Best Thriller Web Series On OTT: బంగ్లాదేశీ భాషలోని సినిమాలు అయినా, వెబ్ సిరీస్‌లు అయినా అంతగా ఫేమస్ కాదు.. కానీ అందులో కూడా కొన్ని వెబ్ సిరీస్‌లు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అందులో ఒకటి ‘తఖ్దీర్’ (Taqdeer). 2020లో విడుదలయిన ఈ సిరీస్.. ఎక్కడా బోర్ కొట్టకుండా తర్వాత ఏం జరుగుతుంది అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో క్రియేట్ చేస్తుంది.


కథ..


‘తఖ్దీర్’ కథ విషయానికొస్తే.. ముందుగా ఒక అమ్మాయి తనపై జరిగిన రేప్ గురించి చెప్తూ ఉంటుంది. దీనిని ఒకరు రికార్డ్ చేస్తుంటారు. కట్ చేస్తే తఖ్దీర్ (చంచల్ చౌదరీ).. ఒక శవాల ఫ్రీజర్ వ్యాన్‌కు డ్రైవర్. తన స్నేహితుడు మోంటూ (షోహెల్ మొండోల్) చేపల వ్యాపారం చేస్తుంటాడు. ఒకరోజు మోంటూ దగ్గర చేపలను తన ఫ్రీజర్ వ్యాన్‌లో వేసుకొని అమ్మడానికి వెళ్తాడు తఖ్దీర్. అప్పుడే తనకు అందులో ఒక అమ్మాయి శవం కనిపిస్తుంది. మోంటూకు ఫోన్ చేసి మాట్లాడుతున్న క్రమంలో తనకు శవం గురించి ఏమీ తెలియదని తఖ్దీర్‌కు అర్థమవుతుంది. దీంతో ఏం చేయాలో తెలియక ఫ్రీజర్‌లో శవాన్ని దాచిపెడతాడు. అదే సమయంలో వేరే శవానికి ఫ్రీజర్ కావాలని ఆర్డర్ రావడంతో అక్కడికి వెళ్తాడు. అది పోలీస్ కమీషనర్‌ కుటుంబానికి సంబంధించిన శవం. దీంతో ఆ శవాన్ని కూడా తన వ్యాన్‌లో వేసుకొని మోంటూకు కబురు పంపిస్తాడు తఖ్దీర్.


మోంటూ వచ్చిన తర్వాత శవాలను మార్చి కమీషనర్ బంధువు శవం స్థానంలో ఆ అమ్మాయి శవాన్ని పెట్టేస్తారు. దీంతో వారంతా చూసుకోకుండా ఆమెకు అంత్యక్రియలు జరిపిస్తారు. ఆ తర్వాత మోంటూ, తఖ్దీర్ కలిసి టీవీలో ఒక వార్తను చూస్తారు. అఫ్సానా (సంజీదా ప్రీతి) అనే రిపోర్టర్, రానా (మనోజ్ ప్రమాణిక్) అనే కెమెరామ్యన్ రెండురోజుల నుండి కనిపించడం లేదని అందులో చూపిస్తారు. దీంతో తమ వ్యాన్‌లో దొరికింది అఫ్సానా శవమే అని వారికి అర్థమవుతుంది. రానానే తనను చంపేసి ఇలా చేసుంటాడని వారు అనుమానిస్తారు. శవం కోసం వచ్చిన రానాను మోంటూ, తఖ్దీర్ బంధిస్తారు. దీంతో వారికి అసలు విషయం చెప్పేస్తాడు రానా.


కొన్నిరోజులు క్రితం ఒక రేప్ అయిన అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి అఫ్సానా, రానా వెళ్తారు. అక్కడే జరిగిన ఒక ఫైర్ యాక్సిడెంట్ గురించి అందరూ కవర్ చేస్తారు కానీ రేప్ గురించి మాత్రం ఎక్కడా వార్తల్లో చూపించరు. దీంతో అసలు తనకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి అఫ్సానా, రానా వెళ్తారు. ఆ అమ్మాయిని కలిసి తను చెప్పిందంతా వీడియో రికార్డ్ చేస్తారు. ఆ వీడియో రికార్డింగ్‌ను దొంగలించడానికి ఒక మనిషి వస్తాడు. అతడు దానిని తీసుకోబోతుంటే అఫ్సానా ఆ మెమోరీ కార్డ్‌ను మింగేస్తుంది. దీంతో కోపంలో అతడు.. అఫ్సానాను షూట్ చేస్తాడు. రానా.. ఆ శవాన్ని తఖ్దీర్ వ్యాన్‌లో దాచేస్తాడు. ఆ మెమోరీ కార్డ్ తమకు చాలా ముఖ్యమని తఖ్దీర్, మోంటూలకు చెప్తాడు రానా. దీంతో ముగ్గురు కలిసి అఫ్సానా శవాన్ని తవ్వడం మొదలుపెడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ మెమోరీ కార్డ్ కోసం ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఆ అమ్మాయిని రేప్ చేసింది ఎవరు? అని తెలుసుకోవాంటే ఈ వెబ్ సిరీస్‌ను చివరి వరకు చూడాల్సిందే.



షార్ట్ అండ్ థ్రిల్లింగ్..


కొన్ని వెబ్ సిరీస్‌లు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా నిడివి ఎక్కువగా ఉంటాయి. కానీ ‘తఖ్దీర్’ అలా కాదు.. ఇది కేవలం 8 ఎపిసోడ్ల సిరీస్. ఈ సిరీస్‌లోని కొన్ని ట్విస్టులను ప్రేక్షకులు ముందే ఊహించే అవకాశాలు ఉన్నా.. వారి ఆసక్తి మాత్రం ఎక్కడా మిస్ అవ్వకుండా చూసుకున్నాడు దర్శకుడు సయ్యద్ అహ్మద్ షాకీ. ఒక షార్ట్ అండ్ థ్రిల్లింగ్ సిరీస్‌ను చూడాలంటే హోయ్‌చోయ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ‘తఖ్దీర్’ను చూసేయండి. అయితే, ఇదే స్టోరీ లైన్‌తో తెలుగులో జేడీ చక్రవర్తి ‘దయ’ వెబ్ సీరిస్ వచ్చింది. దానికి ఇంకా రెండో సీజన్ రావల్సి ఉంది. ఈ వెబ్ సీరిస్ చూస్తే.. సీజన్ 2లో ఏం ఉండబోతుందో తెలిసిపోతుంది.


Also Read: హోటల్ రూమ్‌లో సీసీ కెమెరాలు, వివాహేతర సంబంధాన్ని బయటపెట్టిన ఛాటింగ్ - చివరికి ఆ భార్య ఏం చేస్తుంది?