Suhas's Uppu Kappurambu OTT Release On Amazon Prime Video Exclusively: యంగ్ హీరో సుహాస్ ఎప్పుడూ డిఫరెంట్ స్టోరీస్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంటారు. సుహాస్, స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ప్రైమ్ వీడియో' తెలుగు ఒరిజినల్ మూవీ 'ఉప్పు కప్పురంబు'. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను సదరు ఓటీటీ సంస్థ తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీకి ఐవీ శశి దర్శకత్వం వహించగా.. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మించారు. కీర్తి సురేష్, సుహాస్‌లతో పాటు సీనియర్ నటుడు బాబు మోహన్, శత్రు, తళ్లూరి రామేశ్వరి ప్రధాన పాత్రల్లో నటించారు. జులై 4 నుంచి 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 'చిట్టి జయపురం పౌరులతో ఈ హృదయ విదారక ప్రయాణానికి సిద్ధంగా ఉండండి.' అంటూ సోషల్ మీడియాలో పేర్కొంది.
1990ల నాటి బ్యాక్ డ్రాప్ స్టోరీ
ఈ మూవీ వసంత్ మారింగంటి స్టోరీ అందించారు. 1990ల నాటి కాలంలో మారుమూల ప్రాంతం చిట్టి జయపురం అనే ఓ కల్పిత గ్రామంలో అక్కడి గ్రామస్థులు.. శ్మశాన స్థలం కోసం పోరాడుతున్న తీరును ఈ మూవీలో సెటైరికల్‌గా చూపించినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారి మృతదేహాలను ఖననం చేసేందుకు.. శ్మశానం కోసం పోరాడిన తీరును ఇందులో చూపించనున్నారు. చమత్కారం, హాస్యంతో కూడిన ఎంటర్‌టైనర్ 'ఉప్పు కప్పురంబు'. ఓ సామాజిక సమస్యపై పోరాడిన తీరు సింపుల్‌గా అద్భుతంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు.
అటు కామెడీ, ఇటు క్రైమ్ థ్రిల్లర్, ఎమోషన్, సెంటిమెంట్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ఇలా జానర్ ఏదైనా తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు సుహాస్. డిఫరెంట్ స్టోరీస్‌తో ఎప్పుడూ అలరించే ఆయన.. తాజాగా.. మరో సోషల్ ఎలిమెంట్‌తో సెటైరికల్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నేషనల్ అవార్డ్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండడం ఈ మూవీపై భారీగా హైప్ క్రియేట్ చేస్తోంది.
ఆలోచింప చేసే స్టోరీ
'ఉప్పు కప్పురంబు' డిఫరెంట్ స్టోరీ అని.. అందరినీ ఆలోచింపచేస్తుందని.. ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్ అండ్ ఒరిజినల్స్ హెడ్ నిఖిల్ మదోక్ అన్నారు. 'మేము చెప్పే స్టోరీ మా పరిధిని మరింత విస్తృతం చేస్తుంది. ఓటీటీ ఆడియన్స్‌కు డిఫరెంట్ స్టోరీస్ అందించేందుకు మేము ఎప్పుడూ కట్టుబడి ఉన్నాం. ఈ మూవీ గ్రామీణ వాతావరణంలో ఓ సామాజిక అంశాన్ని తెరపైకి తెచ్చింది. సుహాస్, కీర్తి సురేష్ వంటి వారితో ఐవీ శశి మూవీ చాలా స్పెషల్. ఇది మాకు ఎంతో గర్వకారణం.' అని పేర్కొన్నారు.
సెటైరికల్ కామెడీ ఎంటర్‌టైనర్
'ఉప్పు కప్పురంబు' తాను చాలా కాలంగా తెరపైకి తీసుకురావాలని కోరుకుంటున్నట్లు డైెరెక్టర్ ఐవి శశి తెలిపారు. '90ల నాటి గ్రామీణ నేపథ్యం, ఓ గ్రామస్థులు ఎదుర్కొన్న పరిణామాలు, అసాధారణ పరిస్థితులను మూవీలో చూపించాం. సొసైటీలో చాలా తీవ్రమైన సమస్యలను పరిష్కరించేలా ఇది ఓ సింపుల్ కార్టూనిష్ వేలో ఉండాలని కోరుకున్నాం. ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజ్ కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.' అని చెప్పారు.