RIP Lata Mangeshka: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ అనారోగ్య సమస్యలతో నేటి ఉదయం కన్నుమూశారు. గత నెలలో కరోనా, న్యుమోనియా సమస్యలతో ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమో ఇటీవల కోలుకున్నారు. కానీ అంతలోనే ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ అదే ఆసుపత్రిలో చేరగా వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించక గాయని లతా మంగేష్కర్ తుదిశ్వాస విడిచారు. కుటుంబానికి తన జీవితాన్నే అంకితం చేసిన ఆమె సంగీత ప్రియులకు ఎంతో వినోదాన్ని పంచారు. రాజకీయ నేతగాను సేవలు అందించారు. 


దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను భారత ప్రభుత్వం ఆమెకు అందించింది. 1969లో పద్మభూషణ్, అనంతరం 30 ఏళ్లకు 1999లో పద్మవిభూషణ్ అందుకున్న లతా మంగేష్కర్.. 2001లో అత్యున్నత పురస్కారం భారతరత్న వరించింది. పద్మవిభూషణ్ అందుకున్న ఏడాదే ఆమెకు రాజ్యసభ సీటు లభించింది. సినీ ప్రియులను తన స్వరంతో అలరించిన లతా మంగేష్కర్‌కు తన సేవల్ని మరింత అందిచేందుకు ఎంపీగా అవకాశం ఇచ్చారు. కానీ అందుకు జీతంగా ఒక్క రూపాయి కూడా ఆమె తీసుకోలేదు.







1999లో ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. అనారోగ్య సమస్యల కారణంగా సమావేశాలకు హాజరుకాలేదు. కానీ అదే సమయంలో ఎంపీలుగా ఉన్న నేతలు ప్రణబ్ ముఖర్జీ, షబానా అజ్మీ, అప్పటి రాజ్యసభ ఉపాధ్యక్షులు నజ్మా హెప్తుల్లా వంటి వారు విమర్శించినా సున్నితంగా వ్యవహరించారు. తిరిగి వారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా హుందాగా నడుచుకున్నారు. మిగతా రాజ్యసభ సభ్యుల తరహాలో ఆమె జీతం తీసుకోలేదు. ఢిల్లీలో ఆమెకు కేటాయించిన గెస్ట్ హౌస్‌ను వద్దని తిరస్కరించారు. రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నంత కాలం ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదు. ఆ విధంగా విమర్శకులకు తన నిర్ణయంతోనే బదులిచ్చారు.







ఆపై డైమండ్ కంపెనీ అడోరా నుంచి 5 స్పెషల్ కలెక్షన్స్ తీసుకున్నారు. దానికి స్వరాంజలిగా నామకరణం చేశారు. వీటిని వేలం వేయగా లక్షా 5 వేల యూరోలు రాగా, 2005లో కశ్మీర్ లో సంభవించిన భూకంప బాధితులకు విరాళంగా అందించి గొప్ప మనసు చాటుకున్నారు. భారతరత్న అవార్డు అందుకున్న రెండో సింగర్‌గా నిలిచారు లతా మంగేష్కర్. దాదా సాహెబ్ ఫాల్కే (1989), మహారాష్ట్ర భూషన్ అవార్డు (1997,), ఎన్.టి.ఆర్. జాతీయ అవార్డు (1999) ఆమె సేవలకు నిదర్శనంగా మారాయి.