బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్’తో మళ్లీ ప్రేక్షకుల్లోకి వచ్చారు. మంగళవారం ‘ఆహా’లో ప్రసారమైన షోలో.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ మూవీ టీమ్‌తో ముచ్చటించారు. ఈ షోలో దర్శకుడు అనిల్ రావిపూడితోపాటు హీరోయిన్లు కాజల్ అగర్వాల్, శ్రీలీలా, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ పాల్గొన్నారు. ఈ షో ఆధ్యాంతం చాలా సరదాగా సాగింది. అంతేకాదు.. మధ్య మధ్యలో బాలయ్య తనదైన శైలిలో పొలిటికల్ పంచ్‌లు కూడా విసిరారు. ఆరంభంతోనే.. తమ ఫ్యామిలీ గురించి, వారిపై ప్రజలకు ఉన్న నమ్మకం గురించి చెప్పుకొచ్చారు. 


పొలిటికల్ పంచ్‌తో ఆరంభం


బాలయ్య ఈ షోను ఎమోషనల్ డైలాగ్‌తో ప్రారంభించారు. ‘‘మా మాట మీకు సుపరిచితం. మా బాట సుపరిచితం. మేము ఏంటో మా వాళ్లేంటో.. మా వెంట ఉండే మీకు సదా నమ్మకం. రోజులు మారినా.. రుతువులు రంగులు మార్చినా.. ఎన్ని అమావాస్యలు చీకట్లు చిమ్మినా.. మళ్లీ చంద్రుడు ఉదయిస్తూనే ఉంటాడు. గడ్డుకాలంలో కరుడుగట్టిన గుండె ధైర్యం.. చెడ్డపని చేయలేదు అనే మానసిక స్థైర్యం.. మన జీవితంలో అలుపులేని పోరాటానికి ఊతమిస్తుంది. మరపురాని గెలుపు తీరాలకు చేర్చుతుంది. ఎందుకంటే మేము తప్పు చేయలేదని మీకు తెలుసు. మేము తలవంచమని మీకు తెలుసు. మనల్ని ఆపడానికి ఎవడూ రాలేడని మీకు తెలుసు. మేము మీకు తెలుసు. మా స్థానం మీ మనసు. గుండె బరువెక్కినా.. కళ్లు చెమ్మగిల్లినా.. చెదరని చిరునవ్వును పెదవికి పూయించే బాలయ్య మీ సొంతం. అనిపించింది అనేద్దాం. అనుకున్నాది చేసేద్దాం. ఎవడు ఆపుతాడో చూద్దాం’’ అంటూ బాలయ్య ఈ షోను స్టార్ట్ చేశారు. ఎపిసోడ్ మధ్యలో విలన్ అర్జున్ రాంపాల్ ఎంట్రీ అవుతున్న సమయంలో.. ‘‘నాకు తెలుసు ఏం జరుగుతుందో. సినిమా అయినా లైఫ్ అయినా అంతా బాగున్నప్పుడు ఒకడు దిగుతాడు. మొత్తం నాశనం చెయ్యడానికి దిగుతాడు. దాన్ని సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటకు రావాలి’’ అని బాలయ్య పరోక్షంగా ఏపీ రాజకీయాలపై సెటైర్లు వేశారు. 


ప్రతి దర్శకుడు నాన్నగారితో సమానం: బాలయ్య


దర్శకుడు అనిల్ రావిపూడి బాలయ్యను ఒక సందేహం అడిగారు. నేను ఏడు సినిమాలు చేసిన సాధారణ దర్శకుడిని. కానీ మీరు సెట్‌లోకి రాగానే నన్ను గురువుగారు అని పిలిచారు.. అని అన్నారు. ఇందుకు బాలయ్య సమాధానం చెబుతూ.. ‘‘నువ్వు బచ్చావు అయితే.. నేను బాలుడిని. నీకంటే కొంచెం తక్కువ.. ఏ డైరెక్టర్ అయినా నాకు మా నాన్నగారితో సమానం. ఎందుకంటే దర్శకుడు నా పాత్రకు ప్రాణం పోస్తాడు కాబట్టి. వారు నాకు గురువులాంటివారు కూడా. నువ్వు రాగానే ఈ ప్రశ్న అడిగావు. నా ఇగో హర్ట్ అయ్యింది’’ అంటూ బాలయ్య అలిగారు. అనంతరం అనిల్‌ను ఉద్దేశిస్తూ.. ‘‘నువ్వు గుంటూరు నుంచి బస్సు దిగింది డైరెక్టర్ అవ్వడానికా.. హీరో అవ్వడానికా’’ అని అడిగారు. దీంతో అనిల్ ‘‘దర్శకుడు అవ్వడానికే’’ అని సమాధానం ఇచ్చారు. బాలయ్య స్పందిస్తూ.. ‘‘మరి ఏమిటీ అలా మెలికలు తిరిగిపోతున్నావ్’’ అంటూ అనిల్ రావుపూడి డ్యాన్స్ చేసిన రీల్ వీడియో‌ను చూపించారు. దీనికి అనిల్ సమాధానం ఇస్తూ.. ‘‘ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు పక్కకు వెళ్లి డ్యాన్స్ చేస్తుంటాను’’ అని సమాధానం ఇచ్చారు. 


Also Read: ఎన్ని అమావాస్య చీకట్లు కమ్మినా చంద్రుడు మళ్లీ ఉదయిస్తాడు - ‘అన్‌స్టాపబుల్’లో బాలయ్య హైహోల్టేజ్ డైలాగ్స్