Karimnagar Kalotsavam: కరీంనగర్ కళోత్సవాల నిర్వహణపై అధికారులతో మంత్రి గంగుల సమీక్ష
అనంతరం అంబేద్కర్ మైదానంలో ఏర్పాట్ల పరిశీలన 
తొలిసారి కరీంనగర్ లో జరగనున్న జాతీయస్థాయి కళాకారుల కళా ప్రదర్శనలు


అద్భుత వేడుకలకు వేదికగా మారనున్న కరీంనగర్
కళలకు కాణాచి అయిన కరీంనగర్ మరోసారి అద్భుత వేడుకలకు వేదికగా మారేందుకు సిద్దమవుతోంది. ఈ కళోత్సవాలు ఈ నెల 30వ తేదీన ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే కళోత్సవాల నిర్వహణ పై కరీంనగర్ కలెక్టరేట్ లో మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతస్థాయి సమీక్ష (TS Minister Gangula Kamalakar review meeting) నిర్వహించారు. కలెక్టర్ ఆర్ వి కర్ణణ్ తో కలిసి... కళోత్సవాల విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. 
కరీంనగర్ పట్టణ కేంద్రంలో తొలిసారిగా నిర్వహించనున్న కళోత్సవాలు అంగరంగ వైభవంగా జరపాలని సమీక్ష సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ నిర్ణయించారు. పెద్ద ఎత్తున వచ్చే అతిథులు ప్రేక్షకులకు అనుగుణంగా పార్కింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ ఈ విధంగా ఉంది.
- ఈ నెల 30న ఉత్సవాలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్..
- 2వ రోజు ఉత్సవాల్లో పాల్గొననున్న ప్రకాశ్ రాజ్ 
- 3వ రోజు ఉత్సవాల్లో పాల్గొనున్న మెగాస్టార్ చిరంజీవి 


అన్ని రాష్ట్రాల నుండి కళాకారులు 
ఇక ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు సినీ, గేయ, నాటకరంగ కళాకారులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించనున్నారు. ఈ కళోత్సవాల్లో కరీంనగర్ జిల్లాతో పాటు... రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి కళాకారులు రానున్నారని మంత్రి గంగుల తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో ప్రముఖమైన కళారూపాలను వారు ప్రదర్శించనున్నారని ఈ రకమైన కలోత్సవాలు ఈ సంవత్సరం నుండి ప్రతి ఏటా జరుపుతామని తెలిపారు. ప్రత్యేక ఆదివాసీ నృత్యాలను సైతం ఈ సారి కలోత్సవాలలో ఆయా కళాకారులచే ప్రదర్శించనున్నామని దీని ద్వారా వారి కళారూపాలని ప్రజలకు తొలిసారి పరిచయం చేయనున్నామని తెలిపారు. 
ఈ నెల 30వ తేదీన సాయంత్రం మంత్రి కేటీఆర్ కళోత్సవాలను ప్రారంభిస్తారని... ఇప్పటికే మంత్రి కేటీఆర్ షెడ్యూల్ ఖరారైందన్నారు. 2వ రోజు ప్రకాశ్ రాజ్ రానున్నారని... 3వ రోజు చివరి రోజు చిరంజీవి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని... ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదన్నారు. కళోత్సవాల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా పకడ్బంధీ ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వివిఐపిలతోపాటు పలువురు ప్రముఖ సినీ, కళా రంగాల ప్రముఖులు రానుండడంతో వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి గంగుల కమలాకర్ కోరారు.


ఈ కార్యక్రమంలో  నగర మేయర్ యాదగిరి సునీల్ రావు మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ డిసిపి శ్రీనివాస్ ఏసీపీలు తుల శ్రీనివాస్, విజయ్ కుమార్, విజయసారథి, ప్రతాప్, తదిదర అధికారులు పాల్గొన్నారు