'కేజీఎఫ్' సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కి మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా ఆయనకు క్రేజ్ రావడంతో టాలీవుడ్ హీరోలు ఆయనతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ హీరోగా 'సలార్' సినిమాను మొదలుపెట్టిన ప్రశాంత్ నీల్.. త్వరలోనే ఎన్టీఆర్ తో సినిమా మొదలుపెట్టనున్నారు. అలానే రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. కొద్దిరోజుల క్రితం చిరంజీవి-రామ్ చరణ్ కలిసి ప్రశాంత్ నీల్ ని కలవడంతో వీరి కాంబినేషన్ లో సినిమా పక్కా అనుకున్నారు.


కానీ తాజాగా ప్రశాంత్ నీల్ చేసిన కామెంట్స్ వింటే.. రామ్ చరణ్ తో సినిమా లేనట్లే అనిపిస్తుంది. 'కేజీఎఫ్' సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన 'కేజీఎఫ్2' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది చిత్రబృందం. దర్శకుడు ప్రశాంత్ నీల్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. 


ఈ క్రమంలో తన తదుపరి సినిమాల గురించి క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ నీల్. ప్రస్తుతానికి తను కమిట్ అయిన సినిమాలు 'సలార్', ఎన్టీఆర్ తో చేయబోయే మరో సినిమా మాత్రమేనని చెప్పారు. ఈ సినిమాల తరువాత తన తోలి సినిమా 'ఉగ్రం' హీరో మురళితో ఓ సినిమా చేస్తానని.. ఆపైన యష్ తో మరో సినిమా ఉంటుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ లు తప్ప మరే సినిమా ఒప్పుకోలేదని క్లారిటీ ఇచ్చారు. దీన్ని బట్టి రామ్ చరణ్ తో సినిమా లేదనే విషయం స్పష్టమవుతోంది. 


ఇదిలా ఉండగా.. 'కేజీఎఫ్' సినిమా తరువాత వరుసగా తెలుగు హీరోలతో సినిమాలు చేస్తుండడం గురించి ప్రశ్నించగా.. తనకు తానుగా ఏ తెలుగు హీరోని సంప్రదించలేదని.. వాళ్లే తనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించారని వెల్లడించారు ప్రశాంత్ నీల్. 


Also Read: తల్లి కాబోతున్న బాపు బొమ్మ, భర్త బర్త్ డేకు స్పెషల్ న్యూస్