అమెరికాలోని న్యూయార్క్‌లో స్థిరపడిన భారతీయుడు రామ్ అల్లాడి (Ram Alladi). ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'పేజెస్' (Pages Movie). హిందీతో పాటు తెలుగు, తమిళ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇదొక ఫిమేల్ ఓరియెంటెడ్ ఫ్యామిలీ డ్రామా. కల్పనా తివారి (Kalpana Tiwari) ఓ ప్రధాన పాత్రధారి. ఈ రోజు సినిమా ప్రీ లుక్ పోస్టర్, వర్కింగ్ స్టిల్స్ విడుదల చేయడంతో పాటు సినిమా వివరాలు వెల్లడించారు. 


రాజకీయ కుటుంబ నేపథ్యంలో...
'పేజెస్' ఫిమేల్ ఓరియెంటెడ్ డ్రామా అయినప్పటికీ... ఇందులో రాజకీయాలు ఉన్నాయి. ఓ రాజకీయ కుటుంబ నేపథ్యంలో సినిమా సాగుతుంది. దీని గురించి రామ్ అల్లాడి మాట్లాడుతూ ''సామాజిక స్వేచ్ఛకు, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య ఉన్న వ్యత్యాసం మా చిత్రంలో ప్రధాన అంశం. స్త్రీ, స్వేచ్ఛ... ఈ రెండు అంశాల గురించి సినిమాలో చర్చిస్తున్నాం. స్వాతంత్య్రం తర్వాత జరిగిన పరిణామాల వల్ల ప్రభావితమైన రాజకీయ కుటుంబం నేపథ్యంలో కథ సాగుతుంది. ఢిల్లీ, భారత - పాకిస్తాన్ సరిహద్దు, బంగ్లాదేశ్‌ లోని నోవాఖాళీ, తెలంగాణ ప్రాంతాలతో ముడిపడిన కథ ఇది. రెండు దశాబ్దాల నా ప్రవాస భారతీయ జీవితం నన్ను ఈ కథ రాసేలా ప్రభావితం చేసింది. ఇది పూర్తి స్థాయి కల్పిత కథ. ఈ చిత్రంలో కల్పనా తివారీతో పాటు మరో ముగ్గురు మహిళలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు'' అని చెప్పారు.


స్వేచ్ఛకు నిర్వచనం ఏమిటి?
స్వేచ్ఛను మనం ఇచ్చే నిర్వచనం ఏమిటి? సమాజం ఏ విధంగా తీసుకుంటుంది? అనేది 'పేజెస్'లో చూపిస్తున్నారట. ఒకప్పటి బెంగాల్‌లో, ప్రస్తుత బంగ్లాదేశ్‌లో ఉన్న నోవాఖాళీ ప్రాంతంలో గతంలో జరిగిన హింసాత్మక ఘటనలను సినిమాలో ప్రస్తావిస్తున్నారని సమాచారం. కథ, స్క్రీన్‌ప్లే, ఛాయాగ్రహణం, సంగీతం 'పేజెస్' సినిమాలో కీలక పాత్ర పోషిస్తాయని చిత్ర బృందం వెల్లడించింది. 


Also Read : బాలకృష్ణ సినిమా కోసమూ వెయిట్ తగ్గా - ఫ్లాష్‌బ్యాక్‌లో, ప్రజెంట్‌లో...






రామ్ అల్లాడి ఇండిపెండెంట్ ఫిల్మ్‌మేకర్. ఆయన ప్రవాసాంధ్రులు. 'చేసిల్డ్' డాక్యుమెంటరీతో దర్శకుడిగా మారారు. తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకుల ప్రశంసలతో పాటు 11 అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. దర్శకుడిగా రెండో ప్రయత్నంలో 'రాస్ మెటనోయా' రూపొందించారు. జాతిపిత మహాత్మా గాంధీపై తీసిన ఆ చిత్రానికి 14 అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి. సంస్కృత సినిమా 'నభాంసి'కి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు 'పేజెస్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 






కల్పనా తివారీ (Kalpana Tiwari), పంకజ్ మున్షీ, ఆనంద్ రంగరాజన్, శిల్పా దాస్, ప్రసాద్ కమలనాభ, రవి వైద్, నీహరి మండలి, సుమంత ముఖర్జీ, విజయ మేరీ, మధు గుంటుపల్లి, అరుణశ్రీ సాదుల, నంద కిషోర్, దావూద్, యశ్వంత్ సాదుల, వి రాజనీత మధే, వి. ఎరుగురాల, సయ్యద్ మునీబ్, రోహిత్ సత్యన్, కె. భావన, కృష్ణ గోదా, సాయిబాబా యెంగల్దాస్, రామ్ వంగా తదితరులు నటిస్తున్న 'పేజెస్' చిత్రానికి సంగీతం: శ్రీవర్ధన్ సాయి, కూర్పు : రుద్ర అల్లాడి, ఛాయాగ్రహణం : రామ్ అల్లాడి, కృష్ణ గుంటుపల్లి, మాటలు : దీప్తి గంగరాడే, దేవేష్ కుమార్ రాథోడ్, కథ, దర్శకత్వం: రామ్ అల్లాడి, నిర్మాణ సంస్థ: ఏ.ఆర్.ఐటి వర్క్స్ ఇండియా.