ప్రముఖ హీరో,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లతా మంగేష్కర్ మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులో పవన్ కళ్యాణ్ గానకోకిల తుది శ్వాస విడిచారననే వార్త తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని తెలిపారు. ఆమె మరణం భారతీయ సినీ సంగీతానికి తీరని లోటుగా అభివర్ణించారు. అనారోగ్యం నుంచి కోలుకుని ఇంటి వెళ్లారని విని స్వస్థత చేకూరిందని అనుకున్నానని తెలిపారు. కానీ ఇలా విషాద వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని అన్నారు. లతాజీ పాటలు భాషతో సంబంధం లేకుండా విన్న వారిందరినీ మంత్రముగ్ధులను చేస్తాయని అన్నారు. తెలుగులో ఆమె పాడిన పాటలు చాలా తక్కువే అయినా మరిచిపోలేనివని కొనియాడారు పవన్ కళ్యాణ్. 70 ఏళ్లుగా సాగుతున్న ఆమె పాటల ప్రయాణం, బాల్యం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆమె నిలిచిన తీరు స్పూర్దిదాయకమని అన్నారు. లతాజీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు పవన్ కళ్యాణ్. 


లతా మంగేష్కర్ వయసు ఇప్పుడు 92 ఏళ్లు. ఆమె 1929లో ఇండోర్లో జన్మించారు. ఆమె అసలు హేమ మంగేష్కర్. అయిదుగురి పిల్లల్లో పెద్దకూతురు. ఆమెకు ముగ్గురు చెల్లెళ్లు. ఒక తమ్ముడు. 13 ఏళ్లకే తండ్రి గుండె పోటుతో మరణించడంతో చాలా కష్టాలు పడింది లతా కుటుంబం. అందుకే చిన్న వయసులోనే సినిమాల్లో నటించడం, పాడడం మొదలుపెట్టారు లతా. 1942లో మొదలుపెట్టిన ఆమె కళా ప్రయాణం ఇప్పటి వరకు సజీవంగా సాగుతూనే ఉంది. ఇప్పుడు లతాజీ భౌతికంగా మరణించినా, ఆమె పాటల రూపంలో అభిమానుల చెవుల్లో వినిపిస్తూనే ఉంటారు. 


Also read: లతా మంగేష్కర్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఆ క్రికెటర్‌తో ప్రేమే కారణమా?


ఇప్పటి వరకు 980 సినిమాల్లో లతా పాటలు పాడారు. దాదాపు ఆ పాటల సంఖ్య 50 వేలకు పైనే ఉంటాయి. చెల్లెలు ఆశా భోంస్లేను కూడా తన దారిలోనే నడిచించారు లతాజీ. వీరి కుటుంబం సినీ సంగీత ప్రపంచానికి చేసిన మేలు ఎంతో. 2001లోనే భారతరత్న అందుకున్నారు. పద్మ భూషణ్, పద్మ విభూషణ్ కూడా గతంలోనే అందుకున్నారు. ఇక ఫ్రాన్స్ ప్రభుత్వం ద లీజియన్ ఆఫ్ హానర్ పురస్కారంతోనూ సత్కరించింది. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు. 


పవన్‌ కల్యాణ్‌తో పాటు ఎంతోమంది ప్రముఖులు కూడా లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించారు. 







Also read: ఒకరిది కోయిల గానం, మరొకరిది తేనెలొలికే తియ్యదనం, రెండూ కలిస్తే!