బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి తెలుగులో కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆమె బాలీవుడ్ లో నటించిన కొన్ని సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి కూడా. అందుకే ఆమెకు తెలుగులో కూడా గుర్తింపు ఉంది. బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది ప్రియాంక చోప్రా. అయితే కొన్నాళ్ళ క్రితం బాలీవుడ్ లో సినిమాలు చేయడం బాగా తగ్గించింది. అంతేకాదు హాలీవుడ్ లో అవకాశాలను వెతకడం ప్రారంభించింది. అందులో భాగంగా సోలోగా మ్యూజిక్ ఆల్బమ్స్ ను కూడా చేసింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తాను బాలీవుడ్ కు బదులు హాలీవుడ్ లో ఎందుకు అవకాశాలు వెతుక్కోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియాంక చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చనీయాంశమవుతున్నాయి.
ఇటీవల ప్రియాంక చోప్రా ఓ పోడ్ కాస్ట్ కోసం డాక్స్ షెఫర్డ్ తో మాట్లాడింది. ఈ సందర్భంగా తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాను బాలీవుడ్ కు ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో కూడా చెప్పుకొచ్చింది. తాను బాలీవుడ్ లో వచ్చే అవకాశాల పట్ల సంతోషంగా లేనని తెలిపింది. బాలీవుడ్ లో కాకుండా హాలీవుడ్ లో అవకాశాలు వెతుక్కోవడం పట్ల గల కారణాన్ని వెల్లడించింది. బాలీవుడ్ లో తాను అభద్రతాభావానికి గురవ్వడం వల్లేనని పేర్కొంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరితో విభేదాలు ఉన్నట్లు ప్రియాంక తెలిపింది. దీంతో తనను ఓ మూలకు తోసేశారని, అక్కడ రాజకీయాలతో తాను విసిగిపోయానని చెప్పుకొచ్చింది. అందుకే బాలీవుడ్ కు బయటే అవకాశాలను వెతికినట్టు చెప్పింది.
అందుకే కొన్నాళ్లు బ్రేక్ కోరుకున్నానని పేర్కొంది. ఆ సమయంలోనే ‘దేశీ హిట్స్’ కు చెందిన అంజులా ఆచార్య తనను ఓ మ్యూజిక్ వీడియో కోసం సంప్రదించినట్టు తెలిపింది. ఓ సినిమా చిత్రీకరణలో ఉన్న సమయంలో తనకు ఆచార్య కాల్ చేసినట్టు వెల్లడించింది. అమెరికాలో మ్యూజిక్ కెరీర్ పట్ల ఆసక్తిగా ఉన్నారా అని అడిగినట్టు చెప్పింది. అలా తన మ్యూజిక్ కెరీర్ ప్రారంభించానని తెలిపింది. ఈ మ్యూజిక్ వల్లే తనకు మరో ప్రాంతానికి వేళ్లే అవకాశం లభించిందని, దాంతో అమెరికా వచ్చానని చెప్పింది.
అయితే సంగీతంలో తనకున్న పరిజ్ఞానం సరిపోదని, ఇంకా తాను నేర్చుకోవాల్సింది చాలానే ఉందని, అందులో పరిపక్వత సాధించాక మళ్లీ మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తానని తెలపింది. మ్యూజిక్ కెరీర్ అనుకున్న విధంగా సాగనపుడు నటనలో ప్రయత్నించి చూడాలని కొంతమంది సన్నిహితులు సలహా ఇచ్చారని, అందుకే ‘క్వాంటికో’ లో నటించానని చెప్పింది. ఆ తర్వాత ప్రియాంక ‘బేబీవాచ్’, ‘మ్యాట్రిక్స్’, ‘రెవల్యూషన్స్’, ‘ద వైట్ టైగర్’ లో అవకాశాలను సొంతం చేసుకుంది. ఇక త్వరలో ప్రముఖ దర్శకులు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది ప్రియాంక. ఇదే వెబ్ సిరీస్ లో ఇండియాలో ప్రియాంక పాత్రను సమంత పోషిస్తుంది. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. అలాగే ప్రియాంక నటించిన ‘లవ్ ఎగైన్’ అనే సినిమా వేసవిలో విడుదల కానుంది.
Also Read : ఉపాసన బేబీ బంప్ అదిగో - ఇంకా ఎనీ డౌట్స్?