TS Inter Calender: తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ క్యాలెండర్‌ని ఇంటర్మీడియట్ బోర్డు మార్చి 30న ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలలకు ఈ క్యాలెండర్ వర్తించనుంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం తరగతులు జూన్ 1 నుంచి ప్రారంభమవుతాయని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి వెల్లడించారు. ఈ మేరకు 2024-2025 విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యా క్యాలెండర్ బోర్డు వెలువరించింది.
ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం.. అక్టోబర్ 6 నుంచి 13 వరకు దసరా సెలవులు, నవంబర్ 18 నుంచి 23 వరకు అర్ధ సంవత్సర పరీక్షలు, వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులుంటాయని తెలిపారు. ఆ తర్వాత జనవరి 20 నుంచి 25 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి మొదటివారంలో ప్రాక్టికల్స్ పరీక్షలు, మార్చి మొదటి వారం థియరీ పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. ఇక మార్చి 29తో విద్యాసంవత్సరం క్యాలెండర్ ముగుస్తుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి పేర్కొన్నారు. మార్చి 30 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఇక 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 31 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని వెల్లడించారు.
తెలంగాణ ఇంటర్ అకడమిక్ ఇయర్ (2024-25) క్యాలెండర్ ..
➥ జూనియర్ కాలేజీల పునఃప్రారంభం: 01.06.2024.
➥ మొదటి, ద్వితీయ సంవత్సరాల ఇంటర్మీడియట్ తరగతులు: 01.06.2024.
➥ దసరా సెలవులు: 06.10.2024 - 13.10.2024.
➥ దసరా సెలవుల తర్వాత పునఃప్రారంభం: 14.10.2023.
➥ అర్ధ సంవత్సర పరీక్షలు: 18.11.2024 - 23.11.2024.
➥ సంక్రాంతి సెలవులు: 11.01.2025 - 16.01.2025.
➥ సంక్రాంతి సెలవుల తర్వాత పునఃప్రారంభం: 17.01.2025.
➥ ప్రీ-ఫైనల్ పరీక్షలు: 20.01.2025 - 25.01.2025.
➥ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు: 2025 ఫిబ్రవరి రెండవ వారం నుండి.
➥ ఇంటర్ థియరీ పరీక్షలు: 2025 మార్చి మొదటి వారం నుండి.
➥ వేసవి సెలవులు: 30.03.2025 - 31.05.2025.
➥ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు: 2025 మే చివరి వారంలో
➥ 2025-26 విద్యా సంవత్సరానికి జూనియర్ కళాశాలల పునఃప్రారంభ తేదీ: 01.06.2025.
ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు..
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. మార్చి 30వ తేదీ ఇంటర్ కాలేజీలకు ఈ విద్యాసంవత్సరానికి చివరి పనిదినంగా ప్రకటించింది. మార్చి 30 నుంచి మే 31 వరకు ఇంటర్ కళాశాలలకు వేసవి సెలవులు ఇస్తున్నట్టు బోర్డు తెలిపింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను బేఖాతరు చేస్తూ కళాశాలలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. గతేడాది కూడా జూనియర్ కళాశాలలు జూన్ 1న ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఈసారి ముందుగానే ఇంటర్ ఫలితాల వెల్లడి..
తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో.. 4,78,527 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా.. 4,43,993 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. పరీక్షల ప్రక్రియ ముగియడంతో జవాబు పత్రాల మూల్యాంకనంపై ఇంటర్ బోర్డు దృష్టి సారించింది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభంకాగా.. పేపర్ వాల్యూయేషన్ వేగంగా సాగుతోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా.. ఈసారి ఇంటర్ పరీక్షల మూల్యాంకాన్ని త్వరగా పూర్తిచేసి, ఫలితాలను కూడా త్వరగా విడుదల చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు ప్రయత్నిస్తోంది. ఎంసెట్‌తో పాటు ఇతర పరీక్షల దృష్ట్యా వీలైనంత త్వరగా వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని చూస్తోంది. వీలైతే ఏప్రిల్ రెండోవారం లేదా మూడోవారంలో ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది..