ప్రముఖ గాయని లతా మంగేష్కర్ గురించి తెలిసిన వారెవరైనా సరే ఆమె పెర్ఫెక్షన్ గురించి మాట్లాడుతుంటారు. ఒక పాట బాగా రావడానికి ఆమె ఎన్నిసార్లైనా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారట. కొన్ని పాటల కోసం మూడు, నాలుగు రోజులు ప్రాక్టీస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది లతా మంగేష్కర్ పాడే విధానాన్ని దిలీప్ కుమార్ కామెంట్ చేశారు. దీంతో ఆమె ఉర్ధూ టీచర్ ను పెట్టుకొని మరీ హిందీ పాటలు పాడారు. అలానే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా తనకు తానే హిందీ నేర్చుకొని లతా మంగేష్కర్ తో గొంతు కలిపారు. 


దక్షిణాది గాయకుల్లో ఎంతమంది లతా మంగేష్కర్ తో కలిసి పాడినా.. ఎస్పీ బాలు కాంబినేషన్ లో వచ్చిన పాటలు ఓ రేంజ్ లో సక్సెస్ అయ్యాయి. తెలుగులో హిట్ అయిన 'మరో చరిత్ర' సినిమాను దర్శకుడు కె.బాలచందర్ హిందీలో 'ఏక్ దూజే కేలియే' అనే పేరుతో రీమేక్ చేశారు. దీనికి లక్ష్మీకాంత్-ప్యారేలాల్ ను సంగీత దర్శకులుగా తీసుకున్నారు. లతా మంగేష్కర్ పక్కన ఎస్పీ బాలుతో పాటలు పాడించాలని బాలచందర్ కోరారు. దీనికి లతా మంగేష్కర్ ఎలాంటి అభ్యంతరం చెప్పకపోతే.. లక్ష్మీకాంత్-ప్యారేలాల్ మాత్రం ఓకే చెప్పడానికి ఆలోచించారట. 


బాలు పాడితే దక్షిణాది స్లాంగ్ వచ్చినా పర్లేదు.. నా హీరో తమిళియన్ కదా అని బాలచందర్.. మ్యూజిక్ డైరెక్టర్లకు చెప్పడంతో వారికి తప్పలేదట. కానీ ఎప్పుడైతే బాలు పాట విన్నారో.. వారు అతడి వాయిస్ కి, పాట పాడే విధానానికి ఫిదా అయిపోయారు. ఒక సింగర్ పాటను ఎలా నేర్చుకోవాలో బాలు దగ్గర చూసి నేర్చుకోవాలంటూ ముంబై మీడియాతో చాలా సార్లు చెప్పారు లక్ష్మీకాంత్-ప్యారేలాల్. 


'ఏక్ దూజే కేలియే' సినిమాలో లతా-ఎస్పీ బాలు కలిసి పాడిన పాటలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాకి ఎస్పీ బాలు నేషనల్‌ అవార్డ్‌ అందుకున్నారు. ఆ తరువాత 'మైనే ప్యార్ కియా' సినిమాలో ఇద్దరూ కలిసి మరికొన్ని పాటలు పాడారు. ఈ సినిమాలో 'ఆజా షామ్ హోనే ఆయీ', 'దిల్ దివానా' పాటలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. బాలుతో కలిసి పాడిన పాటల్లో 'ఆజా షామ్ హోనే ఆయీ' తన ఫేవరెట్ అని లతా మంగేష్కర్ గతంలో ఓ సందర్భంలో చెప్పారు. 


'హమ్ ఆప్ కే హై కౌన్' రికార్డింగ్ సమయంలో లతా మంగేష్కర్ నోటి నుంచి 'హమ్ ఆప్ కే హై కౌన్' అనే లైన్ రాగానే.. 'మై ఆప్ కా బేటా హూ' అని బాలు అల్లరి చేసేవారట. దీంతో లతా పాడడం మానేసి.. 'నన్ను బాలు పాడనివ్వడం లేదు..' అని సరదాగా కోప్పడేవారట. బాలుని ఆమె తన కొడుకులా ట్రీట్ చేసేవారు. ముద్దుగా బాలాజీ అని పిలుచుకునేవారు. 


బాలుకి గొంతులో ఇన్ఫెక్షన్ రావడంతో ఆయన సర్జరీ చేయించుకుంటున్నప్పుడు.. అది అతడి వాయిస్ పై ఎఫెక్ట్ చూపిస్తుందని లతా మంగేష్కర్ చాలా కంగారు పడ్డారు. సర్జరీ చేయించుకోవద్దని బాలుకి చెప్పారట. ఈ విషయాన్ని బాలు స్వయంగా వెల్లడించారు. తెలుగులో 'ఆఖరి పోరాటం' సినిమాలో లతా ఓ పాట పాడినప్పుడు బాలునే ఆమెకి భాష నేర్పించారు. వీరిద్దరూ కలిసి తమిళంలో 'సత్య' సినిమాలో ఓ డ్యూయెట్ పాడారు. ఇలాంటి గొప్ప సింగర్స్ ను ఇండియన్ సినిమా కోల్పోయింది. కానీ వారు పాడిన పాటలు ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచే ఉంటాయి.