Best Thriller Web Series On OTT: డబ్బుల కోసం ఏమైనా చేసేయొచ్చు అనే ప్రపంచంలో బ్రతుకున్నాం. ఇందులో కొందరు డబ్బు కోసం ఎంత దూరం వెళ్లడానికి అయినా సిద్ధపడతారు. అవన్నీ ఎలాంటి పరిణామాలకు దారితీస్తున్నాయో రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అలా తమకు ఉన్నదానితో తృప్తి చెందకుండా ఇంకా ఇంకా కావాలి అనుకునే ఓ జంట కథే ‘ది సైలెన్స్’ (The Silence). ఇది ఒక బంగ్లాదేశీ వెబ్ సిరీస్. డబ్బుకు ఆశపడితే ఏమవుతుంది అనే అంశంపై ఎన్నో కథలు వచ్చినా.. ఇది వాటన్నింటికి కాస్త భిన్నంగా ఉంటూ చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది అనే ఉత్కంఠను రేకెత్తిస్తుంది.


కథ..


‘ది సైలెన్స్’ వెబ్ సిరీస్ మొదలు అవ్వగానే ఒక చూపులేని ముసలి వ్యక్తి తన మెడిసిన్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడే ఒక పాము ఉంటుంది. దానిని తన కోడలు చూస్తూనే ఉన్నా అతడికి ఏం చెప్పకుండా సైలెంట్‌గా ఉంటుంది. పక్కనుంచి ఇద్దరు వ్యక్తులు అక్కడ పాము ఉందని మీ మావయ్యకు అరిచి చెప్పు అని తనను ఒత్తిడి చేస్తుంటారు. కట్ చేస్తే.. దీని అసలు కథ మొదలవుతుంది. ఏడాది కిందటి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది.


రూబీ (మెహాజబెన్ చౌదరీ), అయాన్ (షామొల్ మావ్లా) భార్యాభర్తలు. వారు ఒక మిడిల్ క్లాస్ జీవితాన్ని గడుపుతుంటారు. రూబీ.. ఒక ముసలావిడ దగ్గర హోమ్ నర్స్‌గా పనిచేస్తుంది. అయాన్.. ఒక క్యాబ్ డ్రైవర్. కానీ వీరిద్దరికీ సులభంగా డబ్బులు సంపాదించాలనే కోరిక ఉంటుంది. అందుకే రూబీ.. తను పనిచేసే ముసలావిడ ఇంట్లో దొంగతనాలు చేస్తుంటుంది. అయాన్.. తన క్యాబ్‌లో ఎక్కే వ్యక్తుల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుని.. వారిని బ్లాక్‌మెయిల్ చేస్తుంటాడు. బెట్టింగ్స్ కూడా వేస్తాడు.


డబ్బులు లేకపోయినా ఫ్రెండ్స్ ముందు దర్జాగా బ్రతుకుతున్నామని చూపించుకోవాలని రూబీ, అయాన్‌లకు కోరిక ఉంటుంది. దానికోసమే వాళ్లు ఎప్పుడూ తమ ఫ్రెండ్స్‌తో ఏదో ఒక అబద్ధం చెప్తుంటారు. అలా వాళ్లకు ఉన్న డబ్బు పిచ్చి వాళ్లతో ఎన్నో తప్పులు చేయిస్తుంది. అదే సమయంలో అయాన్‌కు ఇబ్లీస్ అనే ఒక బిజినెస్ మ్యాన్ పరిచయమవుతాడు. డబ్బులు సంపాదించాలి అనుకుంటే తనను కాంటాక్ట్ చేయమని కార్డ్ ఇస్తాడు.


రూబీ, అయాన్ కలిసి ఇబ్లీస్ చెప్పిన అడ్రస్‌కు వెళ్తారు. అక్కడ ఇబ్లీస్.. అందరితో వింత వింత గేమ్స్ ఆడిస్తూ గెలిచిన వారికి డబ్బులు, గెలవనివారికి ఘోరమైన శిక్షలు విధిస్తుంటాడు. అలా రూబీ, అయాన్ కూడా ఒక గేమ్ ఆడి డబ్బులు గెలుచుకుంటారు. కొన్నాళ్లకు అక్కడే వారికి జమాన్ (అజీజుల్ హకీమ్), అఫ్రోజా (బిజోరీ బర్ఖతుల్లా) జంట పరిచయం అవుతుంది. వారికి అలాంటి గేమ్స్ ఆడడం చాలా ఇష్టమని, తాము చెప్పిన గేమ్ ఆడితే రూ.10 కోట్లు ఇస్తామని రూబీ, అయాన్‌లకు ఆఫర్ ఇస్తారు. దీంతో వారి జీవితం మలుపు తిరుగుతుంది.


