నెట్‌ఫ్లిక్స్(Netflix)లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాంచైజీలలో ఒకటైన ‘ది విట్చర్’ (The Witcher) సీజన్-3 ఎట్టకేలకు షూటింగ్ ముగించుకుని.. ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఉత్కంఠభరితంగా సాగే ఈ సీరిస్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, మాంచి విజువల్ వండర్‌గా ఈ వెబ్‌సీరిస్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. దీనికి లభించిన పాపులారిటీని సొమ్ము చేసుకొనేందుకు ‘ది విట్చర్’ ప్రీక్వెల్‌ను యానిమేటెడ్ సీరిస్‌‌ను కూడా ఇటీవల విడుదల చేశారు. అంతేకాదు, తాజాగా దీని ప్రీక్వెల్ ‘The Witcher: Blood Origin’ వెబ్ సీరిస్‌ను కూడా వదిలారు. 


గతేడాది డిసెంబరు 25న విడుదలైన ‘ది విచర్: బ్లడ్ ఆరిజన్’లో ‘ది విచర్’కు ముందు ఏం జరిగిందో చూపించారు. ఇప్పుడు దాని కొనసాగింపును కూడా ‘ది విచర్’ సీజన్‌-3కు జోడించారు. దీంతో నెట్‌ఫ్లిక్స్ ప్రేమికులు చాలా ఆసక్తితో ఈ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. ‘The Witcher’ సీజన్-1, 2లలో ఎనిమిదేసి ఎపిసోడ్స్ ఉన్నాయి. సీజన్-3లో కూడా ఎనిమిది ఎపిసోడ్స్ ఉంటాయని ‘నెట్‌ఫ్లిక్స్’ ప్రకటించింది.


ఒక మంత్రగాడు, మంత్రగత్తె మధ్య ప్రేమ, ఓ రాకుమారి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో భారత సంతతి నటి అన్య చలోత్రా.. మంత్రగత్తె యెన్నెఫర్ పాత్రలో నటించింది. హెన్నీ కావిల్ విట్చర్‌గా, ఫ్రెయా అల్లన్ సిరిల్లా సిరి పాత్రల్లో నటించారు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ తరహా వెబ్ సీరిస్‌లను ఇష్టపడేవారికి ఇది కూడా నచ్చుతుంది. మీరు ఇంకా చూడనట్లయితే ఆ రెండు సీజన్లతోపాటు దాని ప్రీక్వెల్ ‘బ్లడ్ ఆరిజన్’ను కూడా ఇప్పుడే చూడటం స్టార్ట్ చేయండి. అయితే, ఇది తెలుగులో అందుబాటులో లేదు. హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. దీన్ని ఇతర భాషల్లోకి కూడా అనువాదించాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. మరి, నెట్‌ఫ్లిక్స్ ఏం చేస్తుందో చూడాలి. 


‘The Witcher’ Season 3 టీజర్ ట్రైలర్‌ను ఇక్కడ చూడండి 






జూన్ 29 నుంచి ‘ది విచర్’ మూడో సీజన్ స్ట్రీమింగ్ కానుంది. దీన్ని మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగంలో 1 నుంచి 5 ఎపిసోడ్లు, రెండో భాగంలో 6 నుంచి 8 భాగాలు ఉంటాయి. మొదటి భాగం జూన్ 29న, రెండో భాగం జులై 27న విడుదల కానున్నాయి. ఈ మేరకు Netflix రిలీజ్ చేసిన టీజర్ ట్రైలర్.. ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తోంది. పోలిష్ రచయిత ఆండ్రెజ్ సప్కోవ్స్కీ రాసిన పుస్తకం ఆధారంగా ‘నెట్‌ఫ్లిక్స్’ ఈ వెబ్ సీరిస్‌ను తెరకెక్కించింది. ‘ది విచర్’ సీజన్‌-3 ఎనిమిది ఎపిసోడ్స్‌కు స్టీఫెన్ సుర్జిక్, గాండ్జా మోంటెరో, లోనీ పెరిస్టెరే, బోలా ఓగున్ దర్శకత్వం వహించారు. 






Read Also:  ‘ఏజెంట్’ నుంచి మరో సాంగ్ రిలీజ్, అందాల భామ ఒంపు సొంపులు, ఆకట్టుకుంటున్న యాక్షన్ సీన్లు