Delhi High Court: పెళ్లాం నగలు ఆమె వ్యక్తిగత ఆస్తి అని దానిపై భర్తలు కన్నేస్తే నేరం కిందకు వస్తుందని దిల్లా హైకోర్టు ఓ కేసు విచారణలో భాగంగా తెలిపింది. భార్య నగల చోరీ కేసులో భర్తకు మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఓ కేసు విచారణ సందర్భంగా.. భార్య నగలను ఆమె వ్యక్తిగత ఆస్తిగా పరిగణించాల్సిందేనని పేర్కొంది. కట్టుకున్న వాడైనా సరే.. ముందస్తుగా అనుమతి లేకుండా నగలను తీసుకోవడం తప్పేనని స్పష్టం చేసింది. జస్టిస్ అమిత్ మహాజన్ సార్థ్యంలోని డివిజన్ బెంచి ఈ మేరకు ఉత్తర్వలు జారీ చేసింది.
ఈ కేసులో భర్త తన భార్యను అత్తింటి నుంచి వెళ్లగొట్టడం, అపహరించిన నగలను తీసుకోవడం చేయరాదని కోర్తు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నా ఈ కేసులో నిందితుడు అధికారులకు సహకరించడం కానీ, అపహరణకు గురైన నగలను తిరిగి స్వాధీనం చేయడం కానీ జరగలేదన్నది తమ దృష్టిలో ఉన్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో భర్తకు ముందస్తు బెయిల్ మంజూరు చేసి, పిటిషన్ ను రద్దు చేయలేమని తెలిపారు. ఈ కేసులో అరెస్ట్ నివారణకు ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు.