Nirmal News :  నిర్మల్ నిర్మల్ పట్టణం గుండా మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కోరుతూ బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారం నాల్గవ రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం గంట గంటకు విషమిస్తుండ‌టంతో డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.. గంట గంటకు మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందని వైద్యులు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి పట్ల బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు  బిజెపి అగ్ర నాయకులు వివేక్ వెంకటస్వామి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లు వచ్చి దీక్షకు సంఘీభావం మద్దతు తెలుపనున్నారు.



నిర్మల్ మాస్టర్ ప్లాన్ నివాదం ఏమిటంటే ?  
 
నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ ప్రాంతం 1990 మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇండస్ట్రియల్ జోన్ పరిధిలో ఉండేది. ఈ భూములను పరిశ్రమల స్థాపన కోసం మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలాంటి వాణిజ్య సముదాయాలు, నివాస గృహాల నిర్మాణాలకు అనుమతులుండవు. కానీ, కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు అధికారులు సిద్ధమవుతున్న తరుణంలో సమాచారం తెలుసుకున్న నిర్మల్​ముఖ్య ప్రజాప్రతినిధి బంధువులు, బీఆర్ఎస్ లీడర్లు ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ లోని భూములను తక్కువ ధరకు కొన్నారు. పాత మాస్టర్ ప్లాన్ నిబంధనల ప్రకారం ఆ భూముల రిజిస్ట్రేషన్లు కేవలం పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థల పేరిటే జరగాల్సి ఉంటుంది. కొత్త మాస్టర్ ప్లాన్ కోసం నోటిఫికేషన్ జారీ కాగానే వీరంతా అప్రమత్తమై మాస్టర్ ప్లాన్ నుంచి ఇండస్ట్రియల్​జోన్​ అయిన సోఫీనగర్​ ప్రాంతాన్ని కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్ లోకి మార్చేశారు. కొత్తగా మంజులాపూర్, తల్వేద గ్రామాల్లోని వ్యవసాయ భూములను ఇండస్ట్రియల్ జోన్ లోకి చేర్చారు. దీనిపై అప్పట్లోనే రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులు ఆ అభ్యంతరాలు స్వీకరించి రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని చెప్పారు. 


కొత్తగా జీవో నెంబర్ 220తో వివాదం 
 
ఇండస్ట్రియల్ జోన్​లో ఉన్న భూములను అప్పట్లో తక్కువ ధరకు కొన్న ముఖ్య ప్రజాప్రతినిధి బంధువులు, ఆ జోన్లను కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్ లోకి మార్చుకునేందుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్​మెంట్​ నుంచి జీవో నెంబర్ 220 ను జారీ చేయించారనే ఆరోపణలున్నాయి. ఈ జీవో గుట్టుచప్పుడు కాకుండా గత డిసెంబర్ మూడున జారీ అయింది. కొత్తగా మున్సిపల్ అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను ఫార్మల్ అప్రూవల్ చేశామని, ఫైనల్ అప్రూవల్ అయ్యేవరకు ఈ ఫార్మల్ అప్రూవల్ కొనసాగుతుందని జీవోలో పేర్కొన్నారు. రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలన్నింటినీ ఫైనల్ అప్రూవల్ మాస్టర్ ప్లాన్ లో పరిగణలోకి  తీసుకుంటామని కూడా జీవోలో స్పష్టం చేశారు. కానీ, కొత్త మాస్టర్ ప్లాన్ ను ఫార్మల్ అప్రూవల్ గా జీవోలో పేర్కొనడంతో సోఫీనగర్ ఇండస్ట్రియల్ భూములు కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్ పరిధిలోకి వచ్చాయి.


బీఆర్ఎస్ నేతలు భూ దందాకు పాల్పడ్డారనివిమర్శలు 


 దీనిని ఆసరాగా చేసుకున్న ముఖ్య ప్రజాప్రతినిధి బంధువులు, బీఆర్ఎస్ లీడర్లు సోఫీనగర్  సర్వే నెంబర్ 258/3 లో ఎనిమిది ఎకరాల భూమిని తక్కువ ధరకు కొని  అందులో రెండు ఎకరాలను రూ.20 కోట్లకు డీమార్ట్ కు అమ్మేసినట్లు చెబుతున్నారు. కొత్త జీవో ఆధారంగా రిజిస్ట్రేషన్ కూడా చేశారు. కాగా, రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న మంజులాపూర్, తల్వేద వ్యవసాయ భూముల్లోకి మార్చిన ఇండస్ట్రియల్ జోన్ ను ఎత్తేయకుండానే సోఫీనగర్ లోని ఇండ స్ట్రియల్ జోన్ ఎత్తేయడం వివాదానికి కారణమవుతోంది. దీనిపై రైతులు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి.