Maruthi Emotional About His Cutout At Siri Complex In Machilipatnam: ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి, సినిమాల్లో తమను తాము నిరూపించుకోవాలనుకునే వారికి 'థియేటర్' అంటే ఓ ఎమోషన్. ఇక్కడ సక్సెస్ సాధించిన తర్వాత వారు.. తమ అభిమాన స్టార్ల సినిమాల టికెట్ల కోసం థియేటర్ల వద్ద లైన్లో నిల్చొని ఆపసోపాలు పడి టికెట్లు సంపాదించుకున్న రోజులను గుర్తు చేసుకుంటుంటారు. డైరెక్టర్ మారుతి కూడా అలాగే తన గతాన్ని గుర్తు చేసుకుని ఎమోషన్ అయ్యారు. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్ 'ది రాజాసాబ్'. ఈ మూవీ టీజర్ సోమవారం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ కాగా.. ఆదివారం రిలీజ్ చేసిన ప్రీ టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. దీంతో టీజర్ కోసం అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

నాన్న.. ఓ అరటి పండ్ల దుకాణం.. 

ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి తన ఒకప్పటి రోజులను తలుచుకుంటూ ఎమోషన్ అయ్యారు. మచిలీపట్నం సిరి కాంప్లెక్స్ (గతంలో కృష్ణ కిశోర్) థియేటర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ థియేటర్ వద్ద తన తండ్రికి ఓ అరటి పండ్ల దుకాణం ఉండేదని.. అక్కడే తాను బ్యానర్లు రాసేవాడినని తెలిపారు. బైక్స్, సైకిల్స్‌కు స్టిక్కర్స్ కూడా వేశానని చెప్పారు. ఈ థియేటర్‌లో విడుదలైన అన్నీ హీరోల బ్యానర్ల కోసం తాను ఆశతో కలలు కనేవాడినని అన్నారు.

Also Read: రాజా సాబ్ టీజర్ రిలీజ్: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగ, ఇవాళ్టి కంప్లీట్ ప్రోగ్రామ్స్ షెడ్యూల్ ఇదిగో

కట్ చేస్తే.. ప్రభాస్ పక్కన భారీ కటౌట్

తన పేరు ఒక్కసారైనా ఇక్కడ చూడాలనుకునే వాడినని చెప్పారు మారుతి. అనుకున్నట్లుగానే ప్రభాస్‌తో 'ది రాజాసాబ్' మూవీ తెరకెక్కించారు. ఇప్పుడు థియేటర్ వద్ద డార్లింగ్ ప్రభాస్ పక్కన మారుతి భారీ కటౌట్ ఏర్పాటు చేశారు ఫ్యాన్స్. దీన్ని చూసిన మారుతి.. 'ఇక్కడ నిలబడి ఇదంతా ఎక్కడ ప్రారంభమైందో తిరిగి చూస్తున్నాను. నా పాన్ ఇండియా స్టార్ పక్కన నా కటౌట్ ఉంది. ఇది సరిపోదా.' అంటూ పేర్కొన్నారు.

ఐ మిస్ యూ నాన్న

నాన్న ఈరోజు చాలా గర్వంగా ఉండేవారని మారుతి అన్నారు. 'ఐ మిస్ యూ నాన్న. నేను ఇప్పుడు మోస్తున్న కృతజ్ఞతకు ధన్యవాదాలు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను నా డార్లింగ్‌ను నేను కలలు కన్నట్లుగా చూపిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు కావాలి.' అంటూ థియేటర్ వెనుక స్టోరీని పంచుకున్నారు మారుతి. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. 'ఇది కదా సక్సెస్ అంటే..' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ  విశ్వప్రసాద్ నిర్మించారు. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.