Thriller Movies On OTT: ఆ జంటను వెంటాడే గతం - వారిని చంపాలనుకునే పోలీస్, థ్రిల్లింగ్‌గా సాగే రివెంజ్ డ్రామా ఇది

Movie Suggestions: ప్రతీ ఒక్కరికి ఒక గతం ఉంటుంది. అలా గతాలు ఉన్న ఇద్దరు వేర్వేరు మనుషులు కలిస్తే ఎలా ఉంటుంది. వారి గతాన్ని మర్చిపోగలరా? అనే అంశంపై తెరకెక్కిన చిత్రమే ఇది.

Continues below advertisement

Best Thriller Movies On OTT: మామూలుగా రివెంజ్ డ్రామా అంటే అందులో రెగ్యులర్ యాక్షన్, చాలా వైలెన్స్.. ఇవన్నీ కామన్. కానీ అలా లేకుండా కూడా కొన్ని రివెంజ్ డ్రామాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కేవలం యాక్టింగ్‌తో కూడా రివెంజ్ డ్రామాలను ఇంట్రెస్టింగ్‌గా చేయవచ్చు అని చెప్పడానికి ‘రసవతి’ (Rasavathi) అనే సినిమానే ఉదాహరణ. ఈ ఏడాది విడుదలయిన తమిళ థ్రిల్లర్ చిత్రాల్లో ‘రసవతి’ కూడా ఒకటి. విడుదలయిన నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన ఈ మూవీ.. ప్రేక్షకులను చివరి వరకు ఆసక్తిగా చూసేలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది.

Continues below advertisement

కథ..

‘రసవతి’ కథ విషయానికొస్తే.. సినిమా మొదట్లోనే ఇన్‌స్పెక్టర్ పరశు (సుజిత్ శంకర్)కు తన పైఅధికారి నుంచి ఫోన్ వస్తుంది. అతడు చేసిన నేరమేంటో తనకు తెలుసని, వచ్చి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోమని చెప్తాడు. ఆయన చెప్పినట్టుగానే పరశు.. పోలీస్ స్టేషన్‌కు వెళ్తాడు. కానీ వెళ్లిన తర్వాత ఇతర పోలీసులకు తెలియకుండా తన పైఅధికారిని చంపేసి, దానిని యాక్సిడెంట్ అన్నట్టుగా అందరినీ నమ్మిస్తాడు. తన పైఅధికారి చనిపోవడంతో ఇప్పుడు ఆ స్థానంలోకి పరశు వస్తాడు. చేతికి అధికారం రావడంతో తన కింద పనిచేసే పోలీసులను టార్చర్ పెడుతూ సైకోలాగా ప్రవర్తిస్తుంటాడు. కట్ చేస్తే.. సదా (అర్జున్ దాస్) ఒక నాటువైద్యుడు. తన గతంలో కాలికి గాయం కావడం వల్ల సరిగా నడవలేడు. కానీ ఆ గాయం ఏంటి? ఎలా జరిగింది? అని ఎవరికీ చెప్పడు. అలా ఒకరోజు తను బస్ స్టాప్‌లో నిలబడి ఉండగా.. బస్‌లో వెళ్తున్న ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎవరో తనకు తెలియకపోయినా తనకు ధైర్యం చెప్తాడు. అప్పుడే తన చేతిపై ఉన్న టాటూను గమనిస్తుంది.

బస్‌లో చూసిన అమ్మాయిని ఒక రెస్టారెంట్‌లో మళ్లీ కలుస్తాడు సదా. అప్పుడే వారిద్దరూ పరిచయం చేసుకుంటారు. తన పేరు సూర్య (తాన్యా రవిచంద్రన్) అని, అక్కడ కొత్తగా జాయిన్ అయిన మ్యానేజర్ అని చెప్తుంది. ఫస్ట్ లుక్‌లోనే సదా, సూర్య.. ఒకరినొకరు ఇష్టపడతారు. అదే సమయంలో పరశు కూడా అక్కడికి వస్తాడు. వీరిద్దరూ క్లోజ్‌గా మాట్లాడడం పరశుకు అసలు నచ్చదు. ఆ మరుసటి రోజు సదా క్లీనిక్‌ను వెతుక్కుంటూ వెళ్తుంది సూర్య.

ఇద్దరూ ఒకే ఏరియాలో ఉంటారు కాబట్టి అనుకోకుండా తరచుగా కలుస్తూ ఉంటారు. అదే సమయంలో పరశు కూడా సూర్యకు దగ్గరవ్వాలని చూస్తాడు. కానీ సూర్య మాత్రం సదాతో ఎక్కువగా సమయాన్ని గడపడానికే ఇష్టపడుతుంది. ఒకరోజు సూర్య, సదా.. ఇద్దరి జీవితాల్లో ఒక గతం ఉందని, దాని వల్లే వారు ఇలా ఒంటరిగా ఉంటున్నారని తెలుస్తోంది. పరశుకు కూడా ఒక గతం ఉంటుంది. అతడి భార్య తన కళ్ల ముందే ఉరి వేసుకుని చనిపోతుంది. ఆమెను కాపాడాల్సిన పరశు.. మందు తాగుతూ ఆమె మరణాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తాడు. ఇంతకీ వారి గతాలు ఏంటి? పరశుకు, సదాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? తెలియాలంటే ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా చూడాల్సిందే.

ఆ క్యారెక్టర్ మైనస్..

సినిమాను ఎంత థ్రిల్లింగ్‌గా తెరకెక్కించినా కూడా అందులో కొన్ని మైనస్‌లు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాంటి మైనస్‌లు ‘రసవతి’లో చాలానే కనిపిస్తాయి. ముఖ్యంగా డాక్టర్ శైలజాగా రమ్య సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ అసలు ఎందుకు అని ప్రేక్షకులు ఫీల్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. శాంతకుమార్ డైరెక్ట్ చేసిన ‘రసవతి’లో మెయిన్‌గా నటీనటుల యాక్టింగ్ చాలా వర్కవుట్ అయ్యింది. అదే మూవీకి పెద్ద ప్లస్ అయ్యింది. హీరోగా అర్జున్ దాస్, విలన్‌గా సుజిత్ శంకర్ నటన ఆకట్టుకుంటుంది. ఒక సింపుల్ రివెంజ్ డ్రామా థ్రిల్లర్‌ను చూడాలంటే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న ఈ ‘రసవతి’ని చూడాల్సిందే.

Also Read: దెయ్యాలకు క్లాస్ చెప్పే టీచర్, కోపంతో చచ్చినవారిని మళ్లీ చంపేస్తుంది - ఈ సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ అసలు ఊహించలేరు

Continues below advertisement