Best Horror Movies On OTT: తల్లీకూతుళ్ల అనుబంధంపై ప్రతీ భాషలో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. అందులో దాదాపు ప్రతీ సినిమాలో కూతురికి ఏదో ఒక కష్టం వస్తే.. తల్లి ప్రపంచాన్ని ఎదిరించి నిలబడుతుంది. కూతురిని కాపాడుకోవడం కోసం తల్లి ఎంత దూరం అయినా వెళ్తుంది. కానీ ఇంగ్లీష్‌లో తెరకెక్కిన ‘ఉమ్మ’ (Umma) మూవీ మాత్రం అన్నింటికంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో తల్లీ, కూతుళ్ల మధ్య ప్రేమ, అప్యాయత లాంటివి ఏమీ ఉండవు. వాళ్లిద్దరి మధ్య పగ మాత్రమే ఉంటుంది. కూతురి మీద పగతీర్చుకోవడం కోసం చనిపోయిన తల్లి.. ఆత్మగా తిరిగొస్తుంది.


కథ..


‘ఉమ్మ’ సినిమా మొదలవ్వగానే సియోన్ అనే అమ్మాయిని వాళ్ల అమ్మ టార్చర్ చేస్తుంటుంది. తనకు కరెంటు షాక్ పెట్టి మరీ తనను హింసిస్తుంటుంది వాళ్ల అమ్మ. కొన్నేళ్ల తర్వాత అమాండ (సాండ్రా ఓ), క్రిస్ (ఫివెల్ స్టెవార్ట్) అనే తల్లీకూతుళ్లు సిటీకి దూరంగా ఒక ఫార్మ్ హౌజ్‌లో జీవిస్తుంటారు. వీరిద్దరూ తేనె బిజినెస్ చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అమాండకు ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే అస్సలు ఇష్టముండదు. అందుకే వైర్లతో సహా అన్నింటినీ కలిపి ఇంటి బేస్మెంట్‌లో వేసి తాళం వేస్తుంది. వేరే వాళ్లను సంప్రదించడానికి వారి దగ్గర కనీసం ఫోన్ కూడా ఉండదు. వారిద్దరూ ఎక్కువగా మనుషులతో కూడా కలవరు. తాము తయారు చేసే తేనెను తీసుకువెళ్లి అమ్మే డ్యానీ (డెర్మోట్ ముల్రోనే) మాత్రమే తరచుగా తమ ఇంటికి వస్తుంటాడు.


ఒకరోజు క్రిస్.. డ్యానీని కలవడానికి వెళ్తున్నప్పుడు ఒక కొరియన్ వ్యక్తి తనను అడ్రస్ అడుగుతాడు. తనకు కొరియా రాదు కాబట్టి మౌనంగా చూస్తుంటుంది క్రిస్. అదే సమయంలో ఆ వ్యక్తి కారులో ఒక బాక్స్‌ను గమనిస్తుంది. తను ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా వెళ్లిపోతుంది క్రిస్. కానీ ఆ వ్యక్తి వచ్చేది క్రిస్ ఇంటికే. అతడు అమాండ బాబాయ్. తన తల్లి చాలాకాలం క్రితం చనిపోయిందని, కూతురిగా అమ్మ అస్థికలకు అమాండ పూజ చేస్తే తన తల్లి ఆత్మ శాంతిస్తుందని తను తెచ్చిన బాక్స్‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోతాడు. ఆ బాక్స్‌ను తెరిచి చూస్తే అందులో తన తల్లి ఉపయోగించే మాస్క్, దాంతో పాటు కొరియన్ వాళ్లు ధరించే ఒక ట్రెడీషనల్ గౌన్ ఉంటుంది. అప్పటినుండి వాళ్ల ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. అమాండకు తన తల్లి ఆత్మ కనిపించడం మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? తన తల్లి నుండి అమాండ ఎలా విముక్తిని పొందింది అనేది తెరపై చూడాల్సిన కథ.



చాలా మైనస్‌లు..


ఒక అమ్మను విలన్‌గా చూపిస్తూ హారర్ సినిమాను తెరకెక్కించాలనుకున్న దర్శకుడు ఐరీస్ షిమ్ ప్రయత్నం కొంతవరకు సక్సెస్ అయ్యింది. కానీ ఇది హారర్ మూవీ అని ప్రేక్షకులను భయపెట్టే విషయంలో మాత్రం తను ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. తల్లీకూతుళ్లుగా సాండ్రా ఓ, ఫివెల్ స్టెవార్ట్.. అద్భుతంగా నటించారు. ‘అమ్మ’ మూవీలో వీరి నటన మాత్రమే పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఆత్మగా మారిన తర్వాత కూడా కూతురిని తల్లి టార్చర్ చేస్తుంది అనే హారర్ ఎలిమెంట్‌ను బాగా ప్లాన్ చేసిన దర్శకుడు.. దానిని తెరపై సరిగా చూపించే విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. ముఖ్యంగా ఒక హ్యాపీ ఎండింగ్ ఇవ్వడం కోసం లాజిక్ లేకుండా సినిమాను ముగించాడని అనిపిస్తుంది. ఒక సింపుల్ హారర్ సినిమాను చూడాలనుకునేవారు ‘ఉమ్మ’ను ట్రై చేయవచ్చు. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్‌కు, నెట్‌ఫ్లిక్స్‌లో ఫ్రీగా అందుబాటులో ఉంది.



Also Read: మౌనంగా ఉంటే రూ.10 కోట్లు - ఏడాది మొత్తం మాట్లాడుకోని భార్యభర్తలు, వాట్ నెక్ట్స్ అనిపించే మూవీ ఇది!