Warangal News: అన్నాతమ్ముళ్లు, అక్కాచెల్లెల్లు, భార్యభర్తలు, తల్లీకొడుకులు, తండ్రీకూతుళ్ల మధ్య మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయి. రోజుకోచోట వావి వరసలు లేకుండా ఆస్తి కోసమో, క్షణకాలం సుఖం కోసం హత్యలకు తెగబడుతున్నారు. అయిన వాళ్లని కూడా మరిచి అరాచకాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ అన్న.. తమ్ముడి వంతుగా వచ్చిన ఇంటి స్థలాన్ని కొట్టేయాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా సోదరుడిని చంపాలని పన్నాగం పన్నాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఉన్న తమ్ముడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తలుపు వద్ద పెద్ద బండ పెట్టి బయటకు రానీయకుండా చేశాడు. కానీ ఎలాగోల తప్పించుకుని బయటకు వచ్చిన అతడిపై బండరాయితో దాడి చేశాడు. అందరి ముందే కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..?
వరంగల్ జిల్లా కేంద్రంలోని కరీమాబాద్ ఉర్సు ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. 40వ డివిజన్ ఉర్సు తాళ్లమండువ ప్రాంతానికి చెందిన గోవిందులు శ్రీనివాస్, శ్రీధర్, శ్రీకాంత్ ముగ్గురు అన్నదమ్ములు. తల్లిదండ్రులకు చెందిన ఇంటి స్థలాన్ని ముగ్గురు 94.16 గజాల చొప్పున పంచుకున్నారు. పెద్ద వాడైన శ్రీనివాస్ మరణించారు. చిన్నవాడైన శ్రీకాంత్ కు వచ్చిన వాటా విషయంలో గొడవ పడిన అన్న శ్రీధర్, ఆ భూమి తనకే కావాలని గొడవ పడ్డాడు. ఇక్కడే ఉంటే చంపేస్తానని కూడా బెదిరించాడు. దీంతో తీవ్రంగా భయపడిపోయిన శ్రీకాంత్.. తన తల్లితో సహా వరంగల్ నుంచి నిజామాబాద్ కు వెళ్లాడు. అక్కడే కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే 2019లో అక్కడే ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కరోనా తర్వాత అనారోగ్య సమస్యలతో తనకు చెందిన ఇంటి స్థలాన్ని అమ్మి ఆ డబ్బుతో వైద్యం చేయించుకోవాలనుకున్నాడు. అదే విషయంపై నిజామాబాద్ నుంచి ఉర్సుకు వచ్చి తన వాటా స్థలాన్ని విక్రయించడానికి ప్రయత్నించాడు.
పెట్రోల్ పోసి నిప్పంటించి.. బయటకు రానీయకుండా బండ అడ్డంపెట్టి
అయితే ఎప్పటి లాగే అన్న శ్రీధర్.. శ్రీకాంత్ ను బెదిరించాడు. దీంతో ఈనెల 7వ తేదీన మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో సోదరుడిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు శ్రీధర్ ను స్టేషన్ కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. తన సోదరుడు భూమి అమ్ముకోవడానికి తనకేమీ అభ్యంతరం లేదని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. భూమిని అమ్మడానికి ఇబ్బందేమీ లేదని నమ్మిన శ్రీకాంత్ భార్యతో కలిసి వరంగల్ కు వచ్చి బంధువుల ఇంట్లో ఉన్నాడు. స్థలాన్ని అమ్ముకునేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. శనివారం కూడా ఎప్పటిలాగే ఇద్దరు కొనుగోలు దారులను వెంట తేసుకొని స్థలం వద్దకు వెళ్లగా.. వెనక నుంచి వచ్చిన శ్రీధర్ తమ్ముడు శ్రీకాంత్ ను కొట్టాడు. దీంతో స్థలం చూసేందుకు వచ్చిన వారిద్దరూ పారిపోయారు. తర్వాతను శ్రీకాంత్ ను ఇంట్లోకి తీసుకెళ్లి గాయపరిచి అతనిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. తలుపు వద్ద పెద్ద బండరాయి పెట్టాడు.
మూడు గంటలపాటు ఆపకుండా దాడి చేస్తున్నా అడ్డుకోని ప్రజలు
అయినప్పటికీ.. శ్రీకాంత్ ఎలాగోల తప్పించుకొని బయటకు వచ్చాడు. అయతే బయటే కాపు కాసిన శ్రీధర్.. బండరాయితో శ్రీకాంత్ పై దాడి చేశాడు. అంతా చూస్తుండగానే ఇష్టం వచ్చినట్లుగా దాడి చేశాడు. సాయంత్రం నాలుగు గంటల నుంచి 7 గంటల వరకు శ్రీకాంత్ ను కొడుతున్నా.. స్థానికంగా ఉన్న వారెవ్వరూ పోలీసులకు సమాచారం ఇవ్వలేరు. శ్రీధర్, అతని భార్యాపిల్లలు ఇల్లు వదిలి పారిపోయారు. సంఘటనా స్థలానికి ఏసీపీ బోనాల కిషన్, మిల్స్ కాలనీ సీఐ శ్రీనివాస్ చేరుకొని పోలీసులు జాగిలాలతో దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్య రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.