Vivekananda Reddy Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డిని (YS Bhaskar Reddy Arrest) సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని (Pulivendula News) భాస్కర్ రెడ్డి ఇంటికి ఆదివారం తెల్లవారుజామునే (ఏప్రిల్ 16) రెండు వాహనాల్లో సీబీఐ అధికారులు 10 మందికి పైగా వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ రెడ్డి కుమారుడు ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తాజాగా అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడం చర్చనీయాంశం అయింది.




దీంతో ప్రస్తుతం పులివెందులలో హైటెన్షన్ నెలకొంది. తొలుత వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ను విచారిస్తున్న సీబీఐ అధికారులు.. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు మెమోను సీబీఐ అధికారులు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున భాస్కర్ రెడ్డి నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు.


ఇదే సమయంలో భాస్కర్ రెడ్డి కుమారుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) హైదరాబాద్ లో ఉన్నారు. అవినాష్ ఇంటికి మరో సీబీఐ అధికారుల టీమ్ వెళ్లినట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే, ఆ ఇంటికి ఎవరూ రాలేదని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. 


పులివెందుల నుంచి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు తమ వాహనాల్లో హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. మరోవైపు, వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి కుమారుడు ఎంపీ అవినాష్‌ రెడ్డిని ఇప్పటికే సీబీఐ అధికారులు నాలుగు సార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే.


ఇటీవల కొద్ది రోజుల క్రితం అవినాష్ రెడ్డి అనుచరుడు అయిన ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు సీబీఐ అధికారులు పులివెందులలోని భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో కలిసి వైఎస్ ఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉదయ్ కుమార్ రెడ్డి ఉన్నట్లుగా గూగుల్ టేకౌట్ ద్వారా సీబీఐ ఆధారాలు సేకరించింది. హత్య కుట్రలో ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర కూడా ఉందనే అనుమానంతో అరెస్టు చేసినట్లు తెలిసింది. 




వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి కుట్రకు పాల్పడ్డారని కేసు నమోదు అయింది. 120బి రెడ్ విత్ 302, 201 సెక్షన్ల కింద భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. హత్య అనంతరం సాక్ష్యాల ధ్వంసంలో భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ అధికారులు అభియోగం మోపారు. వివేకా హత్య కేసులో ఒక కుట్రదారుడిగా భాస్కర్ రెడ్డిపై అభియోగాలు మోపారు. వివేకా గుండెపోటుతో మరణించినట్లుగా తొలుత ప్రచారం జరిగిందని, ఆ గుండెపోటు ప్రచారంలో భాస్కర్ రెడ్డి పాత్ర ఉన్నట్లుగా ఆరోపించారు. హత్యకు ముందు భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ ఉన్నట్లుగా ఆధారాలు గురించినట్లుగా సీబీఐ అధికారులు తెలిపారు.