Pindam on Aha: సినిమాల ఓటీటీ రిలీజ్ వివరాలను కూడా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ డిఫరెంట్‌గా అనౌన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ఆహా కూడా అలాంటి ఒక ప్రయత్నమే చేసింది. ఆహాలో త్వరలోనే ఒక హారర్ మూవీ విడుదల కానుందని ఒక ఫోటోతో హింట్ ఇచ్చింది. అది మూవీ పోస్టర్ అయితే ఈజీగా గెస్ చేయవచ్చని.. పోస్టర్ కాకుండా వేరే ఫోటోతో హింట్ ఇచ్చింది ఆహా. ఇక ఈ మూవీ ఏంటో గెస్ చేస్తూ నెటిజన్లు.. ఆ పోస్ట్ కింద తెగ కామెంట్స్ పెట్టేస్తున్నారు. చాలావరకు ఆ కామెంట్స్ అన్నీ కరెక్టే అనిపిస్తున్నాయి. ఆ సినిమా ఏంటో ప్రేక్షకులకు అర్థమయిపోయిన రిలీజ్ డేట్‌ను మాత్రం టీమ్ అనౌన్స్ చేయలేదు.


గెస్ చేయండి..


కొన్నిరోజుల క్రితం థియేటర్లలో విడులదయిన ‘పిండం’ అనే హారర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఆహా దక్కించుకున్నట్టు అర్థమవుతోంది. ఈ విషయాన్ని చాలా క్రియేటివ్‌గా బయటపెట్టింది. ఒక కాకి పిండం తింటున్న ఫోటోను పోస్ట్ చేసి ‘భయంకరమైన సినిమా’ అంటూ ట్యాగ్ ఇచ్చింది. ఇక క్యాప్షన్‌లో గెస్ చేస్తూ ఉండండి అని చెప్పింది. దీంతో ఆ ఫోటో చూసి ఈజీగా అర్థం చేసుకున్న నెటిజన్లు.. అది ‘పిండం’ అని కరెక్ట్‌గా గెస్ చేసేస్తున్నారు. త్వరలోనే ఆహాలో ‘పిండం’ అని అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. కానీ విడుదల తేదీ ఎప్పుడు అని మాత్రం చెప్పలేదు. చాలాకాలం తర్వాత తెలుగులో వచ్చిన ప్యూర్ హారర్ మూవీ కావడంతో థియేటర్లలో దీనిని చూడడం మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.






పాజిటివ్ ఫీడ్‌బ్యాక్..


సాయి కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ చిత్రమే ‘పిండం’. ఈ మూవీతో చాలాకాలం తర్వాత లీడ్ రోల్‌లో కనిపించాడు శ్రీరామ్. తన భార్య పాత్రలో కన్నడ నటి ఖుషీ రవి నటించింది. ఇక బేబీ చైత్ర, బేబీ లీషా.. ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. డిసెంబర్ 15న థియేటర్లలో విడుదలయిన ఈ సినిమాకు మంచి టాకే లభించింది. హారర్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయని, ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నంలో మూవీ టీమ్ చాలావరకు సక్సెస్ అయ్యిందని చూసినవారు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. కానీ డిసెంబర్‌లో చాలా హైప్ ఉన్న భారీ బడ్జెట్ చిత్రాల రిలీజ్‌లు ఎక్కువగా ఉండడంతో ‘పిండం’కు అంతగా ఆదరణ లభించలేదు.


నిజమైన సంఘటనల ఆధారంగా..


శ్రీరామ్ లీడ్ రోల్ చేసిన ‘పిండం’లో శ్రీనివాస్ అవసరాల, ఈశ్వరి రావు, రవి వర్మ వంటి నటీనటులు కూడా ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కృష్ణ సౌరభ్ సురంపల్లి అందించిన సంగీతం.. హారర్ ఎలిమెంట్స్‌ను మరింత ఎలివేట్ చేసింది. ఈ మూవీని ఎలాగైనా హిట్ చేయాలనే ఉద్దేశ్యంతో శ్రీరామ్.. చాలా ఇంటర్వ్యూలో పాల్గొంటూ ‘పిండం’ గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు కూడా. అంతే కాకుండా నిజమైన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది అని చెప్పడంతో మూవీపై కాస్త హైప్ క్రియేట్ అయ్యింది. 1930ల్లో నల్గొండలో ఒక కుటుంబం ఎదుర్కున్న వింత సంఘటనలపై రీసెర్చ్ చేసి ‘పిండం’ను తెరకెక్కించాడు దర్శకుడు సాయి కిరణ్.


Also Read: యోగిబాబుతో భూమిక మూవీ - ‘స్కూల్’ ఫస్ట్ లుక్ చూశారా?