హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావును కలిశారు. బంజారాహిల్స్ లోని కేశవరావు నివాసానికి శనివారం రాత్రి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో చేరాలని సీనియర్ నేత కేకేను స్వయంగా ఆహ్వానించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు కేశవరావు ఇదివరకే ప్రకటించారని తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, అనిల్ యాదవ్ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్, ఇతర నేతలు కె.కేశవరావును కలిశారు. కేకే హైదరాబాద్ లోనే కాంగ్రెస్ లో చేరతారా, లేక ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరతారా అని చర్చించినట్లు సమాచారం.


కాంగ్రెస్ లో చేరిన కేకే కూతురు 
తెలంగాణలో అధికారపార్టీ కాంగ్రెస్‌లోకి వలసల పర్వం కొనసాగుతోంది. దానం నాగేందర్ ఇదివరకే కాంగ్రెస్ లో చేరగా.. కేకే, ఆయన కూతురు గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరుతామని ప్రకటించారు. అందులో భాగంగానే జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.