మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), నందమూరి బాలకృష్ణ(Balakrishna) ఇదివరకు చాలా సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ పోటీకి సిద్ధమవుతున్నారు. చిరంజీవి-బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'వాల్తేర్ వీరయ్య' సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్లుగానే షూటింగ్ జరుగుతోంది. ఇందులో రవితేజ(Raviteja) కీలకపాత్రలో కనిపించనున్నారు. అలానే మరోపక్క బాలకృష్ణ సినిమా కూడా సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది.
గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా కూడా సంక్రాంతికే రాబోతుందని ప్రకరించారు. సంక్రాంతికి ఎక్కువ సినిమాలు విడుదల అవ్వడం సహజమే కానీ ఈసారి భారీ బడ్జెట్ సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. 'ఆదిపురుష్', వారసుడు' లాంటి సినిమాలు రేసులో ఉన్నాయి. ఇప్పుడు చిరు, బాలయ్య కూడా తోడైతే థియేటర్లు అడ్జస్ట్ చేయడం కష్టమవుతుంది.
ఈ సంగతి పక్కన పెడితే.. చిరంజీవి, బాలయ్య సినిమాలను నిర్మిస్తున్నది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. రెండు సినిమాలకు సంబంధించిన డీల్స్ ను క్లోజ్ చేసే పనిలో పడింది ఈ సంస్థ. ఈ మధ్యకాలంలో బాలయ్య మార్కెట్ బాగా మెరుగుపడింది. కానీ మెగాస్టార్ సినిమాకే ఎక్కువ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా చిరు, బాలయ్యల సినిమాలకు ఓవర్సీస్ బిజినెస్ డీల్ పూర్తయిందని తెలుస్తోంది. ,
రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మిస్తున్నారు కాబట్టి.. ఓవర్సీస్ హక్కులను కూడా ఒకే సంస్థకు కట్టబెట్టినట్లు సమాచారం. ఫార్స్ ఫిలిమ్స్ సంస్థ అమెరికాలో 'వాల్తేర్ వీరయ్య', 'వీరసింహారెడ్డి' సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయబోతుంది. చిరు సినిమాను రూ.7 కోట్లకు కొన్న ఫార్స్ ఫిలిమ్స్.. బాలయ్య సినిమాకి రూ.4 కోట్లు పెట్టి దక్కించుకుంది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే.. 'వాల్తేర్ వీరయ్య' సినిమా దాదాపు 2 మిలియన్ డాలర్లను రాబట్టాలి.
బాలయ్య సినిమా మిలియన్ డాలర్ మార్క్ ను అందుకోవాలి. అమెరికాలో మొదటినుంచి బాలయ్య మార్కెట్ కొంచెం తక్కువే. అందుకే రేటు తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా చిరు సినిమాకి ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. అయితే రికవరీ మాత్రం కష్టమవుతుంది. 'గాడ్ ఫాదర్' సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా.. కొన్ని చోట్ల బయ్యర్లకు నష్టాలే మిగిలాయి. మరి 'వాల్తేర్ వీరయ్య' ఏ రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.
చిరంజీవి-బాబీ సినిమా విషయానికొస్తే.. ఇందులో హీరో ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడతారట. వింటేజ్ స్టఫ్ తో కూడిన మంచి ఎంటర్టైనర్ గా సినిమా నిలుస్తుందని ఇటీవల చిరు వెల్లడించారు. ఈ సినిమాలో చిరు, రవితేజ సవతి సోదరులుగా కనిపించబోతున్నారు. తెరపై చిరంజీవి, రవితేజ మధ్య వచ్చే క్లాష్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. బాలయ్య సినిమా విషయానికొస్తే.. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దునియా విజయ్ విలన్ రోల్ పోషిస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read : గరికపాటిపై 'చిరు' సెటైర్ - మెగాస్టార్ మర్చిపోలేదుగా