Malayalam Movie Theevandi: 2018లో మలయాళంలో విడుదలైన సినిమా ‘తీవండి’. టొవినో థామస్ హీరోగా, సంయుక్త హీరోయిన్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ‘తీవండి’ అంటే చైన్ స్మోకర్ అని అర్థం. ఫెల్లిని TP దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


పిల్లాడికి ప్రాణం పోసిన సిగరెట్ పొగ


సినిమా ప్రారంభం కాగానే పుల్లినాడ్ గ్రామంలోని దామోదరన్ ఇంటిని చూపిస్తారు. ఆయన భార్య పురిటి నొప్పులతో బాధపడుతుంది. బయటకు జోరుగా వర్షం కురుస్తుంది. హాస్పిటల్ కు తీసుకెళ్లే మార్గం కనిపించదు. దామోదర్ బావ మరిది అమ్మవాన్ దగ్గరలోని పురుడు పోసే మహిళలను తీసుకురావాలని భావిస్తాడు. దామోదరన్ కు ఇష్టం లేకపోయినా, చివరకు వేరే దారి లేక వారిని తీసుకురమ్మంటాడు. వారు ఆమెకు పురుడు పోస్తారు. దామోదరన్ భార్య మగ బిడ్డకు జన్మనిస్తుంది. కానీ, ఆ అబ్బాయిలో చలనం ఉండదు. ఆ బాబు చనిపోయాడని దామోదరన్ బాధపడతాడు. బాబును బయట టేబుల్ మీద ఉంచుతాడు. తన భార్యను చూసేందుకు లోపలికి వెళ్తాడు. అమ్మవాన్ బాధపడుతూ సిగరెట్ కాల్చుతాడు. సడెన్ గా అతడు సిగరెట్ పొగను టేబుల్ మీద ఉన్న బాబు మీదికి వదులుతాడు. ఆ పొగ బాబుకు తగలగానే ఏడ్వడం మొదలుపెడతాడు. మొత్తానికి అమ్మ పాలు తాగకముందే సిగరెట్ పొగను తాగుతాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి పేరే బినీష్. ఈ సినిమాలో హీరో.


చిన్నప్పటి నుంచే సిగరెట్లకు అలవాటు


నెమ్మదిగా బినీష్ పెద్దవాడు అవుతుంటాడు. పుల్లినాడ్ లోని స్కూల్లోనే చదువుకుంటాడు. ఓ రోజు బినీష్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకుంటుండగా, అతడి మామయ్య అమ్మవాన్ సిగరెట్ తాగుతూ కనిపిస్తాడు. పూర్తయ్యాక ఆ సిగరెట్ ముక్కను అక్కడ పడేస్తాడు. దానిని చేతితో తీసుకొని తాగడం మొదలు పెడతాడు బినీష్. నెమ్మదిగా తనుకూడా సిగరెట్లు తాగడం నేర్చుకుంటాడు. తన మామయ్య అమ్మవాన్ కూడా బినీష్ చేత సిగరెట్లు తెప్పించుకుంటాడు. బినీష్ సిగరెట్లు తీసుకురాగానే తనకు కొన్ని డబ్బులు ఇచ్చేవాడు. బినీష్ వాటిని తన అవసరాలకు వాడుకునేవాడు.


నెమ్మదిగా బినీష్ టీనేజీలోకి వస్తాడు. ఓరోజు ఇంట్లో అమ్మ దాచిన డబ్బును తీసుకుని ఫ్రెండ్స్ తో కలిసి బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్తాడు. అక్కడ సిగరెట్లు కొంటారు. ఎవరూ లేని చోటుకు వెళ్లి సిగరెట్లు తాగుతారు. అప్పటి నుంచి బినీష్ స్మోకింగ్ కంటిన్యూ చేస్తాడు. స్కూల్లోని బాత్ రూమ్ లో కూడా సిగరెట్ కాల్చుతాడు. ఈ విషయం ప్రిన్స్ పల్ కు తెలుస్తుంది. సిగరెట్ తాగేవారు ఎవరో చెప్పాలంటాడు. లేదంటే తానే కనిపెట్టి వీపు విమానం మోత మోగిస్తానని హెచ్చరిస్తాడు. వెంటనే బినీష్ ప్రెండ్స్ లో ఒకడు లేచి అసలు విషయం చెప్తాడు. ప్రిన్స్ పల్ వారికి పనిష్మెంట్ ఇస్తాడు. అప్పటి నుంచి బినీష్ ఫ్రెండ్ షఫీర్ సిగరెట్లు కాల్చడం మానేస్తాడు. కానీ, బినీష్ ఓ రోజు రాత్రి తన మావయ్య రూంలోకి వెళ్లి సిగరెట్ తీసుకుని బయటకు వచ్చి కాల్చుతాడు. అతడిని చూసి పోలీసులు దొంగ అనుకుంటారు. స్టేషన్ కు తీసుకెళ్తాడు. తాను దొంగను కాదని, కేవలం సిగరెట్ తాగడానికి రోడ్డు మీదికి వచ్చానని చెప్పడంతో బినీష్ ఫ్యామిలీ మెంబర్స్ షాక్ అవుతారు. అప్పటి నుంచి బినీష్ ను ‘తీవండి’ అని పిలుస్తారు.  


సిగరెట్ కారణంగా ప్రియురాలితో పెళ్లి క్యాన్సిల్


ఇక విషయం ఎలాగూ అందరికి తెలియడంతో బినీష్ ఎక్కువ సిగరెట్లు కాల్చుతాడు. అదే సమయంలో బినీష్ సిస్టర్ పెళ్లి విజిత్ అనే వ్యక్తితో జరుగుతుంది. అతడు భారతీయ సోషలిస్ట్ కాంగ్రెస్ లీగ్ నాయకుడు. అదే పార్టీలో మధు అనే వ్యక్తి కూడా నాయకుడిగా ఉంటాడు. అతడి కూతురు పేరు దేవి. ఆమె బినీష్ చైల్డ్ వుడ్ ఫ్రెండ్. దేవి, బినీష్ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతారు. దేవి ప్రేమ గురించి మధుకు తెలుస్తుంది. మధుకు బినీష్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అయినా, వారి పెళ్లికి ఒప్పుకోకతప్పని పరిస్థితి ఎదురవుతుంది. దీంతో బినీష్ కు మధు ఓ కండీషన్ పెడతాడు. పెళ్లికి ముందే సిగరెట్లు తాగడం మానుకోవాలంటాడు. దానికి బినీష్ ఒప్పుకుంటాడు. అయినప్పటికీ దొంగతనంగా సిగరెట్లు తాగుతాడు.


బినీష్, దేవి కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి ముందే పెళ్లి కూతురు మెడలో ఓ పవిత్రమైన ఆభరణాన్ని వేయాల్సి ఉంటుంది. బినీష్ ప్రతిసారి ఆ జ్యువెలరీని తీసుకురావడం మర్చిపోతాడు. చివరకు ఆ జ్యువెలరీని మర్చిపోకూడదని సిగరెట్ పెట్టెలో పెట్టుకుంటాడు. కానీ, పవిత్రమైన తాడును సిగరెట్ డబ్బాలో పెట్టడం అస్సలు నచ్చదు. బినీష్ మీద కోపంతో పెళ్లిని క్యాన్సిల్ చేస్తుంది. బినీష్ ఎంత బతిమాలినా నో చెప్తుంది. ఆ రోజు రాత్రి సిగరెట్ తాగడం పట్ల బాధపడతాడు. ఎలాగైనా వదిలేయాలి అనుకుంటాడు. కానీ, దేవి వదిలేసిందనే బాధతో మళ్లీ సిగరెట్లు తాగుతాడు.


సిగరెట్ అలవాటును మానుకున్న బినీష్


అటు స్థానిక ఎమ్మెల్యే డ్రైవర్ బ్లూవేల్ గేమ్ బాధితుడు. ఎమ్మెల్యేను కారులో ఎక్కించుకుని ఎక్కడికో వెళ్తాడు. ఫైనల్ స్టేజిలో సూసైడ్ చేసుకోవాలి అనుకుంటాడు. ఆ కారును ఓ ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఆ ఇంట్లోనే బినీష్ ఉంటాడు. కారులోని ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంటుంది. వారిని బినీష్ వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్తాడు. ఎమ్మెల్యే కోమాలోకి వెళ్లాడని, బతికే అవకాశం లేదని డాక్టర్లు చెప్తారు.


ఆ సమయంలో కొత్త లీడర్ కోసం BSCLలో చర్చ జరుగుతుంది. బినీష్ బావ విజిత్ పార్టీలో నెక్ట్స్ లీడర్ తానే అనుకుంటాడు. బినీష్ ను తనకు తోడుగా ఉండాలని చెప్తాడు. అయితే, పార్టీ నాయకులు మాత్రం మధును లీడర్ గా ఎంపిక చేస్తారు. అయితే, బినీష్, విజిత్ ఆ ఎంపికను వ్యతిరేకిస్తారు. బినీష్ నెల రోజుల వరకు సిగరెట్ తాగకుండా ఉంటే తానే ఆ పదవి నుంచి తప్పుకుంటానని మధు ఆఫర్ ఇస్తాడు. బినీష్ కు కోపం వచ్చినా తప్పని పరిస్థితుల్లో సరే అంటాడు. బావ గెలుపు కోసం సిగరెట్స్ తాగకూడదు అనుకుంటాడు. కానీ, దొంగతనంగా పొగ తాగాలి అనుకుంటాడు.


అయితే, మధు తన మనిషిని బినీష్ తో ఉంచి స్మోక్ చేస్తున్నాడో? లేదో? చూడాలని చెప్తాడు. బినీష్ కు సిగరెట్ తాగాలనే కోరిక రోజు రోజుకు పెరుగుతుంది. బినీష్ ను ఇలాగే వదిలేస్తే తాను ఓడిపోతానని భావించిన విజిత్, నెమ్మదిగా అతడిని ఓ ఐలాండ్ కు తీసుకెళ్లి అక్కడ వదిలేస్తాడు. అక్కడ అతడికి కాపలాగా ఇద్దరు వ్యక్తులను ఉంచుతాడు. బినీష్ కు ఈత రాకపోవడంతో అక్కడే ఉంటాడు. అలాగే ఆ ఐలాండ్ కు ఎవరూ వెళ్లకుండా విజిత్ తన మనుషులను సెక్యూరిటీగా ఉంచుతాడు. బినీష్ కు కాపలాగా ఉన్న వ్యక్తులు సింగర్స్ కావడంతో బినీష్ చేత పొగతాగే అలవాటును మాన్పించే ప్రయత్నం చేస్తారు.


నెమ్మదిగా బినీష్ మారిపోతాడు. అదే సమయంలో కొన్ని మత్తు పదార్థాలను మధు మనుషులు ఆ ఐలాండ్ కు తీసుకెళ్తారు. ఎలాగైనా బినీష్ చేత వాటిని తీసుకునేలా చేయాలి అనుకుంటారు. కానీ, వారి ప్రయత్నం ఫలించదు. బినీష్ సిగరెట్లు, మత్తు పదార్థాలు తీసుకోడు. విజిత్ ఈ ఛాలెంజ్ లో విన్ అవుతాడు. మధు పదవి నుంచి తప్పుకుంటాడు. కానీ, కోమాలో ఉన్న ఎమ్మెల్యే కోలుకుంటాడు. తాను ఎమ్మెల్యే కాలేకపోయానని బాధలో విజిత్ సిగరెట్లకు బానిస అవుతాడు. అటు సిగరెట్లు మానడంతో దేవి, బినీష్ పెళ్లి జరుగుతుంది. ఈ సినిమా ప్రస్తుతం సన్ నెక్ట్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.  


Read Also: ఆ జంటను వెంటాడే గతం - వారిని చంపాలనుకునే పోలీస్, థ్రిల్లింగ్‌గా సాగే రివెంజ్ డ్రామా ఇది