తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. గత ఏడాది (2022) చివరిలో, డిసెంబర్ నెలలో మూడు మరణాలు చోటు చేసుకున్నాయి. నటులు కైకాల సత్యనారాయణ, చలపతి రావు, వల్లభనేని జనార్ధన్ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఆ బాధను దిగమింగుతూ... కొత్త ఏడాదిలో అంతా బావుండాలని 2023లోకి టాలీవుడ్ అడుగుపెట్టింది. తొలి వారంలో మరణం చోటు చేసుకుంది. 


పెద్దాడ మూర్తి ఇకలేరు
సీనియర్ సినిమా జర్నలిస్ట్, గేయ రచయిత పెద్దాడ మూర్తి (Peddada Murthy) ఇకలేరు. అనారోగ్యం కారణంగా మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం భీముని పట్నం. తండ్రి వీరభద్రరావు నుంచి వారసత్వంగా సాహిత్యం వైపు అడుగులు వేశారు. విశాఖలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఆయన విలేకరిగా ప్రయాణం ప్రారంభించారు. తర్వాత పలు పత్రికల్లో పని చేశారు. 


గేయ రచయితగా పరిచయం చేసిన తమ్మారెడ్డి
సినిమా జర్నలిస్టుగా ఉన్న పెద్దాడ మూర్తిని చిత్ర పరిశ్రమకు గేయ రచయితగా పని చేసిన వ్యక్తి మాత్రం తమ్మారెడ్డి భరద్వాజ. ఆయన తెరకెక్కించిన 'కూతురు' చిత్రంలో ఓ గీతాన్ని రాసే అవకాశం ఇచ్చారు. పలు సీరియళ్లకు కూడా పెద్దాడ మూర్తి పాటలు రాశారు. 


గుర్తింపు తెచ్చిన 'చందమామ', 'స్టాలిన్'
కాజల్ అగర్వాల్, నవదీప్, శివ బాలాజీ ప్రధాన పాత్రల్లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన 'చందమామ' సినిమా పెద్దాడ మూర్తికి ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చింది. ఆ సినిమాలో 'బుగ్గే బంగారమా...' పాటను రాశారు. అయితే, మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'స్టాలిన్' సినిమాలో 'సిగ్గుతో ఛీ ఛీ...' పాటను మరింత గుర్తింపు తీసుకొచ్చింది. ఆయన మాటలు, పాటలు అందించిన 'నాగలి' సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది. హైదరాబాద్, రాజీవ్ నగర్ శ్మశాన వాటికలో బుధవారం పెద్దాడ మూర్తి అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన సోదరుడు పీవీడీఎస్ ప్రకాష్ గత ఏడాది కాలం చేశారు. ఆయన కూడా రచయిత, లిరిసిస్ట్. వరుస మరణాలతో పెద్దాడ మూర్తి కుటుంబంలో విషాదంలో మునిగింది.  


Also Read : 'దిల్' రాజు ఒక్కడూ ఒకవైపు - బడా నిర్మాతలు మరోవైపు? టాలీవుడ్‌లో నయా రగడ?? 


డిసెంబర్ 29, 2022లో మరణించిన వల్లభనేని జనార్ధన్ విషయానికి వస్తే... ఆయన స్వస్థలం ఏలూరు సమీపంలోని పోతులూరు. విజయవాడ లయోలా కాలేజీలో చదివారు. సినిమాలపై ఆసక్తితో పరిశ్రమకు వచ్చారు. నటుడిగా, దర్శక నిర్మాతగా పలు చిత్రాలు చేశారు. ప్రముఖ దర్శక నిర్మాత విజయ్ బాపినీడుకు ఆయన అల్లుడు. బాపినీడు మూడో కుమార్తె లళినీ చౌదరితో జనార్ధన్ వివాహం జరిగింది. జనార్ధన్, లళిని దంపతులకు ముగ్గురు సంతానం. ముగ్గురిలో ఓ అమ్మాయి చిన్నతనంలో మరణించారు. మరో అమ్మాయి అభినయ ఫ్యాషన్ డిజైనర్. అబ్బాయి అవినాశ్ అమెరికాలో ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తున్నారు. 


'గ్యాంగ్ లీడర్'తో గుర్తింపు!
మెగాస్టార్ చిరంజీవి 'గ్యాంగ్ లీడర్'లో సుమలత తండ్రిగా వల్లభనేని జనార్ధన్ నటించారు. ఆ సినిమాతో ఆయనకు ఎక్కువ గుర్తింపు వచ్చింది. నటుడిగా వందకు పైగా సినిమాలు చేసిన జనార్ధన్... దర్శకుడు, నిర్మాత కూడా! దర్శక నిర్మాతగా తొలి సినిమా 'మామ్మగారి మనవరాలు' మధ్యలో ఆగింది. ఆ తర్వాత చంద్రమోహన్ హీరోగా 'అమాయక చక్రవర్తి' సినిమాకు దర్శకత్వం వహించారు. అది కన్నడ హిట్ 'మానస సరోవర్'కు రీమేక్. శోభన్ బాబు హీరోగా 'తోడు నీడ' సినిమా చేశారు. అది హిందీ సినిమా 'బసేరా'కు రీమేక్. ఇంకా పలు సినిమాలు చేశారు. వల్లభనేని జనార్ధన్ నటుడు కావాలని అనుకోలేదు. 'శ్రీమతి కావాలి' సినిమా చేస్తున్న సమయంలో ఆర్టిస్ట్ రాకపోవడంతో ఆయన మేకప్ వేసుకున్నారు. ఆ తర్వాత మామగారు విజయ్ బాపినీడు దర్శకత్వం వహించిన 'గ్యాంగ్ లీడర్'తో గుర్తింపు రావడంతో నటుడిగా కంటిన్యూ అయ్యారు.


Also Read : కొత్త ప్రయాణం మొదలు - చిరు కుమార్తె శ్రీజ ఇన్‌స్టా పోస్టుకు అర్థం ఏమిటి?