Best Thriller Movies On OTT: హారర్ సినిమాల్లో సోషల్ మెసేజ్ అనేది చాలా అరుదైన కాంబినేషన్. హారర్ ఎలిమెంట్స్‌తో పాటు దాని వెనుక ఒక సోషల్ మెసేజ్ ఉండే సినిమాలు మనం చాలా తక్కువగా చూస్తుంటాం. అలాంటి ఒక సినిమానే ‘ది బీచ్ హౌజ్’ (The Beach House). ఈతరం మనుషులు భూమిని చాలా నాశనం చేస్తున్నారని, భవిష్యత్తు తరాల కోసం స్వచ్ఛమైన నీరు, గాలి లేకుండా చేస్తున్నారని పర్యావరణ నిపుణులు చెప్తుంటారు. ఒకవేళ ఆ పరిస్థితి మితిమీరితే ఏమైనా జరగొచ్చు అని చెప్పడానికి ‘ది బీచ్ హౌజ్’ మూవీ ఒక ఉదాహరణ.


కథ..


‘ది బీచ్ హౌజ్’ కథ విషయానికొస్తే.. ఈ సినిమా మొదటి సీన్‌లోనే సముద్రం నుంచి విషపూరితమైన పొగ విడుదల అవుతుంటుంది. ఆ సముద్రం ఒడ్డులో, అదే బీచ్‌లో కొన్ని ఇళ్లు కూడా ఉంటాయి. అందులో ఒక ఇల్లు.. ర్యాండెల్ (నోవా లీ గ్రోస్) తండ్రిది. అందుకే కొన్నిరోజుల అక్కడ ఎంజాయ్ చేద్దామని తన గర్ల్‌ఫ్రెండ్ ఎమిలీ (లియానా లిబెర్టో)ను తీసుకొని ఆ బీచ్ హౌజ్‌కు వస్తాడు. అదే సమయంలో ఆ ఇంట్లో వాళ్లు మాత్రమే కాకుండా మరెవరో ఉన్నట్టు ఎమిలీకి అనిపిస్తుంది. అదే సమయంలో తనకు డైనింగ్ టేబుల్‌పై ఒక మహిళ కూర్చొని తింటున్నట్టు కనిపిస్తుంది. వెంటనే వెళ్లి ర్యాండెల్‌‌ను తీసుకొస్తుంది. 


జేన్ (మార్యానా నాగెల్), మిచ్ (జేక్ వేబర్).. తన తండ్రి ఫ్రెండ్స్ అని, చాలాకాలంగా ఆ బీచ్ హౌజ్‌లోనే ఉంటున్నారని ర్యాండెల్‌కు అర్థమవుతుంది. వాళ్లను చూసిన తర్వాత వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోదామని ఎమిలీ అనుకుంటుంది. కానీ జేన్, మిచ్ వెళ్లనివ్వకుండా కలిసి డిన్నర్ చేద్దామని ఆహ్వానిస్తారు. డిన్నర్ అయిన తర్వాత జేన్, మిచ్ కలిసి సరదాగా బీచ్‌లోకి వెళ్తారు. అప్పుడే జేన్ చుట్టూ దట్టమైన పొగ అల్లుకుంటుంది.


తర్వాత రోజు.. జేన్ డైనింగ్ టేబుల్‌పై తింటూ కనిపిస్తుంది. ఎమిలీ వచ్చి తనను పలకరించినా.. తనేం మాట్లాడదు. దగ్గరికి వచ్చి చూస్తే జేన్ మొహం అంతా ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. కానీ ఎమిలీ ఏం మాట్లాడకుండా ర్యాండెల్‌ను తీసుకొని బీచ్‌కు వెళ్తుంది. బీచ్‌లో ర్యాండెల్‌కు అసౌకర్యంగా ఉండడంతో తను తిరిగి ఇంట్లోకి వెళ్లిపోతాడు. 


ర్యాండెల్ వెళ్లిపోయిన తర్వాత ఎమిలీకి మిచ్ కనిపిస్తాడు. తను పిలుస్తున్న వినిపించుకోకుండా సముద్రంలోకి వెళ్లి ఆత్మహత్యకు చేసుకుంటాడు మిచ్. అదే విషయం జేన్‌కు చెప్దామని ఇంట్లోకి వస్తుంది ఎమిలీ. కానీ జేన్ ఆకారం పూర్తిగా మారిపోతుంది, తన కళ్లు పూర్తిగా తెల్లగా అయిపోతాయి. అంతే కాకుండా ర్యాండెల్‌ను చంపడానికి జేన్ వెంటపడుతుంది. వెంటనే ర్యాండెల్‌ను కాపాడిన ఎమిలీ.. వాళ్ల ఇంటి బయట ఒక పోలీస్ కారును చూస్తుంది. ఆ కారులో ఉన్న రేడియో నుంచి సాయం అడుగుతుంది. భూమిపై వేడి ఎక్కువ అవ్వడం వల్ల సముద్రంలో నుంచి ప్రమాదకరమైన గ్యాస్ బయటికి వస్తుందని, ఆ పొగను పీల్చుకోవద్దని పోలీసులు చెప్తారు. అలాంటి భయంకరమైన పరిస్థితి నుంచి ఎమిలీ ఎలా తప్పించుకుంటుంది అనేదే తెరపై చూడాల్సిన కథ.



డిఫరెంట్ కథ..


మామూలుగా భూమిపై కాలుష్యం, వేడిలాంటివి ఎక్కువయితే ఏం జరుగుతుందో చెప్తూ పలు సినిమాలు వచ్చాయి. కానీ అవన్నీ దాదాపుగా సైన్స్ ఫిక్షన్ జోనర్‌లోనే ఉన్నాయి. అలా కాకుండా ఇలాంటి ఒక కథను తీసుకొని, దానికి హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు దర్శకుడు జెఫ్రీ ఏ బ్రౌన్. కొన్ని సీన్స్ చూడడానికి ఇబ్బందికరంగా ఉన్నా.. థ్రిల్లర్ జోనర్‌ను ఇష్టపడేవారు తర్వాత ఏం జరుగుతుంది అని ఆసక్తితో చూడగలిగే సినిమా ఇది. ఒక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే ‘అమెజాన్ ప్రైమ్’లో ఉన్న ‘ది బీచ్ హౌజ్‌’ను చూసేయండి.


Also Read: ఆ కోరిక తీర్చుకోడానికి మళ్లీ పుట్టే సైకో కిల్లర్ - పిల్లాడి అరాచకాలు చూసి తల్లి షాక్, ఇదో వెరైటీ థ్రిల్లర్ మూవీ