AP CM Jagan: ఇమిగ్రేషన్ టైంలో చేసిన పొరపాటు కారణంగా కొందరి భారతీయ విద్యార్థులను అమెరికా అధికారులు రిట్నర్ ఫ్లైట్ ఎక్కించి తిప్పి పంపించారు. ఇందులో తెలుగు విద్యా‌ర్థులు కూడా ఉన్నారు. ఇందులో ఏపీకి చెందిన వారు ఉండటంతో ఆ ప్రభుత్వం అప్రమత్తమైంది. 


అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులు అక్కడి అధికారులు ఎందుకు పంపుతున్నారో తెలుసుకోవాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కారణాలు తెలుసుకొని వాటిపై అవగాహన కల్పించాలని సూచించారు. మరొకరికి ఇలాంటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 


విద్యార్థులను తిరిగి పంపించడంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్... అధికారుల నుంచి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి న్యాయం జరిగే విదేశాంగ మంత్రిత్వశాఖతో మాట్లాడాలని సీఎంవో సిబ్బందికి సూచనలు చేశారు. 


భారత్‌కు చెందిన 21 మంది విద్యార్థులను రిటర్న్‌ ఫ్లైట్ ఎక్కించి అమెరికా అధికారులు పంపించడం దేశంలో సంచలనంగా మారింది. ఇమిగ్రేషన్ టైంలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని, డాక్యుమెంట్స్ సరిగా చూపించలేదన్న కారణంతో వారిని తిప్పి పంపించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో కంగారు మొదలైంది. ఎన్నో ఆశలతో చదువుకోసం పంపిస్తే ఇలా జరిగిందని వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. 


తాము అన్ని డాక్యుమెంట్స్ చూపించినప్పటికీ అమెరికా అధికారులు ఎందుకు పంపించారో అర్థం కావడం లేదంటున్నారు విద్యార్థులు. అడిగిన వాటన్నింటికీ సమాధాం చెప్పామంటున్నారు. సమస్య ఏంటో తెలియదని అంటున్నారు. చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులనే కాకుండా అమెరికా వెళ్లిన ప్రతి ఒక్కర్నీ అధికారులు ప్రశ్నిస్తారు. ఎందుకు వచ్చారు. ఏం చేస్తుంటారు. ఎక్కడ ఉంటారు. ఇలా అన్నింటిపై ఆరా తీస్తారు. చేరుకున్న తర్వాత కూడా అనుమానం ఉంటే మళ్లీ ఫోన్ చేసి ప్రశ్నిస్తారు. 


ఇలా అధికారులు తనిఖీ చేయడాన్ని ‘పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీ’గా పిలుస్తారు.  విద్యార్థులకైతే  పేరు, తలిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, ఏ వర్సిటీలో ఏ కోర్సు చదవబోతున్నారని అడుగుతారు. ఆర్థిక స్థితిగతులు, ఆదాయ వనరులు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్స్‌ వంటి వాటిపైనా ఆరా తీస్తారు. వాటన్నింటికీ ఓపికగా సమాధానాలు చెప్పాలి. లేకపోతే రిటర్న్ ఫ్లైట్ ఎక్కించేస్తారు.  


ఇమిగ్రేషన్ అధికారులు అడిగిన ప్రశ్నలకు కొందరు ఆంగ్లంలో సరిగా సమాధానాలు చెప్పలేకపోతున్నారని అమెరికన్‌ కాన్సులేట్‌ వర్గాలు చెబుతున్నాయి. వెనక్కి పంపుతున్న వారిలో సగం మంది కనీస ఆంగ్ల పరిజ్ఞానం లేని వారే ఎక్కువగా ఉన్నారు. ఆంగ్లంలో సమాధానాలు చెప్పలేకపోతే.. జీఆర్‌ఈ, టోఫెల్‌ స్కోర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. అందరిని ఇమిగ్రేషన్‌ అధికారులు ప్రశ్నించడం, తనిఖీ చేయడం వీలుకాదు. కానీ తమకు అనుమానం వచ్చిన కొందర్ని గదుల్లో కూర్చోబెట్టి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు పరిశీలిస్తారు. 


వాట్సప్‌ ఛాటింగ్‌లు, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, ఈ-మెయిళ్లు తనిఖీ చేస్తారు. వాటిలో పార్ట్‌ టైమ్‌ ఉద్యోగానికి సంబంధించినవి, ఫీజులకు అవసరమైన డబ్బు వివరాలు, కన్సల్టెన్సీల ఫీజు గురించి ఉంటే వారి వివరాలు తనిఖీ చేస్తారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతేవెనక్కి పంపడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. 


ఇలా వాళ్లు అడిగినప్పుడు, తనిఖీ చేసినప్పుడు సరైన సమాధానాలు చెప్పాలి. డాక్యమెంట్స్‌పై అనుమానం వచ్చినా రీవెరిఫై చేస్తారు. ఇదే ఇప్పుడు విద్యార్థులకు సమస్యగా మారి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబరు నుంచి మొదలయ్యే ఫాల్‌ సీజన్‌కు వెళ్లే తమ పిల్లల పరిస్థితి ఏంటనే ఆందోళన వారిలో వ్యక్తం అవుతోంది.