాల ఇంటి స్థలం, రూ. లక్ష పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని అప్పటి ప్రభుత్వం హామీఇచ్చిందని, కానీ వాటిని అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


షిప్ లను అడ్డుకుంటున్న మత్స్యకారులు 


విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌కు వెళ్లే మార్గంలో మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. దీంతో శనివారం ఉదయం నుంచి కంటైనర్ టెర్మినల్ వద్ద పనులు నిలిచిపోయాయి. వేల కోట్ల లావాదేవీలు, ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయని టెర్మినల్ అధికారులు తెలిపారు. సముద్రంలో షిప్‌లను అడ్డుకునేందుకు 25 కు పైగా బోట్లలో మత్స్యకారులు ప్రయత్నించారు. మర పడవలను అడ్డుపెట్టి టెర్మినల్ వైపు షిప్ లు రాకుండా మత్స్యకారులు అడ్డుకున్నారు. తమకు ఇచ్చిన హామీలను ఈ నెల 20వ తేదీ లోపు నెరవేర్చాలని గడువు ఇచ్చినా, అధికారులు పట్టించుకోకపోవడంతో నిరసనకు దిగామని మత్స్యకార సంఘం నాయకులు ఆరోపించారు. తమకు పరిహారం చెల్లించేవరకూ  టెర్మినల్ గేట్లు తెరిచేది లేదన్నారు. ఒక్క కంటైనర్ కూడా లోపలకి వెళ్లేందుకు వీల్లేదని మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. 


హామీలు నెరవేర్చాలని ఆందోళన 


మత్స్య పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో విశాఖ పోర్టులోని క్రూయిజ్ టెర్మినల్ లో మత్స్యకారులకు ఉద్యోగాలను కల్పించడంతో పాటు, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జాలర్లు డిమాండ్ చేస్తున్నారు. 1933లో ఓడరేవు నిర్మాణానికి తమ పూర్వీకులు భూమి ఇచ్చారని, విశాఖ పోర్ట్ అథారిటీ ఛైర్మన్ కు ఇచ్చిన వినతిపత్రంలో మత్స్యకారులు గుర్తుచేశారు. గతంలో తమకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని ఆందోళన చేస్తున్నారు. మరోవైపు జనరల్ కార్గో బెర్త్ ప్రధాన గేట్ ముందు మత్స్యకారులు బైఠాయించి హార్బర్ లోపలకు, బయటకు వాహనాలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కంటైనర్ టెర్మినల్ వద్ద  పోలీసులు  పెద్ద ఎత్తున మోహరించారు.  


Also Read : Gudivada News : రైతుల కంటే ముందే పోలీసుల మార్చ్ - గుడివాడలో టెన్షన్ టెన్షన్ !


Also Read : మార్చెయ్యటానికీ, తీసెయ్యటానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు: బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు