The Gift (ది గిఫ్ట్).. 2015లో విడుదలయిన అమెరికన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఒక పెళ్లయిన జంట.. వారి స్నేహితుడి చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఇక కథలోకి వెళ్తే.. సైమన్, రాబిన్.. భార్యాభర్తలు. వాళ్లిద్దరు ఉద్యోగరీత్యా చికాగో నుంచి లాస్ ఏంజెల్స్ లో కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారు. ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం కోసం సూపర్ మార్కెట్‌కు వెళ్తారు. అక్కడ సైమన్ హై స్కూల్ క్లాస్ మేట్ గోర్డన్ కనిపిస్తాడు. అతడిని తన భార్య రాబిన్‌కు పరిచయం చేస్తాడు సైమన్.
ఆ రోజు రాత్రి వాళ్ల ఇంటి డోర్ దగ్గర.. ఒక వైన్ బాటిల్, ఒక వెల్కం నోట్ పెట్టి ఉంటుంది. అది పంపించింది గోర్డన్. సైమన్ ఇంటికి వచ్చాక ఆ విషయం చెప్పి, గోర్డన్‌కు కాల్ చేసి థాంక్స్ చెప్పమంటుంది రాబిన్. సైమన్ సరేనంటాడు. రాబిన్ ఒక ఇంటీరియర్ డిజైనర్. ఇంటి నుంచే వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు గోర్డన్ ఇంటికి వస్తాడు. మరికొన్ని గిఫ్ట్స్ రాబిన్ కి ఇస్తాడు. ఆమె మర్యాదగా ఇంటిలోపలికి ఇన్వైట్ చేస్తుంది. గోర్డన్ ఇల్లంతా తిరిగి చూసి.. అక్కడొక గదిలో బొమ్మలను చూసి, మీకు పిల్లలు లేరా అని అడుగుతాడు. చికాగోలో ఉన్నపుడు మిస్ క్యారియేజ్ అయిందని చెప్తుంది.
రాబిన్.. గోర్డన్‌ను ఆ రోజు డిన్నర్ వాళ్లింట్లోనే చేయాలని రిక్వెస్ట్ చేస్తుంది. గోర్డన్ ఒప్పుకుంటాడు. ఆరోజు వాళ్లు ముగ్గురూ కలిసి డిన్నర్ చేస్తుండగా గోర్డన్.. ‘‘సైమన్ నువ్వు చాలా గొప్పవాడివయ్యావు. మంచి ఉద్యోగం, ఇల్లు, అందమైన భార్య’’ అని చెప్పిందే చెప్తుంటాడు. సైమన్‌కు గోర్డన్‌ను చూస్తే చిరాకు వస్తుంది. అతను వెళ్లిపోయాక ఇక మీదట వీడు మన ఇంటికి రాకూడదు అని రాబిన్‌తో అంటాడు. అంత మంచి వ్యక్తిని ఇలా అంటున్నాడేంటని రాబిన్‌కు డౌట్ వస్తుంది.
ఆ తర్వాత రోజు సైమన్, రాబిన్ బయటకు వెళ్లి వచ్చేటప్పటికి అక్కడ ఇంకో గిఫ్ట్ ఉంటుంది. నీటి తొట్టెలో చేప పిల్లలు ఉంటాయి. ఆ పక్కన ఒక లెటర్ ఉంటుంది. అందులో మీరిద్దరు ఈసారి మా ఇంటికి డిన్నర్‌కు రండి అని ఇన్విటేషన్ పంపుతాడు గోర్డన్. వీడి సంగతేంటో చూద్దామని వెళ్దామంటాడు సైమన్. అలాగే వాళ్లిద్దరూ ఆరోజు గోర్డన్ ఇంటికి డిన్నర్‌కు వెళ్తారు. డిన్నర్ చేస్తుండగా గోర్డన్ కు కాల్ వస్తుంది. దీంతో పక్కకు వెళ్తాడు.
అప్పుడు సైమన్.. రాబిన్‌తో ‘‘వీడు నిన్ను ట్రాప్ చేయటానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తోంది’’ అని అంటాడు. రాబిన్ మాత్రం అస్సలు నమ్మదు. అతని ఇంట్లో ఏదైనా ప్రూఫ్ దొరుకుతుందేమోనని వెతికితే ఒక గదిలో ఆడవాళ్ల బట్టలు కనిపిస్తాయి. ఇంతలో గోర్డన్ వస్తాడు. ‘‘నీకు పెళ్లి కాలేదా’’ అని సైమన్.. గోర్డన్‌ను అడుగుతాడు. ‘‘నాకు పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నా భార్య వలిలేసి వెళ్లిపోయింది. ఇది తన ఇల్లే. నేను కూడా వెళ్లిపోదామనుకున్నాను. నాకిష్టమైన వ్యక్తులు మీరు. మిమ్మల్ని అందుకే ఈ ఇంటికి డిన్నర్ కి పిలిచాను’’ అంటాడు గోర్డన్.
‘‘మేము డిన్నర్ చేయటానికి రాలేదు. ఇక నువ్వు మా ఇంటికి రావొద్దు. గిఫ్టులు పంపొద్దు’’ అని గట్టిగా చెప్తాడు సైమన్. అతడు అలా అన్నందుకు రాబిన్ చాలా బాధ పడుతుంది. ఇంటికెళ్లాక ఆ తొట్టెలో చేప పిల్లలు చచ్చిపోయి ఉంటాయి. కుక్కపిల్ల కూడా కనపడదు. ఆ గోర్డన్ ఏదో కలిపి ఉంటాడని అతని ఇంటికి వెళ్లి చూస్తే గోర్డన్ అక్కడ ఉండడు. అక్కడ వేరే వాళ్లు ఉంటారు. సైమన్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్తాడు. ఆ తర్వాత రోజు కుక్కపిల్ల తిరిగి వస్తుంది. తర్వాత అనేక మలుపులు తిరిగి ఆశ్చర్యం కలిగించే ట్విస్టులు రివీల్ అవుతాయి. అవేంటో తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read: ష్.. గప్‌చుప్, శబ్దం చేస్తే.. ఆ వింత జీవులు చంపేస్తాయ్ - అసలు అవి ఎక్కడ నుంచి వచ్చాయ్?