రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటుతున్నారు. ‘బాహుబలి‘ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంతో ప్రభాస్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయికి చేరింది. భారత్ తో పాటు పలు దేశాల్లో ఈ సినిమా అద్భుతంగా ఆడింది. బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ‘బాహుబలి‘ తర్వాత వరుసబెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు ప్రభాస్. అయితే, ఇప్పటి వరకు ‘బాహుబలి‘ రేంజి విజయాన్ని ఏ సినిమా అందుకోకపోవడం విశేషం. ప్రస్తుతం ఆయన నటించిన ‘సలార్‘, ‘కల్కీ 2898 AD‘ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఈ సినిమాలపై దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి.
దేశంలోనే అతిపెద్ద కటౌట్ ఏర్పాటు
అటు ప్రభాస్ రేపు(అక్టోబర్ 23)న తన పుట్టిన రోజు జరుపుకోబోతున్నారు. 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ ఏట అడుగు పెడుతున్నారు. ఇప్పటికే జపాన్ లో ఆయన అభిమానులు బర్త్ డే వేడుకలను షురూ చేశారు. మరోవైపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన బర్త్ డే వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు. అంతేకాదు, ప్రభాస్ తన జీవితంలో మర్చిపోలేని విధంగా బర్త్ డే గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఫ్యాన్స్. హైదరాబాద్ కుకట్‌పల్లిలో కైతలపూర్ గ్రౌండ్స్‌లో భారీ కటౌట్‌ని ఏర్పాటు చేయబోతున్నారు. దేశంలోనే అత్యంత ఎత్తైన కటౌట్‌ని ఏర్పాటు చేసి సర్ప్రైజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. కటౌట్ నిర్మాణానికి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
రేపు ఉదయం 11 గంటలకు కటౌట్ ఆవిష్కణ
రేపు(అక్టోబర్ 23) ఉదయం 11 గంటలకి ప్రభాస్ అతిపెద్ద కటౌట్ ను ఆవిష్కరించనున్నారు అభిమానులు. కటౌట్ ఆవిష్కరణ తర్వాత బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకల్లో ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ కటౌట్ దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. మరోవైపు ప్రభాస్ నటిస్తున్న సినిమాల నుంచి కొత్త అప్ డేట్స్ ఏమైనా వస్తాయేమోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ‘సలార్‘ మూవీ నుంచి ట్రైలర్ విడుదల అవుతుందని అందరూ భావించారు. కానీ, చిత్రబృందం ఈవిషయం గురించి ఎలాంటి వివరాలు వెల్లడించించలేదు. కేవలం ఒక పోస్టర్ ప్రభాస్ కు బర్త్ డే విషెస్ చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: బాక్సాఫీస్ దగ్గర ‘భగవంత్ కేసరి‘ జోష్, మూడో రోజు కలెక్షన్స్ ఎంతంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial