పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే బాలీవుడ్ లో అడుగు పెట్టిన నాటి నుంచి ఆమెపై నిత్యం గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా అవికాస్త మరింత పెరిగాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ సల్మాన్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని ఆమె ఖండించింది కూడా. లేటెస్టుగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. కొద్ది కాలం క్రితం పూజా నటించిన ఓ సినిమా నిర్మాత ఆమె కోసం ఓ కారు కొనిచ్చినట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. షూటింగ్ కోసం ఇబ్బంది పడకుండా రావాలని ఆమె కోసం ఓ లగ్జరీ కారు ఇప్పించారట.   


ఇప్పటికైనా కారు కొనివ్వండి- పూజా


ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు ‘సర్కస్’. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైనా, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. సినిమా సంగతి ఎలా ఉన్నా, ఈ సినిమా షూటింగ్  కోసం పూజా హెగ్డే ఎలాంటి ఇబ్బంది పడకుండా రావాలని ఆమె కోసం ఓ కారు కొనిచ్చినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై పూజా స్పందించింది.  ఆ వార్తలన్నీ అవాస్తవాలని వెల్లడించింది. “నా గురించి ఎప్పటికప్పుడు పేపర్‌లలో ఏదో ఒక కొత్త వార్త వస్తూనే ఉంటుంది. నేను వాటిని చదివి నవ్వుకుంటాను. వీటన్నింటికీ నేను సమాధానం ఇవ్వలేను.  మీడియాలో వచ్చే ప్రతి రూమర్‌కి స్పందించను కూడా. కొన్నిసార్లు ఈ వార్తలను మా తల్లిదండ్రులు కూడా చూస్తారు. వారు కూడా ఇది నిజమా అని అడిగిన సందర్భాలున్నాయి. ఈమధ్య ఏదో ఒక సినిమా నిర్మాత నేను  సౌకర్యవంతంగా షూటింగ్ కు రావాలని కారు కొనిచ్చినట్లు వార్తలు వచ్చాయి. నేను ఆశ్చర్యపోయా. వెంటనే స్ర్కీన్ షాట్ తీసి సదరు నిర్మాతకు పంపించాను. ఇప్పటికైనా నాకు ఓ కారు ఇప్పించాలని కోరాను” అని పూజా తెలిపింది.


సల్మాన్ తో డేటింగ్ వార్తలపైనా స్పందించిన పూజా


గత కొంత కాలంగా ఈ బుట్టబొమ్మ సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపైనా పూజా స్పందించింది. ఆయనతో తాను ఎలాంటి రిలేషన్ షిప్ లో లేనని వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని ప్రస్తావించింది. “డేటింగ్ రూమర్ల గురించి నేను ఏమి చెప్పగలను? నా గురించి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను చదువుతూ ఉంటాను. నేను ఒంటరిగా ఉన్నాను. నేను ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతాను. నేను ప్రస్తుతం నా కెరీర్‌పైనే దృష్టి సారిస్తున్నాను. ఈ పుకార్ల గురించి స్పందించేందుకు ఏమీ లేదు” అని పూజా వెల్లడించింది.   


సల్మాన్, పూజా కలిసి ప్రస్తుతం 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' చిత్రంలో నటించారు. ఏప్రిల్ 21న  సినిమా థియేటర్లలోకి రానుంది. వెంకటేష్ ఈ సినిమాలో పూజా అన్నయ్యగా నటిస్తున్నారు. దీంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. 


Read Also: ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల ‘వార్-2’ మూవీ దర్శకుడికి భారీ రెమ్యునరేషన్ - హీరోలను మించిపోయాడే!