ఒక సంవత్సరం పాటు ఎవరితో ఏం మాట్లాడకుండా ఉంటే రూబీ, అయాన్‌లకు రూ.10 కోట్లు ఇస్తామని ఆఫర్ చేస్తారు జమాన్, అఫ్రోజా. ఇది చాలా కష్టమైన పనే అయినా డబ్బు మీద ఆశతో చేయడానికి ఒప్పుకుంటారు. లాయర్ ఎదురుగా 14 కండీషన్స్‌తో ఉన్న కాంట్రాక్ట్‌ను కూడా సైన్ చేస్తారు. అందులో భాగంగా కాంట్రాక్ట్ పూర్తయ్యే వరకు రూబీ, అయాన్ వెళ్లి.. జమాన్, అఫ్రోజా ఇంట్లోనే ఉండాలి. అక్కడికి వెళ్లిన తర్వాత వారి మెడకు ఒక బ్యాండ్‌ వేస్తారు. వారు మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఆ బ్యాండ్ ద్వారా జమాన్, అఫ్రోజాల ఫోన్‌లో అల్లారమ్ మోగుతుంది. రూ.10 కోట్లపై ఆశతో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా రూబీ, అయాన్ అస్సలు మాట్లాడరు. అయాన్ తల్లి చనిపోయినా, తండ్రిని పాము కాటేయబోయినా, వారిద్దరినీ ఒక షాపింగ్ మాల్‌లో కొందరు చితకబాదినా, వారి కళ్ల ముందే హత్య జరిగినా.. ఇలా ఏం చేసినా వారిద్దరూ మాట్లాడకుండా మౌనంగానే ఉంటారు. మరి ఏడాది పూర్తయిన తర్వాత ఏం జరిగింది? అసలు వాళ్లు సంవత్సరం పాటు మాట్లాడకుండా ఎలా ఉన్నారు? వాళ్లు అనుకున్నట్టుగానే రూ.10 కోట్లు వచ్చాయా లేదా? అన్నది తెరపై చూడాల్సిన ట్విస్ట్.



క్లైమాక్సే మైనస్..


ఇప్పటివరకు ఇలాంటి ఒక కథాంశంతో సినిమా గానీ, వెబ్ సిరీస్ గానీ తెరకెక్కలేదు. డబ్బు కోసం ఏమైనా చేసే కథల్లో ‘ది సైలెన్స్’ భిన్నంగా ఉంటుంది. ఏడాది పాటు మాట్లాడకుండా ఉండాలి అనే డిఫరెంట్ కథతో తెరకెక్కిన ఈ సిరీస్‌లో చాలానే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ ఇందులోని ఒకేఒక్క మైనస్.. క్లైమాక్స్. ఆరు ఎపిసోడ్ల ఈ సిరీస్‌ను అనుక్షణం ఆసక్తితో చూసేలా తెరకెక్కించాడు దర్శకుడు విక్కీ జాహేద్. కానీ క్లైమాక్స్‌ను మాత్రం మరోలా మారిస్తే బాగుండేది అనే ఫీలింగ్ చాలామంది ప్రేక్షకులకు కలుగుతుంది. బంగ్లాదేశీ భాషలో వెబ్ సిరీస్ ఎవరు చూస్తారులే అనుకోకుండా థ్రిల్లింగ్ జోనర్ ఇష్టపడేవారు ‘ది సైలెన్స్’పై ఓ లుక్కేయండి. ఇది ‘Binge’ ఓటీటీలో అందుబాటులో ఉంది.



Also Read: ఆ పని కోసం సముద్రంలోకి వెళ్తారు, అంతే అలల్లో చిక్కుకుని దారితప్పుతారు, 41 రోజుల తర్వాత ఊహించని ట్విస్ట్