గత కొంతకాలంగా రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతోంది. హీరోల పుట్టిన రోజుల సందర్భంగా సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా 'పోకిరి', 'బిజినెస్ మేన్' 'ఒక్కడు' సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా 'సింహాద్రి' విడుదలై అభిమానులను అలరించింది. ఇక పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా 'ఖుషి', 'జల్సా' సినిమాలు మళ్లీ విడుదలై దుమ్ము రేపాయి. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా 'ఆరెంజ్', అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా 'దేశముదురు' విడుదలయ్యాయి. ఆయా హీరోల అభిమానులతో పాటు సినీ లవర్స్ ను బాగా అలరించాయి.  తాజాగా ప్రభాస్ నటించి 'యోగి' చిత్రం రీ రిలీజ్ అయ్యింది.


రీరిలీజ్ లో అభిమానుల అత్యుత్సాహం


ఆయా సినిమాల రిరీలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ చేసే హడావిడి మామూలుగా ఉండదు. థియేటర్ బయట బాణాసంచా కాల్చడంతో పాటు థియేటర్ లోపల విసిరేందుకు బస్తాల కొద్ది కాగితాలను తీసుకెళ్తారు. హీరో ఇంట్రడక్షన్ సీన్లలో, పాటలు, ఫైట్ల సమయంతో ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తారు. కుర్చీల మీద నిలబడి కొందరు డ్యాన్సులు చేస్తే, స్క్రీన్ దగ్గరికి వెళ్లి మరికొంత మంది స్టెప్పులు వేస్తారు. అయితే, ఒక్కోసారి అభిమానుల అత్యుత్సాహం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురైన సందర్భాలున్నాయి. పవన్ కల్యాణ్ సినిమా ‘ఖుషి’ రీరిలీజ్ సందర్భంగా  కొంతమంది అభిమానులు థియేటర్‌ లోపల బాణాసంచా కాలుస్తూ పెద్ద మొత్తంలో ఆస్తి నష్టానికి కారణం అయ్యారు.


సుదర్శన్ థియేటర్ లో ప్రభాస్ అభిమానుల విధ్వంసం


'యోగి' రీరిలీజ్ సందర్భంగా ప్రభాస్ అభిమానులు  హైదరాబాద్ లో నానా రచ్చ చేశారు.  సుదర్శన్ థియేటర్‌లో సినిమా రన్ అవుతుండగా సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. వెంటనే అభిమానులు నానా యాగీ చేశారు. ఏకంగా బ్లేడ్ తో  సినిమా  స్క్రీన్‌ ను ధ్వంసం చేశారు. బయటకు వచ్చి థియేటర్ అద్దాలు పగల గొట్టారు.  క్యాంటీన్ లోని వస్తువులను విసిరివేశారు. కూల్ డ్రింక్స్  సీసాలను బయటకు విసిరి పగులగొట్టారు. కుర్చీలు విరగొట్టారు. థియేటర్ ను సర్వనాశనం చేశారు.






ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసులు


ప్రభాస్ అభిమానుల అత్యుత్సాహంపై థియేటర్ యాజమాన్యం సీరియస్ అయ్యింది. ఘటనపై పోలీసులుకు కంప్లైంట్ చేసింది. థియేటర్ ధ్వంసానికి పాల్పడిన వారపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, జరిగిన నష్టాన్ని వారి నుంచి వసూలు చేయాలని కోరింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ విధ్వంసంలో పాల్గొన్న పలువురిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే కొంత మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి విచారణ జరిపి బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. అటు ఈ ఘటనపై ప్రభాస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.  


Read Also: KBC 15: బతుకే దినదిన గండం- అయితేనేం, రూ. కోటి ప్రశ్నను చేరుకున్న రాహుల్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial