TCS Digital Hiring: నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 'డిజిటల్‌ హైరింగ్‌'కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆఫ్‌ క్యాంపస్‌  కోసం టీసీఎస్‌ ఎన్‌క్యూటీ (TCS NQT) పరీక్షకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పరీక్షలో అర్హత సాధించినవారు టీసీఎస్‌, టీవీఎస్‌ మోటార్స్‌, జియో, ఏసియన్‌ పెయింట్స్‌ సహా దాదాపు 3 వేల ఐటీ, ఐటీయేతర కార్పొరేట్‌ సంస్థల్లో దాదాపు 1.6 లక్షల ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది.


ఉద్యోగ స్వభావాన్ని బట్టి గరిష్ఠంగా రూ.19 లక్షల వరకు వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు పొందవచ్చు. ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా పలు కంపెనీల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే.. ఆయా సంస్థలుఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి. సరైన అర్హతలున్న విద్యార్థులు ఏప్రిల్ 10లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్నవారికి ఏప్రిల్ 26న పరీక్ష నిర్వహిస్తారు.


ఎవరు అర్హులు?
టీసీఎస్‌ ఎన్‌క్యూటీ పరీక్ష రాసేందుకు ఇంజినీరింగ్ విద్యార్థులతోపాటు డిగ్రీ, పీజీ, డిప్లొమా చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రెండేళ్లు మించకుండా పనిలో అనుభవం కలిగిన వారు సైతం ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. 


వయోపరిమితి: పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయసు 17 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.


ఎంపిక విధానం: పరీక్షలో సాధించిన స్కోరు ఆధారంగా, సంస్థల నిర్ణయం మేరకు ఉద్యోగ ఎంపికలు ఉంటాయి.


పరీక్ష వివరాలు..
➥ దేశవ్యాప్తంగా నిర్దేశించిన వివిధ పరీక్షా కేంద్రాలలో ప్రతి 4 వారాలకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్ష ఇంగ్లిష్‌లో ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉండవు. ఈ పరీక్షలో అక్రమాలకు పాల్పడిన అభ్యర్థులకు ఏడాది పాటు పరీక్ష రాసేందుకు అనుమతించరు. 


➥ టీసీఎస్ ఎన్‌క్యూటీలో సాధించిన స్కోరుకు రెండేళ్ల వరకే వ్యాలిడిటీ ఉంటుంది. అయితే ఈ స్కోరును మెరుగుపరుచుకొనేందుకు ఎన్నిసార్లయినా పరీక్ష రాసే వెసులుబాటు ఉంది. అభ్యర్థి సాధించిన ఉత్తమ స్కోరునే పరిగణలోకి తీసుకుంటారు. 


➥ పరీక్ష రాసిన తర్వాత ఫలితాలను మీ రిజిస్టర్ ఈ మెయిల్ ఐడీకి పంపిస్తారు. మీ స్కోరు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలో కటాఫ్ మార్కులంటూ ఏమీ ఉండవు. అభ్యర్థుల ప్రతిభను తెలిపే ఈ పరీక్షకు కటాఫ్ స్కోర్ లేదా పాస్/ఫెయిల్ అనే ప్రమాణాలను నిర్ణయించలేదు. వివిధ అంశాల్లో అభ్యర్థుల సామర్థ్యాన్ని అప్పటికప్పుడు అంచనా వేసి స్కోరు ఇస్తారు. ఈ పరీక్షలో వచ్చిన స్కోరును ఆధారంగానే.. కార్పొరేట్ సంస్థల్లోనూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 


తుది నిర్ణయం వారిదే..
టీసీఎస్ ఎన్‌క్యూటీలో స్కోరు సాధించిన అభ్యర్థులకు ఉద్యోగం కచ్చితంగా వస్తుందని ఎలాంటి హామీ ఉండదు. అయితే అభ్యర్థికి ఉద్యోగం వచ్చే అవకాశాలు మాత్రం మెరుగ్గా ఉంటాయి. ఆయా సంస్థల తుది నిర్ణయం మీదే ఉద్యోగ ఎంపికలు ఉంటాయి. 


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.04.2024.


➥ TCS NQT పరీక్షతేది: 26.04.2024.


ONLINE REGISTRATION