‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా తర్వాత అఖిల్ అక్కినేని నటిస్తున్న చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు.


దుమ్మురేపుతున్న ‘వైల్డ్ సాలా’ సాంగ్


ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.  తాజాగా ఈ సినిమాకు సంబంధించి ‘వైల్డ్ సాలా’ సాంగ్ విడుదల అయ్యింది. పాటలో అఖిల్ ఆపరేషన్ కు సంబంధించిన యాక్షన్ సీన్లను మిక్స్ చేశారు. ఓ వైపు అదిరిపోయే ఐటెమ్ సాంగ్, అందులోనే అందాల భామ ఒంపుసొంపులతో ఆకట్టుకుంది.  



ఆకట్టుకుంటున్న ‘ఏజెంట్’ ట్రైలర్


ఈ సినిమాలో  అఖిల్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. 'ది మోస్ట్ నోటోరియస్.. మోస్ట్ రూత్ లెస్ పేట్రియాట్' అనే డైలాగ్‌తో వదిలిన టీజర్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అఖిల్ క్యారెక్టర్ ఎంత వైల్డ్‌గా ఉండబోతుందనేది చెప్పేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్ మొత్తం మరింత ఉత్కంఠభరితంగా, గ్రిప్పింగ్‌గా ఉంది. యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయింది. అంతేకాదు, అఖిల్ క్యారెక్టర్‌ కూడా ఆసక్తిగా, ఎనర్జిటిక్‌గా ఉంది.ఇక ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి సెన్సార్ పూర్తయ్యింది. U/A సర్టిఫికేట్ వచ్చింది. సినిమా రన్ టైమ్ కూడా 2:36 నిమిషాల నిడివితో థియేటర్లలో రిలీజ్ కానుంది. సినిమా రన్ టైమ్ పట్ల అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీగా అవుతున్నారు.


అఖిల్ కు అగ్ని పరీక్ష..


టాలీవుడ్ లో బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఇప్పటికీ సరైన హిట్ అందుకోలేని హీరోలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో అఖిల్ అక్కినేని కూడా ఒకరు. ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ ఒక్కటి కూడా అందలేదు. మధ్యలో కొన్ని సినిమాలు పర్వాలేదనిపించినా అవి కమర్షియల్ గా హిట్ అందుకోలేకపోయాయి. అఖిల్ చివరిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటించారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా అఖిల్ కు మాత్రం ఇమేజ్ తీసుకురాలేకపోయింది. ఇప్పటి వరకూ అఖిల్ కు ఒక్క మాస్ ఇమేజ్ ఉన్న సినిమా పడలేదు. అందుకే ఈ ‘ఏజెంట్’ సినిమాతో మాస్ ఇమేజ్ తో పాటు కమర్షియల్ హిట్ ను కూడా అందుకోవాలని చూస్తున్నారు అఖిల్. అందుకే మూవీ కోసం ఏకంగా నెలల పాటు కష్టపడి బాడీను మూవీ కు తగ్గట్టు తయారు చేసుకున్నారు. మూవీ ప్రమోషన్స్ లో కూడా రకరకాల స్టంట్ లు చేశారు కూడా. ప్రస్తుతం అఖిల్ ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నారని ఇవన్నీ చూస్తే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సెన్నార్ బోర్డ్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చిందనే అంశం అఖిల్ కు కలిసొచ్చిందనే చెప్పాలి. ఇక మూవీ రిలీజ్ అయ్యాక సినిమా ప్రేక్షకులను కూడా ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. 


Read Also: ముంబైలో కొత్త ఇల్లు కొనుగోలు చేసిన ఆలియా భట్, ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!