ప్రముఖ గాయని లతా మంగేష్కర్ లైఫ్‌స్టైల్ చాలా భిన్నమైనది. ఆమె తోబొట్టువులు మీనా, ఆశా భోంస్లే, ఉషా, హృదయనాథ్‌లు పెళ్లి చేసుకున్నా.. లతా మాత్రం పెళ్లికి దూరంగానే ఉన్నారు. జీవితాంతం ఒంటరిగానే జీవించారు. ఇందుకు కారణం ఏమిటని చాలామంది ఆమెను ప్రశ్నించారు. కానీ, పెళ్లిపై ఆమె ఎప్పుడూ నేరుగా సమాధానం చెప్పలేదు. అయితే, ఆమె ఒంటరిగా ఉండిపోవడానికి కారణం.. బిజీ లైఫ్, కుటుంబ బాధ్యతలు మాత్రమే కాదని, ఓ ప్రముఖ క్రికేటర్‌తో ప్రేమే కారణమని సమాచారం. 





బాలీవుడ్ మీడియా సంస్థల కథనం ప్రకారం.. లతా మంగేష్కర్ సోదరుడు హృదయనాథ్‌‌కు క్రికేటర్ రాజ్ సింగ్ దుంగార్పూర్ మంచి స్నేహితుడు. దీంతో రాజ్ సింగ్‌తో లతాకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. రాజ్ సింగ్ రాజస్థాన్‌లోని రాజవంశానికి చెందినవారు. దుంగార్పూర్ పాలకుడు మహారావాల్ లక్ష్మణ్ సింగ్‌జీకి చిన్న కొడుకు. రాజ్ సింగ్ ఓ రోజు తన తండ్రితో లతాతో ప్రేమ గురించి చెప్పారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని తెలిపారు. ఆమె సాధారణ కుటుంబానికి చెందినది కావడంతో లక్ష్మణ్‌సింగ్‌జీ వారి పెళ్లికి అంగీకరించలేదని తెలిసింది. దీంతో రాజ్ సింగ్ కూడా జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. లతా కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయారు. ఇద్దరు తుది శ్వాస వరకు మంచి స్నేహితులుగానే ఉన్నారు. 


సచిన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది రాజ్ సింగే: రాజ్ సింగ్ దుంగార్పూర్ మరెవ్వరో కాదు.. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) మాజీ ప్రెసిడెంట్. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను ప్రపంచానికి పరిచయం చేసినది ఈయనే. రాజ్ సింగ్ 2009 సంవత్సరంలో అల్జీమర్స్ వ్యాధితో చనిపోయారు. ఓ ఇంటర్వ్యూలో మీరు వైవాహిక జీవితాన్ని కోల్పోయినట్లు ఎప్పుడూ అనిపించలేదా అనే ప్రశ్నకు లతా బదులిస్తూ.. “లేదు, అంతా దేవుడి నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఏం జరిగినా మన మంచికే. ఏం జరగకపోయినా కూడా మరింత మంచి జరిగేందుకే. మీరు నన్ను నాలుగు, ఐదు దశాబ్దాల కిందట ఈ ప్రశ్న అడిగి ఉంటే.. మీకు వేరే సమాధానం వచ్చి ఉండేదేమో. కానీ, ఇప్పుడు నాలో అలాంటి ఆలోచనలేవీ లేవు’’ అని తెలిపారు.


వివాదాలూ ఉన్నాయ్: రంగుల ప్రపంచంలో ప్రేమ, పెళ్లిల్లు, స్పర్థలు, వివాదాలు సాధారణమే. సాధారణంగా లతా మంగేష్కర్ చాలా మృదువైన స్వభావం గలవారు. ముక్కుసూటి మనిషి కూడా. సౌమ్యంగా ఉండే ఆమె వివాదాలకు చాలా దూరంగా ఉండేవారు. అయితే, ప్రముఖ సంగీత విద్వాంసుడు భుపేన్ హజారికతో సంబంధం ఉందనే వార్త లతాను బాధించింది. హజారిక మాజీ భార్య ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లతాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె కామెంట్లపై లతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హజారిక సన్నిహితురాలు, దర్శకురాలు కూడా ఈ విషయాన్ని ఖండించారు.