Jai Hanuman Update: 2024 సంక్రాంతికి టాలీవుడ్‌కి తగిలిస స్వీట్ షాకుల్లో ‘హనుమాన్’ ఒకటి. ఈ సినిమా ఒక రేంజ్ వరకు హిట్ అవుతుందని అందరూ భావించారు. కానీ మీడియం రేంజ్ సినిమాల్లో బాహుబలి లెవల్ బ్లాక్‌బస్టర్ కొట్టింది. ఏకంగా రూ.300 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక లాభాలు అందించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే ‘హనుమాన్’కు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ కూడా ప్రకటించారు. ఏదో నామ్ కే వాస్తే ప్రకటనలా కాకుండా సీరియస్‌గా దానికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ కంప్లీట్ అయి ప్రీ-ప్రొడక్షన్ కూడా ప్రారంభించామని ప్రకటించారు. ఇప్పుడు మరో క్రేజీ అప్‌డేట్‌ను అందించారు.


ఇక అంజనాద్రి 2.0
‘హనుమాన్’ కథ అంతా అంజనాద్రి అనే కల్పిత గ్రామంలోనే జరుగుతుంది. ఆ గ్రామానికి సినిమాలో అంత ప్రాధాన్యత ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ చాలా జాగ్రత్తగా ఆ గ్రామాన్ని డిజైన్ చేశారు. ఇప్పుడు ‘జై హనుమాన్’ కోసం ఆ గ్రామాన్ని అప్‌గ్రేడ్ చేయనున్నారట. అంజనాద్రి 2.0 అంటూ కొత్త విజువల్స్‌ను ‘జై హనుమాన్‌’లో చూపించనున్నారు. దీనికి సంబంధించిన చిన్న గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో నీటిలో వస్తున్న కొన్ని పడవలను చూపించారు. ‘హనుమాన్‌’లో అంజనాద్రికి సంబంధించిన గ్రామంలోనే మొత్తం సినిమా జరుగుతుంది. ఆ గ్రామం పక్కన కనిపించే నది, జలపాతాలను కూడా ‘జై హనుమాన్’లో గట్టిగా చూపిస్తారేమో చూడాలి. ‘అంజనాద్రి 2.0’కు స్వాగతం అని ప్రశాంత్ వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.






ఉగాది రోజు కూడా ‘జై హనుమాన్’కు సంబంధించిన అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. ఉగాది ఈజ్ కమింగ్ అంటూ ప్రశాంత్ వర్మ శనివారం ట్వీట్ చేశారు. ఉగాది పండగను తెలుగు ప్రజలు ఏప్రిల్ 9వ తేదీన జరుపుకోనున్నారు. ఇన్ని రోజుల ముందు నుంచే టీజ్ చేశారు కాబట్టి పెద్ద అప్‌డేట్ అయి ఉంటుందని అనుకోవచ్చు. 


Also Read: ఓటీటీకి ఆస్కార్ విన్నింగ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ 'అనాటమీ ఆఫ్ ఏ ఫాల్'- తెలుగులోనూ స్ట్రీమింగ్‌, ఎక్కడంటే


‘జై హనుమాన్’ సినిమా ఎక్కువగా హనుమంతుడి పాత్ర చుట్టూనే తిరుగుతుందని టాక్. ఈ పాత్రలో ఒక టాలీవుడ్ స్టార్ హీరో కనిపించనున్నాడని తెలుస్తోంది. అది ఎవరన్నది మాత్రం ఇంకా రివీల్ అవ్వలేదు. ఉగాది రోజు ఈ అప్‌డేట్ ఏమైనా రివీల్ చేస్తారేమో చూడాలి. ఈ సినిమా సెట్స్‌కు ఎప్పుడు వెళ్తుంది? మిగతా తారాగణం ఎవరు? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అన్నవి తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.



మరోవైపు ఓటీటీలో కూడా ‘హనుమాన్’ దూసుకుపోతుంది. జీ5లో మొదటి ఐదు రోజుల్లోనే 207 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను ‘హనుమాన్’ సాధించింది. దీన్ని బట్టి ఓటీటీలో ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పవచ్చు. 


Also Read: టిల్ల‌న్న డీజే ఈ సారి గ‌ట్టిగానే మోగింది - ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ తెలిస్తే షాకే!