HanuMan OTT Release Date: ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’.. థియేటర్లలో ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా ఈరోజుల్లో థియేటర్లలో ఎంత బ్లాక్‌బస్టర్ అందుకున్న సినిమా అయినా.. నెలరోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తోంది. కానీ ‘హనుమాన్’ మాత్రం థియేటర్లలో విడుదలయ్యి దాదాపు రెండు నెలలు కావస్తోంది. అయినా ఇంకా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభం కాలేదు. మార్చి 8న జీ5లో ‘హనుమాన్’ వచ్చేస్తుందని వార్తలు వినిపించాయి. దీంతో ఎంతోమంది ప్రేక్షకులు ఎదురుచూశారు. జీ5లో ఈ సినిమా కనిపించకపోవడంతో ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. వాటికి జీ5 స్పందించింది.
ఓటీటీలో కనిపించలేదు..
జనవరి 12న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలయ్యింది ‘హనుమాన్’. చాలామంది ప్రేక్షకులు ఈ సినిమాను విజువల్ వండర్ అంటూ పాజిటివ్ రివ్యూలు ఇచ్చి.. మళ్లీ మళ్లీ దీనిని చూడడానికి థియేటర్లకు వెళ్లారు. ఇక థియేటర్లలో చూడడం కుదరని ప్రేక్షకులు.. ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటికే దీని ఓటీటీ రిలీజ్‌పై ఓ క్లారిటీ లేదు. ముందుగా మార్చి 2న ‘హనుమాన్’ జీ5లో స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు వచ్చాయి. అంతలోనే పోస్ట్‌పోన్ అయ్యిందని మార్చి 8న కచ్చితంగా స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ప్రేక్షకులంతా మార్చి 8న జీ5లో సెర్చింగ్ మొదలుపెట్టారు. కానీ సినిమా మాత్రం కనిపించలేదు. దీంతో సబ్‌స్క్రైబర్స్ జీ5కు ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు.
జీ5 స్పందన..
ప్రేక్షకుల ఫిర్యాదులకు జీ5 స్పందించింది. ‘‘హాయ్.. మాకు దీనిపై ఎలాంటి అప్డేట్ రాలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా వెబ్‌సైట్, సోషల్ మీడియాను ఫాలో అవుతూ ఉండండి’’ అని ప్రకటించింది. దీంతో ఆడియన్స్ మరింత కన్ఫ్యూజన్‌లో పడిపోయారు. ‘హనుమాన్’ ఓటీటీలోకి వచ్చేస్తుంది అనుకుంటే దీనికి ఎలాంటి అప్డేట్ లేదని జీ5 చెప్తోంది. అంటే ఈ మూవీని ఓటీటీలో చూడడానికి ఇంకా చాలాకాలం ఎదురుచూడక తప్పదా అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ‘హనుమాన్’ తెలుగు ఓటీటీ రిలీజ్‌పై పెద్దగా అప్డేట్ లేకపోయినా.. హిందీ రిలీజ్ డేట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హిందీ వెర్షన్‌కు లైన్ క్లియర్..
తెలుగుతో పాటు ఇతర సౌత్ భాషల్లో ‘హనుమాన్’ను స్ట్రీమ్ చేయడం కోసం జీ5 ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. కానీ హిందీ వర్షన్ మాత్రం ప్రత్యేకంగా జియో సినిమా చేతుల్లోకి వెళ్లింది. ఇక మరీ ఆలస్యం చేయకుండా ‘హనుమాన్’ హిందీ వర్షన్‌ను మార్చి 16న ఓటీటీలో స్ట్రీమ్ అయ్యేలా చేయాలని జియో సినిమా నిర్ణయించుకుంది. దీంతో హిందీ ఫ్యాన్స్ మాత్రం ఈ అప్డేట్‌పై సంతోషిస్తున్నారు. కానీ తెలుగులో ఈ సినిమాను ఓటీటీలో చూడాలనుకుంటున్న ప్రేక్షకులు మాత్రం మరికొంతకాలం ఆగాల్సిందే. హిందీలాగానే తెలుగు కూడా కనీసం మార్చి 16 వరకు స్ట్రీమ్ అయిన బాగుంటుందని భావిస్తున్నారు. తెలుగులో మాత్రమే కాదు.. హిందీలో కూడా ‘హనుమాన్’ బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించింది. కేవలం హిందీ వర్షన్‌లోనే ఈ మూవీ రూ.50 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Also Read: ‘పుష్ప 2’ తర్వాత మరో క్రేజీ ఆఫర్‌ను వదులుకున్న శ్రీలీల, కారణం ఇదేనా?