Dharmavaram Assembly Elections: ధర్మవరం: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేయాలని పరిటాల శ్రీరామ్ (Paritala Sriram) భావించారు. కానీ పొత్తు ధర్మంలో భాగంగా టికెట్ కోల్పోయిన తరువాత ధర్మవరం టిడిపి ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ తొలిసారిగా స్పందించారు. టికెట్ రానంతమాత్రాన పారిపోయే వ్యక్తిని కాదని, కష్టం వచ్చినా నష్టం వచ్చినా.. నా ప్రయాణం ధర్మవరంలోనే అని స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ నేత సత్యకుమార్‌కు ధర్మవరం టికెట్ దక్కింది. సత్యకుమార్ వెనుక శ్రీరామ్ ఉన్నాడని వైసిపి నాయకులకు గట్టిగా హెచ్చరించి చెప్పాలని పరిటాల శ్రీరామ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


చిన్న త్యాగం చేయాల్సి వచ్చింది 
ధర్మవరంలో టీడీపీ శ్రేణులతో పాటు ప్రజల కోసం చిన్న త్యాగం చేయాల్సి వచ్చిందని, దానికైనా తాము సిద్ధం అన్నారు పరిటాల శ్రీరామ్. ధర్మవరం తనను చాలా మార్చిందని, గత 5 ఏళ్ల కిందట ఉన్న శ్రీరామ్ తాను కాదని, ఎంతో మార్పు వచ్చిందన్నారు. ధర్మవరంలో సింబల్ మాత్రమే లేదు.. మిగిలినదంతా సేమ్ టు సేమ్ అన్నారు. కొందరిలాగా ఓటమి తర్వాత కార్యకర్తలను వదిలేసే టైపు కాదని, ధర్మవరంలో ప్రతి కార్యకర్త ధైర్యంగా అడుగు ముందుకు వేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ని గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఇప్పటికే ధర్మవరం పేరు ఢిల్లీలో వినిపించింది, ఇక ఎన్నికల తర్వాత అది మారుమోగాలని కూటమి శ్రేణులకు పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. ధర్మవరాన్ని అభివృద్ధి చేసే వ్యక్తిగా సత్యకుమార్ కు తాము సహకరిస్తామని స్పష్టం చేశారు.


మైనార్టీలకు హామీ ఇచ్చిన పరిటాల శ్రీరామ్.. 
‘పెద్ద నేత మన నియోజకవర్గానికి రాబోతున్నారు. ఆయన రాకతో ధర్మవరం అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నాం. ఇక్కడ చాలా వరకు వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి. గత ఐదేళ్లుగా వెనుకబాటుకు గురైన ధర్మవరాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు సామర్థ్యం ఉన్న నేత సత్యకుమార్ అని నేను నమ్ముతున్నాను. అయితే దీనిపై సందేహాలు అక్కర్లేదు. మైనార్టీలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందని అనుమానం అక్కర్లేదు. మీకు ఏదైనా సమస్య ఉందంటే పరిటాల రవి బిడ్డగా పరిటాల శ్రీరామ్ ఒక అడుగు ముందు ఉంటాడని గుర్తుంచుకోండి. ఇక్కడ ఉన్నది సత్యకుమార్ కాదు ఆయన వెనకాల పరిటాల శ్రీరామ్ ఉన్నాడని వైసీపీ శ్రేణులకు తేల్చి చెప్పండి. ధర్మవరంలో మొండి వాళ్లు ఉన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని సత్యకుమార్ తెలుసుకుంటారు. ఆయనను గెలిపించే బాధ్యత మనపై మరింత పెరిగింది. ధర్మవరంలో బీజేపీని గెలిపించుకుంటే మన పేరు ఢిల్లీలో మారుమోగాలి. స్థానికంగా ఏ సమస్య వచ్చినా పరిటాల శ్రీరామ్ మీకోసం ఉంటాడు. సమస్యపై ఎవరినైనా నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నానని’ మీడియాతో మాట్లాడుతూ పరిటాల శ్రీరామ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి ఏపీలో ఎన్నికలకు వెళ్తున్నాయి. బీజేపీకి 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాలు.. జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సెగ్మెంట్లు కేటాయించారు. టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో, 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో బరిలోకి దిగుతోంది. కుప్పం నుంచి చంద్రబాబు, మంగళగిరి నుంచి నారా లోకేష్, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఏపీలో మరోసారి ఎన్డీఏ సర్కార్ వస్తోందని కూటమి పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.